ఒక నాగరిక సమాజాన్ని అంచనా వేయాలంటే అది ఎంత సంపద సృష్టించిందో, ఎన్ని ఎత్తైన భవనాలు నిర్మించిందో చూడాల్సిన అవసరం లేదు. సమాజంలోని అత్యంత బలహీన, చారిత్రకంగా అణచివేయబడిన, అవకాశాలకు దూరమైన మనుషులను ఎంత గౌరవంగా నిలబెట్టిందో, వారికి ఎంత న్యాయం చేసిందో చూడాలి. అదే ప్రజాస్వామ్యానికి, దేశ నాగరికతకు అసలైన కొలమానం. భారతదేశంలో వేల సంవత్సరాల కులవ్యవస్థ నిర్మించిన అసమానతలు రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా అనేక రూపాల్లో కొనసాగుతున్నాయి. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించిన రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో, కేవలం చట్టపరమైన సమానత్వం సరిపోదని భావించారు. శతాబ్దాలుగా విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, అధికార వ్యవస్థ, సామాజిక గౌరవం, ప్రజా జీవితంలో ప్రాతినిధ్యానికి దూరంగా ఉంచబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని నిర్ణయించారు. ఆ ఆలోచనకు ఆచరణ రూపమే రిజర్వేషన్. అందువల్ల అది ఏ ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీకి చెందిన తాత్కాలిక విధానం కాదు, రాజ్యాంగం స్వీకరించిన సామాజిక న్యాయసూత్రానికి ఆచరణ.
ఏదైనా ఉద్యమం వచ్చిన ప్రతిసారి రిజర్వేషన్ల అంశం మళ్లీ చర్చకు రావడం యాదృచ్ఛికం కాదు. ముఖ్యంగా నిరుద్యోగం, ప్రభుత్వ నియామకాల ఆలస్యం, ఖాళీ పోస్టులు, పరీక్షల పారదర్శకత, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, ప్రయివేటీకరణ వంటి సమస్యలపై జెన్-జీ యువత ప్రశ్నిస్తున్న సమయంలో ‘రిజర్వేషన్ హటావో’ వంటి నినాదాలు ముందుకు రావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లను సమర్థించే హక్కు ఉన్నట్లే, విమర్శించే హక్కు కూడా ఉంది. కానీ చరిత్రను, రాజ్యాంగాన్ని, సామాజిక వాస్తవాలను విస్మరించి విమర్శిస్తే అది కేవలం అభిప్రాయం కాకుండా భావజాల పోరాటంగా మారుతుంది. రిజర్వేషన్లను భారతదేశంలోని ప్రతి సమస్యకు కారణంగా చూపించే ప్రచారం కూడా జరుగుతోంది. నిరుద్యోగం పెరిగినా, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గినా, పోటీ అవకాశాలు తగ్గినా కారణం రిజర్వేషన్ అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రభుత్వ ఉద్యోగాల కొరత. లక్షలాది ఖాళీలు భర్తీకాకుం డా ఉన్నాయి. నియామకాలు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ వైపు వెళ్తున్నాయి. పోటీ పరీక్ష ల్లో ఆలస్యాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు వంటి సమస్యలు ఉన్నా యి. కాబట్టి రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గడం కాదు, ఉద్యో గాల సంఖ్యే తగ్గుతోంది. ఈ నిర్మాణాత్మక సమస్యలను పక్కన బెట్టి ఒక వర్గంపై అసంతృప్తిని మళ్లించడం పరిష్కారం కాదు.
రిజర్వేషన్లపై వ్యతిరేక వాదనల్లో ఎక్కువగా వినిపించే పదం ‘మెరిట్’. కానీ మెరిట్ అంటే ఏమిటి? ఒక విద్యార్థికి చిన్నప్పటి నుంచే మంచి పాఠశాల, ఖరీదైన కోచింగ్, డిజిటల్ వనరులు, చదువుకున్న తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ఉంటే, మరో విద్యార్థి పేద కుటుంబంలో, పరిమిత వనరులతో, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ చదువుకుంటాడు. ఇద్దరినీ ఒకే గీతపై నిలబెట్టి మార్కులనే ప్రతిభగా ప్రకటించడం న్యాయమా? అసమాన ప్రారంభ పరిస్థితులను విస్మరించి ‘అందరికీ ఒకే పరీక్ష’ అనడం సమానత్వం కాదు. రిజర్వేషన్ ప్రతిభకు వ్యతిరేకం కాదు, అవకాశాలు లేని ప్రతిభకు అవకాశం కల్పించే విధానం. భారతదేశంలో అధికారిక రిజర్వేషన్లపై తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ, అనధికారికంగా కొనసాగుతున్న సామాజిక ఆధిపత్యాలపై అంతగా చర్చ జరగడం లేదు. ఉన్నత న్యాయవ్యవస్థ, కార్పొరేట్ రంగం, ప్రయివేటు విద్యా సంస్థలు, మీడియా, పరిశ్రమలు, పెద్ద వ్యాపార వ్యవస్థల్లో సామాజిక ప్రాతినిధ్యం ఎలా ఉందో కూడా పరిశీలించాలి. శతాబ్దాలుగా కొనసాగిన విద్య, భూమి, సంపద, సామాజిక, సాంస్కృతిక మూలధనం కూడా ఒక రకమైన వారసత్వ ప్రయోజనమే కాదా? ఇవి చర్చకు రాకుండా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లనే అసమానతగా చిత్రీకరించడం పూర్తి చిత్రాన్ని చూపదు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, పెరియార్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు సమాన అవకాశాలు లేకుండా సమానత్వం సాధ్యం కాదని చెప్పారు. అదే ఆలోచనను రాజ్యాంగం చట్టబద్ధం చేసింది. అధికరణాలు 15(4), 16(4), 46 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం రాష్ట్ర బాధ్యత అని స్పష్టం చేస్తున్నాయి. అంటే రిజర్వేషన్ రాజ్యాం గానికి మినహాయింపు కాదు, రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ సాధనం.రిజర్వేషన్ శాశ్వత వ్యవస్థ కాదని అంబేద్కర్ భావించారు. సమాజంలో నిజమైన సమానత్వం ఏర్పడినప్పుడు ప్రత్యేక రక్షణల అవసరం తగ్గుతుందని ఆయన ఉద్దేశం. కానీ విద్య, భూమి, ఆదాయం, సామాజిక ప్రాతినిధ్యం, అధికార వ్యవస్థల్లో అసమానతలు కొనసాగుతున్నప్పుడు రాజ్యాంగం కల్పించిన రక్షణలను తొలగించాలని కోరడం సామాజిక న్యాయాన్ని బలహీనపరచడమే.
నేడు నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ విద్య, పరీక్షల పారదర్శకత, రైతుల సమస్యలు, పెరుగుతున్న ఆర్థిక అసమానత వంటి అంశాలపై యువత ప్రశ్నిస్తున్న సమయంలో రిజర్వేషన్లను ప్రధాన చర్చాంశంగా మార్చడం వల్ల అసలు సమస్యలపై దృష్టి మరలే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా ఈ చర్చను మరింత ప్రభావితం చేస్తోంది. ఒక నిమిషం వీడియో, ఒక పోస్టర్ లేదా సందర్భం లేని గణాంకాలతో సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు సులభమైన కారణాలు చూపిస్తున్నారు. ‘రిజర్వేషన్ల వల్లే నిరుద్యోగం’, ‘రిజర్వేషన్ల వల్లే ప్రతిభ నశిస్తోంది’ వంటి నినాదాలు వాస్తవ పరిస్థితిని పూర్తిగా వివరించలేవు. గత ఏడు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే రిజర్వేషన్ల ద్వారా లక్షలాది మంది మొదటి తరం విద్యార్థులు వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, సివిల్ సర్వెంట్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా ఎదిగారు. ఎన్నో కుటుంబాలు మొదటిసారి విద్య, గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక స్థిరత్వాన్ని పొందాయి. ఇది వ్యక్తిగత విజయమే కాదు, సామాజిక న్యాయం వైపు భారత ప్రజాస్వామ్యం వేసిన అడుగు.అందుకే యువత సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను, ప్రతి నినాదాన్ని, ప్రతి గణాంకాన్ని తుది సత్యంగా నమ్మకుండా చరిత్ర, రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, సమాజంలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. విమర్శించాలి, ప్రశ్నించాలి, చర్చించాలి. కానీ వాస్తవాలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా ఉండాలి. భారతదేశం మరింత బలమైన ప్రజాస్వామ్యంగా ఎదగాలంటే అన్ని వర్గాల భాగస్వామ్యం, పెరిగిన ప్రాతినిధ్యం, అందరికీ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల పెంపు, ప్రయివేటు రంగంలో సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, పారదర్శక నియామక వ్యవస్థ, యువతకు గౌరవప్రదమైన ఉపాధి అవసరం. రిజర్వేషన్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి నేటి అవసరం ‘రిజర్వేషన్ హటావో’ అనే విభజనాత్మక నినాదం కాదు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’, ‘సామాజిక న్యాయాన్ని బలోపేతం చేద్దాం’, ‘ప్రతి యువకుడికి సమాన అవకాశం కల్పిద్దాం’, ‘ప్రతి భారతీయుడికి గౌరవప్రదమైన భవిష్యత్తు నిర్మిద్దాం’ అనే నిర్మాణాత్మక ఆలోచన అవసరం. సమాజంలో అందరికీ సమాన అవకాశం లభించినప్పుడే ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. అదే భారత రాజ్యాంగం మనకు నేర్పిన గొప్ప పాఠం.
భరత్ చౌహాన్,
9030666999
రిజర్వేషన్ హటావో కాదు… అసమానత హటావో!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



