Friday, August 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘చేయూత’కు షరతులెందుకు?

‘చేయూత’కు షరతులెందుకు?

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు 15న చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక స్వాగతిస్తున్నది. 2022 నుంచి కొత్త పెన్షన్స్ కోసం వెయ్యికండ్లతో ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ఈసారైనా పెన్షన్స్ చేతికందుతాయా లేదా అనే సందిగ్ధమైతే కొనసాగుతున్నది. ఎందుకంటే, 2026 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది నెరవేరలేదు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీగా ‌తన ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్స్ రూపాయలు పెంచుతామని చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదు. వితంతు, వృద్ధాప్య పెన్షన్‌ రూ.2016 నుంచి 4016‌లకు, వికలాంగుల పెన్షన్ రూ.4016 నుంచి 6016కు పెంచుతామని ఖమ్మం జిల్లా సభలో అర్భాటంగా ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన హామిని నమ్మిన 44,49,767 లక్షల మంది లబ్దిదారులు ఎదురుచూపుల్లోనే కాలం గడిచింది. ఇప్పటికీ 32 నెలలుగా వారికి నిరాశనే మిగిలింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2023 డిసెంబర్ నెలలో ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తే 24.85 లక్షల మంది కొత్తగా దరఖాస్తులొచ్చాయి. 2026 జూన్ 2న స్వీకరిస్తే 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ ఆగష్టు 15న మంజూరు చేసే పెన్షన్స్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం చేసింది. ఇలా లబ్దిదారులను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా?

న్యాయం జరిగేనా?
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్స్ మంజూరు చేయాలంటే 15 రకాల షరతులను పెట్టింది. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి సాగునీటి పారుదల భూమి మూడెకరాలు, మెట్ట భూమి 7.5 ఎకరాలు మాత్రమే ఉండాలనే నిబంధనలతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న అర్హులైన చేయూత లబ్ధిదారులకు నిరాశనే మిగులుతోంది. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసే వారితో పాటు ప్రయివేటు సంస్థల్లో పనిచేసే వారు అనర్హులని పేర్కొనడమంటే లబ్దిదారుల సంఖ్యను తగ్గించే కుట్రతప్ప వేరేకాదు. స్వయం ఉపాధి చేసుకునే వారు ఇంట్లో ఉంటే వారికి పెన్షన్స్ నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం ఎలా సరైంది? ప్రభుత్వమే తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం వాహనాలు మంజూరు చేస్తున్నది. వ్యాపారం చేసుకునే వారిని అనర్హులుగా పేర్కొనడం బాధాకరం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేసే వారికి ప్రభుత్వం ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు. లబ్దిదారుల జీవనశైలి ఆధారంగా వారిని సంపన్నులుగా గుర్తించే ప్రభుత్వ నిర్ణయమే అనాలోచితమైనది.

పెన్షన్‌‌లకు నిధులేవి?
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.14,628.91 కోట్లు కేటాయించి 10,514.32 కోట్లు నిధులు మాత్రమే విడుదల చేసింది.2026-27 ఆర్థిక సంవత్సరానికి 14,861 కోట్లు కేటాయించిది. అంటే 232.09 కోట్లతో రెండులక్షల మందికి కొత్తగా పెన్షన్స్ మంజూరు చేయడం ఆచరణలో సాధ్యం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్స్ పెంచి ఇవ్వాలంటే యేటా 22592.5 కోట్లు అవసరమవు తాయి. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. అలాగే 2023 అక్టోబర్ నాటికి తొమ్మిది రకాల పెన్షన్స్ రాష్ట్రంలో మొత్తం 44,49,767 మందికి వస్తే 2026 జనవరి నాటికి 42,80,129 మందికి పెన్షన్ వస్తున్నవంటే 32 నెలల ప్రజాపాలనలో 1,69,638 మంది పెన్షన్స్ రద్దు చేశారు. వీరిలో 29,572 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దయ్యాయి. రద్దు చేసిన పెన్షన్స్ పునరుద్ధరణ చేయకుండా కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పడం అంటే లబ్దిదారులను మోసం చేయడమే అవుతుంది.

కొత్త పెన్షన్స్ మంజూరు కోసం గ్రామీణ అభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వులలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిలో కేవలం హిమోఫీలియో, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రాస్తులకు మాత్రమే కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని నిర్ణయించడం సరైంది కాదు. 2022 నుంచి కొత్త పెన్షన్స్ కోసం 21 రకాల వైకల్యాలు కలిగిన వాళ్లు ఎదురు చూస్తుంటే ప్రభు త్వానికి కనిపించడం లేదా? ప్రభుత్వం ఆగష్టు 15న మంజూరు చేసే పెన్షన్స్‌లలో షరతులు లేకుండా దరఖాస్తూ చేసిన ప్రతి ల‌బ్దిదా రునికి పెన్షన్స్ మంజూరు చేసే విధంగా ఉత్తర్వులను సవరిం చాలి. జూన్ 2 లాగానే మళ్లీ ఆగస్టు15న మాటతప్పితే ప్రజలనుంచి ప్రతిఘటన తప్పదు.

​యం. అడివయ్య, 9490098713

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -