Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మంప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

- Advertisement -

– రైతులకు తప్పని ప్రత్యామ్నాయ పంటల సాగు..
– 30 శాతం వర్షాభావంతో రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు
– వరి సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పైగా తగ్గిన వైనం 
నవతెలంగాణ – అశ్వారావుపేట

వానాకాలం – 2026 లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వర్షపాతం,ఎల్‌నినో ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.వానాకాలం నాలుగు నెలల్లో ఇప్పటికే రెండున్నర నెలలు పూర్తవగా, మిగిలిన కాలంలో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలు సాగు చేయడం కష్టసాధ్యమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

వర్షాభావానికి తోడు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో బోరు సౌకర్యం ఉన్న రైతులు కూడా వరి నాట్లు వేయవద్దని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. సెప్టెంబర్‌లోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో పాటు, విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తక్కువ నీటి అవసరమయ్యే అపరాల పంటలు, నూనెగింజల పంటలు, చిరుధాన్యాల సాగు వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది. మినుము, పెసర, కంది, అలసంద, నువ్వులు, వేరుశనగ, సన్‌ఫ్లవర్, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో ఈ వానాకాలంలో ఇప్పటివరకు వరి సాగు 30,489 ఎకరాలకు పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయానికి 40,206 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 9 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణం తగ్గింది. రెండో ప్రధాన పంట అయిన పత్తి గత ఏడాది 33,360 ఎకరాల్లో సాగైంది.

వరి సాగు తగ్గిన భూముల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ ఏడీఏ పెంటేల రవికుమార్ తెలిపారు. అశ్వారావుపేటలో మినుము, చంద్రుగొండలో మిరప, దమ్మపేట – ములకలపల్లిలో వేరుశనగ, దమ్మపేటలో ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యం ఉందన్నారు. మినుము సాగు ఇప్పటికే ప్రారంభమైందని, ఆత్మనిర్భరత మిషన్ పథకం కింద 50 శాతం రాయితీపై మినుము విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. నీటి వసతి ఉన్న రైతులను ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

ఆగస్టు 10 నాటికి మండలాల వారీగా సాధారణం, నమోదు అయిన వర్షపాతం మిల్లి మీటర్ లలో..దాని పరిస్థితి.

మండలం       సాధారణం       నమోదు        పరిస్థితి 

అన్నపురెడ్డిపల్లి   544.9           375.9      31% లోటు

అశ్వారావుపేట    521.6          263.6   49.4% లోటు

చంద్రుగొండ         519.6          631.6  21.6% అధికం

దమ్మపేట            576.8          235.2    59.2% లోటు

ములకలపల్లి       617.3         381.4    38.2% లోటు

మొత్తం అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో ఆగస్టు 10 నాటికి సాధారణంగా కురవాల్సిన 555.8 మి.మీ. వర్షపాతానికి గాను 377.5 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో డివిజన్‌లో 30 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

విశ్లేషణ: ఐదు మండలాల్లో నాలుగు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవగా, చంద్రుగొండ మండలం మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు చేసింది. మొత్తం డివిజన్‌లో 30 శాతం లోటు ఉండటంతో, మిగిలిన వానాకాలంలో ప్రత్యామ్నాయ పంటల సాగే రైతులకు ఆర్థికంగా, వ్యవసాయపరంగా అనుకూల మార్గమని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -