150 పోస్టులకు 3 వేల మందికిపైగా హాజరు
నియంత్రించడానికి అధికారుల అవస్థ
పోలీసుల సహకారంతో సజావుగా ప్రక్రియ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. యువకులు, నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకుని రావడంతో వారిని కంట్రోల్ చేయడంలో అక్కడి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. హైడ్రాలో 100 మంది డీఆర్‌ఎఫ్ అసిస్టెంటెంట్లతో పాటు 50 మంది డ్రైవర్ ఉద్యోగాల నియామకాన్ని అధికారులు చేపట్టారు. ఈ నెల 8, 9 తేదీల్లో సరూర్‌నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైడ్రా ఇదివరకే మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. 3 వేల మందికి పైగా తరలి రావడంతో దరఖాస్తులు స్వీకరించడం, ఫిజికల్ టెస్టు కోసం టోకెన్లు జారీ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఒక్కసారిగా దూసుకురావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఆ సమయంలో ఓ అధికారి అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత సదరు అధికారి అక్కడి వచ్చిన వారికి సర్దిచెప్పారు. యువత కూడా అర్థం చేసుకొని సహకరించడంతో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైనా అందరి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని, శారీరక పరీక్షలకు అవకాశం కల్పిస్తామని పదేపదే లౌడ్ స్పీకర్లలో అధికారులు అనౌన్స్ చేయడంతో నియామక ప్రక్రియ సజావుగా సాగింది.



