Sunday, August 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు

- Advertisement -

పోరాటాల పురిటి గడ్డపై 36వ అఖిల భారత కిసాన్‌ మహాసభ
ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి
లోగోను ఆవిష్కరించిన పోతినేని, సాగర్‌
మహాసభకు ముందు సెమినార్లు లక్ష మందితో బహిరంగ సభ
ఇంటింటికీ ప్రచారం.. విస్తృతంగా కళాప్రదర్శనలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్‌) 36వ మహాసభలు నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరుగనున్నాయి. ఈ స్థాయి మహాసభలను మునుపెన్నడూ అక్కడ నిర్వహించ లేదు. వీరతెలంగాణ పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో జరిగే ఈ మహాసభలకు ప్రత్యేకత ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, కూలీలు, విద్యార్థి, యువజనులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలనూ, చట్టాలను తీసుకొచ్చింది. వాటి ప్రభావంతో సమస్త ప్రజానీకం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఏఐకేఎస్‌ అఖిల భారత ‌రైతు మహాసభలను నిర్వహించటాన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం. ఈ మహాసభల్లో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యాచరణ తీసుకోబోతున్నాం…’ అని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్‌ అఖిల భారత నాయకులు జూలకంటి రంగారెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌‌రావు, టి సాగర్‌, సీనియర్‌ ‌నాయకులు సారంపల్లి మల్లారెడ్డితో కలిసి జూలకంటి మహాసభల లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ…నల్లగొండలో మొట్టమొదటి సారిగా ఏఐకేఎస్‌ అఖిల భారత మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రొఫెసర్లు, మేధావులతో సెమినార్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గడపకు మహాసభల సందేశాన్ని తీసుకెళతామని, ఇందుకోసం ప్రచార దళాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహాసభల ప్రారంభ సూచికగా లక్షమందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని 
చాటి చెప్పేందుకే
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో మహాసభలను నిర్వహించబోతున్నామని పోతినేని, సాగర్‌ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న లక్నోలో ఏర్పాటైన ఏఐకేఎస్‌ 90 ఏండ్లుగా రైతాంగ హక్కుల కోసం పోరాడుతున్నదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నాలుగు జాతీయ మహాసభలు జరిగాయనీ, ప్రతీ మహాసభ రైతాంగ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 12 ఏండ్లుగా అమలు చేస్తున్న విధానాల వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వలస కార్మికులు పెద్దఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల ద్వారా దిగుమతి సుంకాలు లేకుండా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ధాన్యాలు, పాల ఉత్పత్తులు దేశంలోకి వస్తే భారత రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగ రక్షణ కోసం జరిగిన పోరాటంలో ఏఐకేఎస్‌ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.

ఈ పోరాటంలో 736 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఎఫ్‌‌సీఐకి సంబంధించిన ధాన్యం నిల్వ సౌకర్యాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యానికి కేంద్రం అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈనెల 10న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయానికి సబ్సిడీలను పెంచాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులను రుణ విముక్తులను చేయాలని, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని కోరారు. ఈ అంశాలపై దేశవ్యాప్తంగా విస్తృత ఉద్యమాలకు మహాసభ దిశా నిర్దేశం చేయబోతోందని వివరించారు. మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి 850 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

​సాంస్కృతిక దళాలు..
మహాసభల సందర్భంగా పాటలు, నాటికలు, వివిధ కళా రూపాలను రూపొందించేందుకు వీలుగా కవులు, రచయితలతో వర్క్‌ ‌షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ విధానాలను పాట, ఆట, ఇతర రూపాల్లో ప్రజలకు అర్థమయ్యేలా చిత్రించాలని సూచించారు. రైతాంగ పోరాటాలతో పాటు, వీరతెలంగాణ పోరాట గాథలను నేటి తరానికి అర్థమయ్యేలా రూపొందించాలని కోరారు. ప్రజలను కదిలించేది పాటేనని చెప్పారు. ప్రజలు అనుభవిస్తున్న బతుకు బాధలను అర్థం చేసుకుంటే పాటలను సులభంగా కట్టొచ్చని అన్నారు. ఆ కోవలో నుండే..బండెనక బండికట్టి, ఆ చల్లని సముద్రగర్భం, వందేమాతరం లాంటి పాటలు వచ్చాయని గుర్తు చేశారు. అవి నేటికీ ప్రజల మదిలో మెదులుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, కోశాధికారి మూడ్ శోభన్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఎం జె వినోద్, కార్యదర్శి కట్టా నరసింహ్మ, ప్రముఖ రచయిత దేవేంద్ర, కాకం అంజన్న, ఆనంద్, చుక్కా రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా జూలకంటి
మహాసభల నిర్వహణకోసం ఆహ్వాన సంఘాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. గౌరవాధ్యక్షులుగా వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ ‌చాన్సలర్‌ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, చీఫ్ ప్యాట్రన్ గా తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి, అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కోశాధికారిగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. చీఫ్‌ ‌ప్యాట్రన్సు, ప్యాట్రన్స్‌, ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శులు, కమిటీ సభ్యులుగా ఆయా సంఘాల నేతలు ఆహ్వాన సంఘం కమిటీలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -