విస్తృత ప్రచారానికి
సర్కారు వ్యూహా రచన
విపక్షాన్ని ఎదుర్కొంటూనే పకడ్బందీగా ముందుకు
సోషల్‌మీడియాను మరింతగా వినియోగించుకునే యత్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదనే భావనలో సర్కారు ఉంది. ఆర్థిక పరిమితులున్నా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ నిధులు ఖర్చుపెడుతున్నాం, అయినా జనంలోకి ప్రభుత్వ కృషి పోవడం లేదనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాతోపాటు సోషల్‌మీడియాలోనూ భారీ ప్రచారం దొరకడం లేదని అనుకుంటున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా ‘కష్ట పడుతున్నాం..అయినా ప్రజలకు ఆ కష్టం పూర్తిస్థాయిలో చేరడం లేదు’ అని ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యూహారచన చేస్తున్నది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ సైతం చేపట్టింది. ఈ మేరకు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం చేసే అన్నీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేలా సమాచార వ్యవస్థకు మరింత పదును పెట్టాలనే యోచనకు కార్యరూపం ఇస్తున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణాలకు వడ్డీ కడుతూ సంసార బండీని విజయవంతంగా లాగుతున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహాచరులు భావిస్తున్నారు. ఆమేరకు మీడియా, సోషల్‌మీడియా , ఇతర మాధ్యమాల్లో ప్రచారం కనిపించడం లేదని అక్కడక్కడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రింట్, ఎలక్రానిక్ మీడియానూ వినియోగించుకుంటూనే సోషల్‌మీడియాలో భారీగా ప్రచారం వచ్చేలా చేసుకోవాలని తపన పడుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం వచ్చేలా గట్టి చర్యలకు పూనుకుంటోంది. ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాను వినియోగించుకోవడానికి సర్కారుకు కొన్ని పరిమితులు సహజంగానే ఉంటాయి.
అదే సొంత సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుంటే, సోషల్‌మీడియాలో భారీస్థాయిలో ప్రయోజనం పొందొచ్చని భావిస్తున్నది. విపక్షం బీఆర్‌ఎస్ , ప్రతిపక్షాల బీజేపీ, ఇతర పార్టీల మీడియాతోపాటు జాతీయ స్థాయిలో కొంత ఇతరత్రా అధ్యయనం చేసిన అనంతరం ప్రచారాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు గుర్తించింది. ఈమేరకు ఇటీవల మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో మూడు రోజులపాటు సీఎం పీఆర్‌వోలు, మంత్రుల పీఆర్‌వోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేలా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకునేలా శిక్షణ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ , ప్రొఫెసర్ డాక్టర్ కె.నాగేశ్వర్ లాంటి ప్రముఖుల చేత శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి చేరేలా ప్రచారం చేసేందుకు ఇతర చర్యలను తీసుకుంటున్నది. పలువురు జర్నలిస్టులకు ఈ బాధ్యతలను అప్పగించే పనిలో ఉంది. ఇప్పటికే కొందరిని ఆ పనిలో పెట్టుకున్నది. ఇంకా కొందరిని అందులో భాగస్వాములను చేయాలని అనుకుంటున్నది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనుంది. సమాచార, పౌరసంబంధాల శాఖ చేసే సాధారణ పనికి అదనంగా సొంత సోషల్ మీడియా వ్యవస్థను విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం చేసే పనులు, సమావేశాలు, ఇతర విషయాలను ప్రచారం చేస్తుంది.
ఈ శాఖలోని అధికారులకు సైతం ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. జిల్లా, రాష్ట్రస్థాయి పౌరసంబంధాల శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చింది. సోషల్ మీడియా వింగ్‌కు అదనంగా డిజిటల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఫైలు ప్రభుత్వంలో నడుస్తున్నది. అయితే డిజిటల్, సోషల్ మీడియా వింగ్‌లు 24 గంటలూ సమాచారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఎక్స్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ తదితర ప్రధాన హ్యాండిళ్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తున్నది. ఇదిలావుండగా ఏకంగా ఒక పత్రికను సైతం త్వరలో ప్రారంభించబోతున్నారనే ప్రచారం సైతం అటు గాంధీభవన్, ఇటు సచివాలయంలో జరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ప్రచారం, సంక్షోభ సమాచార ప్రసారం, ప్రభుత్వాన్ని అప్రత్టిష్టపాల్జేసే సమాచారాన్ని ఎదుర్కోవడం, సీఎంవోకు ప్రజలు, ఇతరులు చేసే ట్యాగ్‌లకు చురుగ్గా స్పందించడం ఇప్పటికే కొంత చేస్తున్నారు. దీన్ని మరింత పెంచుకోవాలనే భావనలో సీఎం ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.



