సైనిక కాంట్రాక్టర్లను కోరిన పెంటగాన్
వాషింగ్టన్ : ఇరాన్‌పై జరిపిన యుద్ధంలో తన వద్ద ఉన్న ఆయుధ నిల్వలు అడుగంటిపోవడంపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేయాలంటూ సైనిక కాంట్రాక్టర్లను పెంటగాన్ కోరింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి స్టీవ్ ఫెయిన్‌బర్గ్ వారికి ఓ మెమో పంపారు. కీలక ఆయుధాల ఉత్పత్తిని పెంచడానికి 21 రోజుల లోగా ప్రణాళికలను అందజేయాలని వారికి గడువు విధించారు. వేగవంతంగా తయారు చేసిన ఆయుధాలను సరఫరా చేసేందుకు షెడ్యూలును ఖరారు చేయాలని కూడా నిర్దేశించారు. ‘ఈ నెల ఐదవ తేదీన జారీ చేసిన మెమో నిజమైనదే. నిధుల కోసం కాంగ్రెస్‌కు సమర్పించిన 2028 బడ్జెట్‌కు ఇది మార్గదర్శకంగా ఉంటుంది. రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని పునర్నిర్మించడానికి మేము చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఇది అనుగుణంగా ఉంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న 2027 బడ్జెట్ మా ప్రయత్నాలకు మరింత ఊపు ఇస్తుంది’ అని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు. రక్షణ పరిశ్రమకు చెందిన వారితో కలిసి పనిచేయడం కొత్తేమీ కాదని అంటూ ఆయన మెమోను సమర్ధించారు.
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచుతాం : ట్రంప్
ఇరాన్‌తో దిగువ స్థాయిలో పరోక్ష చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని పెంచే విషయంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణాన్ని గమనిస్తున్నామని, దాని వద్ద డబ్బు లేదన్న విషయం కూడా తమకు తెలుసునని అన్నారు. ఆక్సియాస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఆర్థికంగా ఇరాన్ పరిస్థితి దారుణంగా ఉన్నదని చెప్పుకొచ్చారు. సైనికులకు ఇవ్వడానికి కూడా దాని వద్ద డబ్బు లేదని తెలిపారు. కాగా అమెరికాతో తాము చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. జూన్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినంత కాలం దానితో చర్చల ప్రసక్తే ఉండదని అన్నారు. ఇదిలావుండగా ఇరాన్ అత్యున్నత నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో తన ప్రతినిధిగా మొసేన్ రెజాయిని సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ నియమించారు. మహమ్మద్ బాఘర్ జోల్‌ఘదర్ స్థానంలో రెజాయిని నియమిస్తూ డిక్రీని జారీ చేశారు.
ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



