Tuesday, August 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో డాల్ఫిన్‌ తుపాను విలయం

చైనాలో డాల్ఫిన్‌ తుపాను విలయం

- Advertisement -

స్తంభించిన రవాణా…రద్దయిన విమానాలు
10 లక్షల మందిని ఖాళీ చేయించిన అధికారులు
బీజింగ్‌ :
ఆర్థిక రాజధాని షాంఘై సహా తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన డాల్ఫిన్‌ తుపాను జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. పది లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా రవాణా సౌకర్యాలు స్తంభించిపోయాయి. షాంఘైలో ఒక్క సోమవారం నాడే సుమారు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. తుపాను ఉత్తర దిశగా కదులుతున్నందున బుధవారం వరకూ కుండపోత వర్షాలు కురుస్తాయని, వరదలు సంభవిస్తాయని, కొండచరియలు విరిగిపడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది చైనాను తాకిన అతి బలమైన డాల్ఫిన్‌ తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందుగానే అత్యున్నత స్థాయి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జెజియాంగ్‌ రాష్ట్రంలోని యుహువాన్‌ను ఆదివారం తుపాను తాకినప్పుడు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ తర్వాత వెన్‌జౌ నగరంలో తుపాను రెండోసారి తీరాన్ని తాకింది.
షాన్డాంగ్‌, హెనాన్‌, హుబే, అన్హురు, జియంగ్సూ, జెజియాంగ్‌ రాష్ట్రాలలో, షాంఘై నగరంలో సోమవారం భారీ వర్షాలు పడ్డాయి. తుపాను కారణంగా అనేక పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో పార్కింగ్‌ ఫీజును రద్దు చేశారు. అత్యవసర ఆవాసాలను ఏర్పాటు చేశారు. ఫుజియన్‌ రాష్ట్రంలో పడవ ప్రయాణాలను నిలిపివేశారు. వందకు పైగా ఆఫ్‌షోర్‌ నిర్మాణ ప్రాజెక్టులను ఆపేశారు. తీరాన్ని తాకడానికి ముందు తుపాను ఆరు వేల కిలోమీటర్ల దూరానికి పైగా ప్రయాణించింది. కాగా తుపాను ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లో, తైవాన్‌ ఉత్తర ప్రాంతంలో, జపాన్‌లోని ఒకినావా దీవిలో వర్షాలు పడ్డాయి. డాల్ఫిన్స్‌ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -