తాళ్లపెల్లి రాజన్న మృతితో శాయంపేటలో విషాదం
నవతెలంగాణ – గీసుగొండ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్లపెల్లి రాజన్న (55) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతితో శాయంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న కాలికి తీవ్ర గాయమైంది. దీంతో గార్డెన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. అయితే నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం రోహిణి ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు.
ప్రస్తుతం సంగెం మండలం కాట్రపల్లిలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రాజన్న.. ఎంతోమంది విద్యార్థులను క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేలా ప్రోత్సహించారు. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఆయన చేసిన కృషిని పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు గుర్తుచేసుకున్నారు.రాజన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఆయన కుమారుల్లో ఒకరు ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందారు. తాజాగా రాజన్న కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజన్న మృతిపట్ల పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, శాయంపేట గ్రామ ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.



