చేతులెత్తేసిన పీఏసీఎస్ లు
రవాణా, హమాలీ ఛార్జీల చెల్లింపును నిలిపేసిన మార్కెఫెడ్
లబోదిబోమంటున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లు యూరియా బుకింగ్ ను నిలిపేశాయి. రవాణా, హమాలీ చార్జీలను చెల్లింపును నిలిపేస్తున్నట్లుగా ఇటీవల మార్క్ ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఆదేశాలు అందాయి.ఈనిర్ణ యంతో పీఏసీఎస్‌లకు నష్టం వాటిల్లుతుందని, ఈ నేపథ్యంలో యూరియా అమ్మలేమని మూడు వారాలుగా బుకింగ్‌లు నిలిపేశారు.దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 పీఏసీఎస్‌లు ఉండగా గ్రామీణా ప్రాంతాల్లో ఉన్న పీఏసీఎస్‌లు మార్క్ ఫెడ్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుని స్వల్ప ఆదాయంతో రైతులకు అందజేసే వారు.ఇలా ప్రతీ వారం 11 పీఏసీఎస్‌లకు 20కి పైగా లారీల్లో వందలాది మెట్రిక్ టన్నుల యూరియా గ్రామాలకు చేరుకునేది. యూరియా దిగుమతికి అవసరమైన రవాణా ఛార్జీలను మార్కెఫెడ్ నుంచే చెల్లించేవారు.యూరియా దిగుమతి రవాణా, హమాలీ చార్జీలను మీరే భరించాలని జులై 14న మార్క్ ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఉత్తర్వులు అందాయి.మార్కెఫెడ్ నుంచి ప్రతివారం వందకు పైగా లారీలు వస్తే రవాణా ఛార్జీల కింద రూ.4 లక్షలు నష్టపోవాల్సి వస్తుంది.లాభాలు దేవుడెరుగు కానీ రూ. లక్షల్లో నష్టాలను భరించడం తమ వల్ల కాదని సొసైటీలు చేతులెత్తేస్తున్నాయి.
యూరియా బస్తా అమ్మకాలు ఇలా (బస్తా)..
మార్కెఫెడ్ నుంచి అందే ధర రూ.252.43 పైసలు.పీఏసీఎస్‌లు రైతులకు విక్రయించే ధర.రూ.267.ఒక బస్తా యూరియా అమ్మితే పీఏసీఎస్‌లకు వచ్చే లాభం: రూ. 14.57 పైసలు. ఒక లారీ (450 బస్తాలు) లోడ్ యూరియా అమ్మితే వచ్చే లాభం రూ. 6,556.50 పైసలు.లారీ నుంచి యూరియా దించుకోవడం కోసం హమాలీ చార్జీలు రూ.4,500 (బస్తాకు రూ.10 చొప్పున.) లారీ లోడ్( 450 బస్తాల) యూరియా అమ్మితే పీఏసీఎస్‌లకు మిగిలే లాభం కేవలం 2,056.50 పైసలు. ప్రస్తుతం రవాణా చార్జీల రద్దుతో మార్కెఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు యూరియా దిగుమతి చేసినందుకు గాను లారీ ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీ రూ.20 వేలు,అంటే ప్రతి లారీ యూరియా లోడ్పైన పీఏసీఎస్‌లకు రూ. 17,943.50 నష్టం వస్తుంది.
రైతులు చెల్లిస్తే..ఇప్ప మొండయ్య, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్
ఇన్నాళ్లూ యూరియా దిగుమతి చేసుకుంటే మార్క్ ఫెడ్ నుంచి రవాణా ఛార్జీలు చెల్లించే వారు. జులై 14 నుంచి ఛార్జీల చెల్లింపులు నిలిపేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. దీంతో యూరియా అమ్మకాల వల్ల నష్టపోతాయనే భయంతో సొసైటీలు బుకింగ్‌ను నిలిపేశాయి. రవాణా, హమాలీ ఛార్జీలు రైతులు చెల్లించినట్లయితే పీఏసీఎస్‌లు యూరియా అమ్మకోవచ్చు.



