నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) – 2026 కార్యాచరణ తుది గడువైన ఆగస్టు 10తో పూర్తయింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఉన్న 184 పోలింగ్ కేంద్రాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఎలక్టోరల్ ఫారాల (ఈఎఫ్) డిజిటైజేషన్ పూర్తయింది. ఆగస్టు 11 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. ఎస్ఐఆర్ కు ముందు నియోజకవర్గంలో 1,60,221 మంది ఓటర్లు ఉండగా, ఎస్ఐఆర్ అనంతరం డిజిటైజ్ అయిన ఓటర్ల సంఖ్య 1,44,770 కు చేరింది. అంటే 15,451 మంది తగ్గగా.. మొత్తం ఓటర్లలో 9.64 శాతం తగ్గుదల నమోదైంది. మరోవైపు 90.36 శాతం మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
అశ్వారావుపేటలోనే అత్యధిక తగ్గుదల: మండలాల వారీగా పరిశీలిస్తే ఎస్ఐఆర్ ప్రభావం ఒక్కో మండలంలో ఒక్కో విధంగా కనిపిస్తోంది. అశ్వారావుపేట మండలంలో ఎస్ఐఆర్‌కు ముందు 47,382 మంది ఓటర్లు ఉండగా.. అనంతరం 41,120 మంది నమోదయ్యారు. దీంతో 6,262 మంది తగ్గి 13.22 శాతం తగ్గుదల నమోదైంది. ఐదు మండలాల్లో ఇదే అత్యధికం.
దమ్మపేటలో 44,254 నుంచి 40,214 కు తగ్గి 4,040 మంది (9.13 శాతం) తగ్గారు.
ములకలపల్లిలో 28,351 నుంచి 26,179 కు చేరి 2,172 మంది (7.66 శాతం) తగ్గారు.
చండ్రుగొండలో 23,609 నుంచి 21,789కు తగ్గి 1,820 మంది (7.71 శాతం) తగ్గారు.
అన్నపురెడ్డిపల్లిలో 16,625 నుంచి 15,468కు తగ్గి 1,157 మంది (6.96 శాతం) తగ్గారు.
మండలాల వారీగా ఎస్ఐఆర్ కు ముందు – తర్వాత ఓట్లు పరిశీలన:
మండలం ముందు అనంతరం. ఓట్లు తగ్గుదల
అన్నపురెడ్డిపల్లి16,625 15,468 1,157 6.96%
అశ్వారావుపేట 47,382 41,120 6,262 13.22%
చండ్రుగొండ 23,609 21,789 1,820 7.71%
దమ్మపేట 44,254 40,214 4,040 9.13%
ములకలపల్లి 28,35 26,179 2,172 7.66%
మొత్తం 1,60,221 1,44,770 15,451 9.64%
184 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి: నియోజకవర్గంలో మొత్తం 184 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. ములకలపల్లి 34, చండ్రుగొండ 27, అన్నపురెడ్డిపల్లి 20, దమ్మపేట 52, అశ్వారావుపేట 51 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధిక పోలింగ్ కేంద్రాలు దమ్మపేటలో ఉండగా, అత్యధిక ఓటర్లు అశ్వారావుపేట మండలంలో ఉన్నారు.
అధికారుల నిరంతర పర్యవేక్షణ: ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ వేణుగోపాల్ క్షేత్రస్థాయి పర్యటనలు, నిరంతర పర్యవేక్షణ కీలకంగా నిలిచాయి. ఆయన పలుమార్లు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్యూమరేషన్, డిజిటైజేషన్ పురోగతిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు తహసీల్దార్ దాసరి కిశోర్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ హుస్సేన్‌ను అప్రమత్తం చేస్తూ గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
మున్సిపాలిటీలో సమన్వయంతో వేగం
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభ దశలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ కొంత మందకొడిగా సాగినప్పటికీ.. అనంతరం స్థానిక సంస్థల సమన్వయంతో ప్రక్రియ వేగం పుంజుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, కమిషనర్ దిలీప్‌రెడ్డిలు రాజకీయ బీఎల్‌ఏలతో సమన్వయం చేస్తూ ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించారు.
ఇక చివర పరిశీలనకు తెర: ఎస్ఐఆర్ గడువు ముగియడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణలో కీలక దశ పూర్తయినట్లయింది. అయితే 1,60,221 నుంచి 1,44,770కు ఓటర్ల సంఖ్య తగ్గడం సాధారణ గణాంక మార్పుగా మాత్రమే కాకుండా.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఏ స్థాయిలో మార్పు చోటుచేసుకుందన్నది కూడా రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అశ్వారావుపేట మండలంలో 13.22 శాతం తగ్గుదల నమోదవడం గణనీయమైన అంశం. పోలింగ్ కేంద్రాల వారీగా పరిశీలిస్తే ఎక్కడ ఎక్కువ మంది ఓటర్లు తగ్గారు, ఎక్కడ మార్పు స్వల్పంగా ఉంది, ఏ ప్రాంతాల్లో డిజిటైజేషన్ శాతం అధికంగా ఉంది అనే అంశాలపై తదుపరి విశ్లేషణకు అవకాశం ఉంది.



