సిరా చల్లడం క్షణంలో జరిగిపోయే పని. ముఖం నల్లబడుతుంది, బట్టలకు మరక పడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ మరకను కడిగేయవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఒకరి ముఖంపై పడిన సిరా వెనుక ఉన్న ప్రశ్నను మాత్రం అంత సుల భంగా తుడిచేయలేం. జార్ఖండ్‌లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై జరిగిన సిరా దాడి అలాంటి ఘటనే. ఇది ఒక విద్యార్థి నాయకురాలిని అవమానించడం మాత్రమే కాదు. నిరసన తెలిపే హక్కును, రాజ్యాంగాన్ని కూడా. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ) సీజీఎల్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్‌ల ఆరోపణలపై ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలతో కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జేపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాలని, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలను రద్దు చేసి కొత్త షెడ్యూల్ ప్రకటించాలని, ప్రయి వేటు ఏజెన్సీల ద్వారా పరీక్షలు నిర్వహించకూడదని, నియామకాల్లో పారదర్శకత ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన నేహా బోరా రాంచీలో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ బిర్సా చౌక్ సమీపానికి చేరుకున్న సమయంలో గుంపులో నుంచి అరెస్సెస్ మద్దతుదారునిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి నేహా బోరాతో పాటు కొందరు మహిళా నాయకు రాళ్లపై సిరా చల్లాడు.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ‘నేహా దేశద్రోహి. ఉమర్ ఖలీద్‌కు మద్దతిస్తోంది’ అని తెలిపాడు. ఉమర్ ఖలీద్ పీహెచ్డీ విద్యార్థి, జేఎన్‌యూ నాయకుడు. క్యాంపస్‌లో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో దేశద్రోహ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన మొదటిసారి వార్తల్లోకి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), ఎన్ఆర్సికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు వెనుక కుట్ర పన్నారని ఆరోపిస్తూ, ఢిల్లీ పోలీసులు ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద జైళ్లో నిర్భందించారు. ఆయన పాకిస్థాన్ ఏజెంట్ కాదు, దేశద్రోహి అంతకన్నా కాదు.
ఎవరైనా నేహ రాజకీయ భావజాలాన్ని వ్యతిరేకించవచ్చు, ఆమె డిమాండ్లతో విభేదించవచ్చు, ఆమెను విమర్శించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ సమాధానం వాదన కావాలి, దాడి కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు. పరీక్షల్లో పారదర్శకత కోరడం దేశద్రోహం కాదు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలబడటం దేశద్రోహం కాదు. దేశం అంటే ప్రభుత్వం మాత్రమే కాదు. దేశం అంటే ప్రజలు. దేశం అంటే విద్యార్థులు. దేశం అంటే యువత భవిష్యత్తు.నేహా బోరా గతంలోనూ విద్యార్థుల సమస్యలపై ఉద్యమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి 23 రోజుల నిరవధిక నిరాహార దీక్షలోనూ ఉన్నారు. విద్యార్థి సమస్యలు, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆమె చురుకుగా పనిచేస్తున్నారు.సిరా దాడి తర్వాత కూడా భయపడబోనని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. అదే అసలు సమాధానం. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఐసా నాయకులు చేసిన ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. దాడి చేసిన వ్యక్తి ఎవరు, అతని ఉద్దేశం ఏమిటి, దాని వెనుక ఎవరైనా ఉన్నారా అన్నది చట్టం తేల్చాలి. ఆరోపణలను విచారణ లేకుండానే నిజాలుగా ప్రకటించడమూ, పూర్తిగా కొట్టిపారేయడమూ రెండూ సరికాదు.అయితే అసలు సమస్య మాత్రం విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే. పరీక్షల్లో నిజంగా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు నిజం కాకపోతే ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో విద్యార్థులకు సమాధానం చెప్పాలి. పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి. నియామకాల్లో పారదర్శకతను నిర్ధారించాలి.
ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదు. ప్రశ్నించడం, నిరసించడం, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం, ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిం చడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రక్షించడం, వారిపై దాడి జరిగితే నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత.నేహా బోరాపై పడిన సిరా ఒక ముఖాన్ని మాత్రమే నల్లబరచింది. కానీ ఆ సిరా వెనుక దాగిన ప్రశ్నలను మరింత స్పష్టంగా చేసింది.విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారు? పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని ఎవరు పునరుద్ధరిస్తారు? ప్రశ్నించే గొంతుకు రక్షణ ఎవరు ఇస్తారు?శాంతియుత నిరసన హక్కును ఎవరు కాపాడతారు? ఈ ప్రశ్నలకు సమాధానం నేహా బోరా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సింది వ్యవస్థ. అందుకే నేహా బోరాపై జరిగిన సిరా దాడి ఒక వ్యక్తిపై జరిగిన అవమానకర చర్యగా ముగిసిపోకూడదు. అది ప్రజాస్వా మ్యానికి ఒక హెచ్చరికగా నిలవాలి.
రాజేందర్ దామెర
అవి దేశద్రోహ డిమాండ్లా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



