నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని చేపూర్ గ్రామ శివారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక స్కాన్ 2 ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదుపాయాన్ని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసిన పూర్వ విద్యార్థి,ఫౌండర్ ఆఫ్ స్కాన్ 2 ప్రింట్ పవన్ అభివృద్ధి చేశారని విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పిడిఎఫ్ వర్డ్,పవర్ ప్లాంట్ లేదా ఇమేజ్ ఫైళ్లను అప్లోడ్ చేసి, అవసరమైన ప్రింట్ సెట్టింగులను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా చెల్లింపు చేసి సులభంగా ప్రింట్ పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించినారని తెలిపారు. వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మన కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కళాశాలకు గర్వకారణం. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుంది అని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూదీని ద్వారా విద్యార్థులకు ప్రింటింగ్ మరింత సులభంగా, వేగంగా మరియు ఆధునిక పద్ధతిలో అందుబాటులోకి వస్తుంది. క్యూఆర్ స్కానింగ్, ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్, యూపీఐ చెల్లింపు, ఓటిపి వెరిఫికేషన్ వంటి సాంకేతిక సదుపాయాలతో ఈ వ్యవస్థను రూపొందించడం అభినందనీయం. ముఖ్యంగా కళాశాల పూర్వ విద్యార్థి పవన్ ఈ ఆవిష్కరణను రూపొందించడం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు స్టార్టప్‌లు, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.. కళాశాలలో డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌లు మరియు విద్యార్థుల నూతన ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో బి నరేందర్ ,కళాశాల పాలిటెక్నిక్ కోఆర్డినేటర్ సుజీత్ ,మెకానికల్ అండ్ ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ వేద ప్రకాష్ , టిపిఓ సునీల్ ,సోషల్ మీడియా ఇంచార్జ్ శృతిన్,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.



