Tuesday, August 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచర్చ లేకుండానే..!

చర్చ లేకుండానే..!

- Advertisement -

చట్టాలు చేయాల్సిన పార్లమెంటు… చర్చలకు వేదిక కావాల్సిన సభ… నినాదాలు, నిరసనలు, వాయిదాల మధ్య సాగుతోంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక బిల్లులు సభ ముందుకొస్తున్నా సరైన చర్చ జరగడం లేదనే విమర్శ వినిపిస్తోంది. బిల్లులపై విపక్షాలు అభ్యంతరాలుంటే ప్రశ్నిస్తాయి. ప్రజలకు నష్టం జరుతుందనుకుంటే సవరించాలని సూచిస్తాయి. ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలి, అనుమానాల్ని నివృత్తి చేయాలి. ఆ తర్వాతే ఓటింగ్‌ జరగాలి. కానీ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. సభ్యుల ఆందోళనల మధ్యే కొన్ని బిల్లులు నిమిషాల్లో ఆమోదం పొందడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది.

జూలై ఇరవైన ప్రారంభమైన సమావేశాలు ఆగస్టు పదమూడు వరకు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు సభలు పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడు తున్నాయి. అయోధ్య రామమందిర ట్రస్టు విరాళాల వ్యవహారంపై కూడా చర్చ చేపట్టాలని కోరుతున్నాయి. ఆ రెండు అంశా లపై ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆగస్టు పదిన ప్రభుత్వం విద్యార్థుల నిరసనలపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధమని ప్రకటించినా, అయోధ్య ట్రస్టు అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రతిష్టంభన తొలగలేదు. ఈ అంశాలపై చర్చ జరగాలన్న డిమాండ్‌కు ప్రజాస్వామ్య ప్రాధా న్యత ఉంది. కానీ, ప్రభుత్వం మందబలంతో ప్రతిపక్షాలను పక్కనపెట్టి శాసన ప్రక్రియను ముగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం చర్చకు ఎందుకు జంకుతోంది? ప్రధాని, హోంమంత్రి సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదు? సభ పలుమార్లు ఎందుకు వాయిదా పడుతోంది-ఈ ప్రశ్నలన్నింటికి అధికారపక్షం వైఖరినే కారణం. చర్చ జరగకుండా ఉండేందుకే కొన్ని అంశాలను దాటవేస్తోంది. సభ్యులు ప్రశ్నిస్తే సభను వాయిదాలతో ముగిస్తోంది. అందుకు తాజా ఉదా హరణ ‘అయోధ్య హుండీ చోరీ’. అక్కడ తప్పు జరగనప్పుడు చర్చించడానికి ఏముంది?

అది అలా ఉంచితే, ఈ సమావేశాల్లో లోక్‌‌సభ, రాజ్య సభలో ఇప్పటివరకు ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. అయితే చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆందోళనకర పరిణామం. జనన,మరణాల నమోదు సవరణ బిల్లుపై లోక్‌సభలో కేవలం నాలుగు నిమిషాలు, రాజ్యసభలో యాభై నిమిషాల చర్చ జరిగింది. ఈ బిల్లు సాధారణ పరిపాలనా మార్పుగా కనిపించినా, పౌరుల జనన, మరణ వివరాల డిజిటల్‌ నమోదు, వివిధ ప్రభుత్వ డేటా బేస్‌లతో వాటి అనుసంధానం వంటి అంశాలతో ముడిపడి ఉంది. భవిష్యత్తులో పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, డేటా వినియోగం, గోప్యత వంటి ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉన్నందున దీనిపై విస్తృత చర్చ అవసరం. ఎంఎస్‌ఎంఈ బిల్లుపై రెండు సభల్లో కలిపి గంటా ఇరవై రెండు నిమిషాల చర్చ మాత్రమే జరిగింది. ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లు దేశంలోని కోట్లాది చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపార సంస్థలతో ముడిపడి ఉంది. ఉపాధి కల్పనలో, ఉత్పత్తిలో, ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే ఈ రంగానికి సంబంధించిన చట్టంలో మార్పులు చేస్తున్నప్పుడు చిన్న పరిశ్రమల వాస్తవ సమస్యలు, బ్యాంకు రుణాలు, బకాయిల చెల్లింపులు, మార్కెట్‌ అవకాశాలు వంటి అంశాలపై సభ్యులు సమగ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

మరీ ఆందోళన కలిగించే విషయం బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లు. ఆగస్టు ఐదున లోక్‌సభలో ఇది ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. 1891 నాటి చట్టాన్ని మార్చే ఈ బిల్లు డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌, క్లౌడ్‌ ఆధారిత బ్యాంకు రికార్డులకు చట్టపరమైన గుర్తింపు కల్పిస్తుంది. ఇంత ప్రాధాన్యమైన మార్పుపై కనీసం సభ్యుల అభిప్రా యాలను నమోదు చేయాల్సిన అవసరం లేదా? ట్యాక్సేషన్‌ అండ్‌ అదర్‌ లాస్‌ సవరణ బిల్లు విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తింది. లోక్‌సభలో కేవలం మూడు నిమిషాల్లో అది ఆమోదం పొందింది. ఇదే సమయంలో నిన్న ప్రతిపక్షాలు నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సవరణ బిల్లు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సవరణ బిల్లులను స్టాండింగ్‌ కమిటీలకు పంపాలని డిమాండ్‌ చేశాయి. వీటిలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది.

అందువల్ల అధికార పక్షం సంఖ్యాబలంతో ప్రతిపక్ష స్వరాన్ని మౌనం చేయకూడదు. సభను నడపాల్సిన బాధ్యత స్పీకర్‌, చైర్మన్‌లపై కూడా ఉంది. ప్రజల డబ్బుతో నడిచే పార్లమెంటులో ప్రతి నిమిషం విలువైనదే. ఆ సమయాన్ని వాయిదాల పర్వానికీ, చర్చలేని ఆమోదాలకు బలిచేయడం తగదు. చట్టాలు చేయడంకంటే ముందు వాటిపై మాట్లాడాలి. సంఖ్యాబలం ఉందనే ధీమాతో చర్చను పక్కనపెట్టి బిల్లులను ఆమోదించుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజల తరఫున ప్రశ్నలు వినిపించే పార్లమెంటును కేవలం బిల్లులకు ముద్రవేసే వేదికగా మార్చకుండా, చర్చకు సముచిత స్థానం ఇవ్వాల్సిన బాధ్యత అధికార పక్షానిదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -