వరి వేస్తే నష్టపోయే ప్రమాదం
నల్లగొండలో కరువు ఛాయలు
మరో 1.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు
సాగునీటి సలహా మండలి తొలి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌నినో ప్రభావంతో నల్లగొండ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని, రైతులు వరికి దూరంగా ఉండి ఆరుతడి, తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్లాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా సాగునీటి సలహా మండలి తొలి సమావేశం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే సాగు చేసిన ఆరుతడి పంటలతో పాటు మరో 1.50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని , సాగునీటి విడుదలపై ఆధారపడి వరి సాగు చేయడం ప్రమాదకరమని వివరించారు. రాబోయే ఆరు నెలలపాటు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, బోర్లలోనూ నీటిమట్టాలు తగ్గొచ్చన్నారు. బోర్లు, ఇతర నీటి వనరుల ఆధారంగా ఇప్పటికే సాగు చేసిన ఆరుతడి పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
తక్కువ నీటితో సాగు సాధ్యమయ్యేలా తుంపర సేద్యాన్ని విస్తరించాలని రైతులకు సూచించారు. జిల్లాకు అవసరమైన తుంపర సేద్యం పరికరాలకు ప్రభుత్వంతో ప్రత్యేక మంజూరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఫార్మ్ పాండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులకు ఇంకుడు గుంతలను తప్పనిసరి చేయాలని అధికారులకు సూచించారు. పడిన ప్రతి వర్షపు నీటి చుక్కనూ ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టాలని, వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాకు అవసరమైన విద్యుత్ పరికరాలను వారం రోజుల్లో తెప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాగునీటి సలహా మండలి సమావేశాలను ఇకపై నిరంతరం నిర్వహించాలని మంత్రి చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించడం, చివరి ఆయకట్టు వరకు నీటిని చేర్చడం, నీటి వృథాను అరికట్టడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మెన్ జూకురి రమేష్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మెన్ శేఖర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మెన్, హాలియా, నిడమనూరు పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.


