పోస్టు సీనియర్ అసిస్టెంట్..ఐటీడీఏకు అన్నీ ఆయనే
పీడీ, మేనేజర్ అన్నీ తానై
విధుల నిర్వహణ
2015 నుంచి ఐటీడీఏకు
సిబ్బంది కొరత
పదేండ్లుగా ఆగిన ఆర్థిక సాయం
సంక్షేమానికి చెంచులు దూరం
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
చెంచుల అభివృద్ధి కోసం ఏర్పడిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతోంది. చెంచుల సమస్యలను గుర్తించి పరిష్కారం చేయాల్సిన ఐటీడీఏను సిబ్బంది కొరత వేధిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని శ్రీశైలం నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా మున్ననూరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 11 ఏండ్ల నుంచి ఒక్కరే ఆ సంస్థను నడిపిస్తున్నారు. 2015లో శ్రీశైలం నుంచి విడిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి సీనియర్ క్లర్క్ మున్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి పనినీ ఆయనే చూస్తున్నారు. చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థకు పీఓ, ఏపీఓతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో చెంచులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు. ప్రధానంగా 10 ఏండ్లుగా ఆగిపోయిన ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరణ చేయాలని చెంచులు కోరుతున్నారు. ఐటీడీఏను బలోపేతం చేయడానికి సిబ్బందిని నియమించి చెంచులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని గిరిజన సంఘం, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
మున్ననూరు ఐటీడీఏ పరిధిలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 150 గ్రామాలు, 26 మండలాల పరిధిలో 4500 కుటుంబాల్లో 15,500 మంది చెంచులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్, భద్రాచలం ఐటీడీఏ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ఏ ఐటీడీఏలోనూ సిబ్బంది కొరత లేదు. ఒక్క మున్ననూరు ఐటీడీఏలో మాత్రం ఒకే ఒక్కడు అన్నట్టుగా నడుస్తోంది. సేక్టార్ వైజ్‌గా సిబ్బంది ఉండాలి. అకౌంటెంట్, ఐటీడీఏ జిల్లా అధికారి, మేనేజర్ , టైపిస్ట్, అటెండర్ ఉండాలి. మున్ననూరులో సీనియర్ అసిస్టెంట్ అన్నీ తానై విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది లేకపోవడం వల్ల ఐటీడీఏలో పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి. విస్తారమైన అటవీ ప్రాంతంలో చెంచులకు ఆరోగ్య సమస్యలు, తాగునీరు, ఆహార సమస్య, పేదరికం, విద్య, వైద్యం అందకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న చెంచులను పట్టించుకనే నాధుడు లేడు. ప్రధానంగా వర్షాకాలంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే చెంచులకు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆరోగ్య సమస్య వస్తే.. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్చంపేట, వటవర్లపల్లికి వెల్లాల్సిందే.
ప్రభుత్వ శాఖల సమన్వయం లోపం
చెంచులకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వ శాఖల సమన్వయం అవసరం. చెంచులకు వైద్యం సేవలు అందించే విషయంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి లేదా అచ్చంపేట ఆస్పత్రిలో చికిత్స కోసం వైద్య ఆరోగ్య శాఖకు ఐటీడీఏ సిబ్బంది పంపుతారు. అయితే ఇక్కడ ఐటీడీఏలో సిబ్బంది లేకపోవడం చేత వీరికి నాణ్యమైన వైద్యం అందడం లేదు. విద్య, గృహ నిర్మాణం, ఉపాధి, చెంచులు సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం, మిషన్ భగీరథ ద్వారా సాగు నీరు అందించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన ఐటీడీఏ సిబ్బంది కొరత వలన చేతులెత్తేస్తున్నారు. సరిపడ సిబ్బంది లేక చెంచులకు అందాల్సిన పథకాలు చేరట్లేదు.
పేరుకే చెంచులకు పునరావాసం
నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే వటవర్లపల్లి గ్రామ చెంచులను మైధాన ప్రాంతానికి తరిలించేందుకు చర్యలను ముమ్మరం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ సమీపంలో వీరికి పునరావాసం కల్పిస్తున్నారు. అయితే అటవీ ఆధారంగా జీవించే నిజమైన చెంచులు అటవీ ప్రాంతాన్ని వీడేందుకు సిద్దంగా లేరు.
నిలిచిన ఆర్థిక సహాయం
ఐటీడీఏ పరిధిలో చెంచులకు 10 ఏండ్ల నుంచి రుణాలు ఇవ్వడం ఆపేశారు. మూడేండ్ల కింద కొందరికి ఇచ్చినా అవి పూర్తి స్థాయిలో అందలేదు. చెంచులను అటవీ ప్రాంతం నుంచి బయటకు పంపాలన్న ఆలోచనతో వీరికి సంక్షేమ పథకాలేవీ అమలు చేయడం లేదనే చర్చ ఉంది. రుణాలు మంజూరు చేస్తే అటవీ ప్రాంతం వదలిపెట్టరు అనే ఆలోచనతో ఆర్థిక సాయం చేయట్లేదు. ఇందిరమ్మ ఇండ్లు, వృత్తి సహాయక చర్యలు, అటవీ ఫలాల సేకరణ తధితర వాటికి రుణ సదుపాయం ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపేసింది.
ఐటీడీఏను బలోపేతం చేయాలి
చెంచుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. ముఖ్యంగా చెంచులు అమాయకులనే ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఐటీడీఏకు కూడా సిబ్బందిని నియమించాలి. చెంచులను ఆర్థికంగా అభివృద్ది చేయడం కోసం అవసరమైన నిధులు కేటాయించాలి. సంక్షేమ, అభివృద్ధి పనులు కొనసాగించాలి.
సిబ్బందిని నియమించాలి
జాఫర్ హుస్సేన్, సీనియర్ అసిస్టెంట్,ఐటీడీఏ మున్ననూరు, నాగర్‌కర్నూల్ మున్ననూరు ఐటీడీఏలో నేను ఒక్కడినే విధులు నిర్వహిస్తున్నాను. దీంతో చెంచులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే సిబ్బందిని నియమించాలి.



