Friday, August 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినెహ్రూ,అంబేద్కర్ : దళితులు, సంస్కరణలు

నెహ్రూ,అంబేద్కర్ : దళితులు, సంస్కరణలు

- Advertisement -

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశ తొలి ప్రధానిగా సుమారు పదిహేడు (1947 – 1964) సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించారు. తన వందల కోట్ల ఆస్తి యావత్తూ ఈ జాతికి అంకితం చేశారు. తన సర్వశక్తుల్ని ఈ దేశ నిర్మాణానికి ధారపోశారు. అలాంటి మహామనీషి ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదుగా కనిపిస్తారు. ఇప్పుడు ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడుతున్న వారు తమను తాము ఎంత నీచమైన స్థానానికి దిగజార్చుకున్నారో అర్థం చేసుకోవడం లేదు. ఆయన కాలంలో దేశం వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా ప్రగతి పథాన నడవడమే కాదు, ప్రాజెక్టుల నిర్మాణంలోనూ, వ్యవసాయ రంగంలోనూ గొప్పగా రాణించింది. ఆనాడు దేశంలో ఉన్న ఫ్యూడల్ విధానాల్ని రూపుమాపుతూ ఆయన చేస్తూ వచ్చిన సంస్కరణలు దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయి. ఆయన పంచవర్ష ప్రణాళికల గూర్చి, అలీన విధానం గూర్చి తెలుసుకుని ప్రపంచం హర్షించింది.

నెహ్రూ కాలంలో జరిగిన ముఖ్యమైన సంస్కరణలు
1951లో రాజ్యాంగానికి మొదటి సవరణ ఆర్టికల్ 15(4)కు జరిగింది.
2.1953 జనవరి 29న కాకా కాలేల్కర్: మొదటి వెనకబడిన తరగతుల కమిషన్.
3.1955- పౌరహక్కుల సంరక్షణ చట్టం.

ఈ మూడు స్వతంత్ర భారత చరిత్రలో చాలా కీలకమైనవి. అంతవరకు ఉన్న ఫ్యూడల్ వ్యవస్థ చీకట్లను ఛేదించడానికి ఇవే కాగడాలయ్యాయి. స్వాతంత్ర్యం లభించే నాటికి సాగవుతున్న భూముల్లో ఎనభై శాతం అగ్రవర్ణ జమీందార్లు/దొరలు/ భూస్వాముల ఆధీనంలో ఉండేవి. కోట్లలో ఉన్న మిగతా జనం కూలీలుగా, కట్టు బానిసలుగా ఉండేవారు. నెహ్రూ ప్రభుత్వం వచ్చిన తరువాత జమీందారీ రద్దు చట్టం (1950) అమలులోకి వచ్చింది. దున్నేవాడికి భూమి దక్కాలని లక్షల మందికి భూములు పంచిపెట్టి, వారికి ఆ భూమి మీద అన్ని హద్దులూ ఇచ్చారు. ఇది దేశంలో ఒక గొప్ప మార్పునకు నాంది పలికింది. ఇప్పటి ప్రభుత్వపు కుంచిత మనస్తత్వం లాగా కాకుండా నెహ్రూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, డా.బి.ఆర్. అంబేద్కర్‌ను ఈ దేశానికి తొలి న్యాయశాఖా మంత్రిగా చేశారు. అంబేద్కర్‌ నేపథ్యం తెలిసినవాడు గనక, జీవితాంతం నిరాదరణకు గురవుతూ, సంఘర్షించి వచ్చినవాడే న్యాయశాఖా మంత్రి అయితే, అణగారిన వర్గాలకు, ఆసహాయులకు, ఆదివాసీలకూ అందరికీ సమన్యాయం లభిస్తుందన్నది నెహ్రూ భావన! తొలిదశలో తీసుకున్న ఈ సరైన నిర్ణయం దేశాన్ని సమానత్వం దిశగా నడిపించింది.

మొదటి పంచవర్ష ప్రణాళికలో (1951-56) నెహ్రూ ప్రభుత్వం రూ.39 కోట్లు షెడ్యూలు కులాలకు (ఎస్సీ,ఎస్టీ) కేటాయించింది. దేశ అభివృద్ధికి కేటాయించిన ఆనాటి నిధులలో ఇది ఎక్కువ మొత్తం. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రాముఖ్యమివ్వాలన్నదే ఆనాటి ప్రభుత్వ నిర్ణయం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆ తరువాత రెండో పంచవర్ష ప్రణాళిక (1956-1961)లో ఆ మొత్తాన్ని నాటి ప్రభుత్వం 91 కోట్లకు పెంచింది. ఇంత ఎక్కువ మొత్తం దేనికంటే- చదువు, ఆరోగ్యం లేక, వసతులు లేక అల్లల్లాడుతున్న షెడ్యూలు కులాల వారిని దృష్టిలో ఉంచుకుని వారికి అనువైన చోట్ల బావులు తవ్వించడం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌లు అందించడం జరిగింది. ఆ రోజుల్లో మద్రాసు (తమిళనాడు) రాష్ట్రం నుంచి రిజర్వేషన్‌కు సంబంధించి ఒక జటిల సమస్య ఎదురైంది. దాన్ని ఎదు‌ర్కోవడానికి నెహ్రూ మొదటి రాజ్యాంగ సవరణ (1951)లో 15 (4) చేర్చారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూలు కులాల వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించగలిగాయి. అణగారిన వారు అశ్రద్ధకు గురికాకుండా IIT/AllMSలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి సముచిత స్థానం లభించింది.
ప్రధానికాక ముందు నుంచే నెహ్రూ దళిత వాడలకు వెళ్లేవాడు.

వారి బావుల నుంచి నీళ్లు తాగేవాడు. వారితో కలిసి భోజనం కూడా చేసేవాడు. అది భరించలేని కొందరు కాంగ్రెస్ సంప్రదాయవాదులు ‘ధర్మం భ్రష్టుపడుతోంది’ అని విమర్శించారు. అయినా ఆయన పట్టించుకోలేదు. అందువల్ల నెహ్రూ మీద, గాంధీ మీద రాళ్లు విసిరిన వారున్నారు. నల్ల జెండాలు ప్రదర్శించిన వారున్నారు. 1933-34 నాటి గాంధీ ‘హరిజన్ యాత్ర’లో నెహ్రూ కూడా చురుకుగా పాల్గొన్నారు. ఈ అనుభవాలు ఊరికే పోలేదు. ప్రధాని అయ్యాక ‘భారతీయ ఆదిమ జాతి సేవా సంఘం’-‘హరిజన్ సేవా సంఘం’ వంటి వాటికి తన కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజారు చేశాడు. ఇలాంటి సంఘాలు స్వాతంత్ర్యం లభించిన తర్వాత 1948లో ఏర్పడ్డాయి. వాటిని నెహ్రూ ప్రభుత్వం గుర్తించింది. చదువుకునే షెడ్యూలు కులాల విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా హరిజన హాస్టళ్లు ప్రారంభించింది. పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నత వర్గానికి చెందిన ఉన్నతాధికారుల జోక్యం తగ్గించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం 1950లలో తొలి ఎస్సీ,ఎస్టీ కమిషనర్ల నియామకం జరిగింది. మధ్యలో ఎవరో ఒకరు వీరిమీద పెత్తనం చేయకుండా వీరిని నేరుగా ప్రధాని కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఫ్యూడల్ వ్యవస్థ, పెత్తందారీ ఆధిపత్యం బలంగా ఉన్న రోజులవి. అప్పటికి అణగారిన వర్గాల వారంతా మెడకు ముంత, నడుమును చీపురు కట్టుకుని నడవాల్సిన పరిస్థితి ఉండేది.

ఆ అమానవీయ పద్ధతుల్ని రూపుమాపడానికి నెహ్రూ ‘అస్పృశ్యత : నేరం’ అనే చట్టం 1955లో తీసుకొచ్చారు. అస్పృశ్యత పాటించే వారిని ఎప్పుడైనా, ఎక్కడైనా వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఇచ్చారు. ఇది బాగా పనిచేసింది. చాలా తక్కువ సమయంలో ముంత-చీపురు వ్యవహారం సమసి పోయింది. దీనితోపాటు మొదటి సార్వత్రిక ఎన్నికలు జరగగానే 1952లో నెహ్రూ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక సీరియస్ సర్క్యులర్ పంపించింది. దళితుడు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటేనో, మీసాలు పెంచుకుంటేనో, ఘనంగా ఊరేగితేనో అతని మీద ఎవరైనా దాడిచేసి హింసిస్తే వెంటనే చర్చలు తీసుకోవాలన్నది దాని సారాంశం! డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీసులు స్వయంగా వెంటనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందనీ, లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని ఆ సర్క్యులర్ హెచ్చరించింది. ఇందులోని చాలా విషయాలు ప్రస్తుత ఆరెస్సెస్ – బీజేపీ ప్రభుత్వ (2014-26) విధానాలతో పోల్చిచూస్తే తేడా తెలుస్తుంది. నెహ్రూ ఆనాడు తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఇప్పటి ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోంది. కావాలని ద్వేష పూరితమైన ప్రసంగాలు చేసి, జనాన్ని విడగొట్టాలని చూస్తోంది. మైనార్టీలను, దళితులను హింసించడం అలా ఉంచి, హిందువులను కూడా బతకనివ్వడం లేదుకదా? ‘హిందువులంతా నా బంధువులు’ అనే మాటను అపహాస్యం చేస్తున్నారు.

‘హిందువులు ప్రమాదంలో ఉన్నారు’ అని ప్రచారం చేస్తూ వారినే ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తోంది. తరతరాలుగా ఇక్కడ పుట్టి పెరిగిన జనాన్నే ‘మీరు ఈ దేశ పౌరులేనా?’ అని ప్రశ్నిస్తూ, చూపించే పత్రాలేవీ పనికి రావని చెబుతూ భయ భ్రాంతులను చేస్తోంది. ఆరెస్సెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ వంటి వారి అనుబంధ సంస్థల్లో ఉన్న వారినే – ఈ దేశ పౌరులుగా గుర్తించేట్టుగా కనిపిస్తోంది. దేశచరిత్రలో ఇప్పుడు ఒక చీకటికాలం నడుస్తోంది. నెహ్రూ వైజ్ఞానిక స్పృహకు పాధాన్యమిచ్చినవాడు. అలాగని దైవ విశ్వాసకుల్ని బాధపెట్టలేదు. వారి వారి ప్రార్థనా స్థలాల్ని కూల్చేయించలేదు. బీజేపీ వారు బాబ్రీ మసీదును కూలగొట్టారు. అది రాముడి జన్మస్థలమని అబద్దాలు ప్రచారం చేసి, న్యాయమూర్తిని ప్రభావితం చేసి, తమకు అనుగుణంగా తీర్పు తెప్పించుకున్నారు. మసీదు అడుగున బౌద్ధ శిల్పాలు దొరికాయని ఆర్కియాలజీ విభాగం ఆధారాలు చూపింది. అయినా వీళ్లు అక్కడ అయోధ్యలో రామాలయం కట్టించారు. ఆ రాముడి పేరుతో రథయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ రాముడి పేరు చెప్పే జనాన్ని మళ్లీ మోసం చేశారు. జనం సమర్పించిన వేలకోట్ల రూపాయల డబ్బూ, ఆభరణాలు దొంగిలించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని బాధ్యత తీసుకోవాలి కదా? కనీసం తమ అసమర్థతను ప్రకటించుకుంటూ వారు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి కదా? వీరికి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, విద్వేషాలు తప్ప, ‘నైతికత’ అనేది ఒకటి ఉంటుందని తెలియదు.

నెహ్రూ నైతిక పాలన అందించాడు. దేవాలయ ఆదాయాల్ని దోచుకోలేదు. రాజకీయాలకు మతం రంగు పులమలేదు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శిధిలమైన ఆలయాల్ని పునర్నిర్మించింది. కానీ, ప్రచారం చేసుకోలేదు. ఎప్పుడూ ఏ విషయం లోనూ కొండంత రాగం తీయలేదు. అనాటి ప్రభుత్వం 38 వేల దేవాలయాల ఆస్తులను కాపాడింది. వాటిని ఆడిట్ చేయించింది. 1961లో మధ్యప్రదేశ్‌లోని ఖజురాహో దేవాలయం నుం‌చి విగ్రహాల దొంగతనం జరిగితే, వెంటనే నెహ్రూ సిబిఐ దర్యాప్తు చేయించారు. అంతర్జాతీయ స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసి, దోషుల్ని జైలుకు పంపించారు. మరి ఇప్పటి ప్రభుత్వపు పనితీరు ఎలాఉందో దేశవాసులందరికీ తెలుసు. మరో విషయం చూడండి. 2014- 22 మధ్య ‘నమామి గంగే’ అనే పేరుతో గంగానదిని ప్రక్షాళనం చేస్తామన్నారు. రూ.20 వేల కోట్లు దోచేశారు. కానీ, గంగానది మాత్రం శుభ్రం కాలేదు. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ఇండియాన్ ఆర్కియలాజికల్ సర్వే (ASI)ను ప్రోత్సహించి, నిధులిచ్చి ఎన్నో ప్రాచీన దేవాలయాల్ని వెలుగులోకి తెచ్చారు. నెహ్రూ గానీ, ఆయన తర్వాత వచ్చిన ప్రధానులు గానీ ఎప్పుడూ ఎక్కడా ప్రచారాలు చేసుకోలేదు. దేవాలయాలను దోచుకోలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆరెస్సెస్- బీజేపీ ప్రభుత్వం షెడ్యూల్‌ కులాల సబ్‌ప్లాన్‌కు సంబంధించిన నిధుల్లో 45 శాతం తమ ప్రచార కార్యక్రమాలకు మ‌ళ్లించుకున్నది.

ఫలితంగా దళితుల విద్యారంగానికి అందాల్సిన నిధులు అందడం లేదు. మారుమూల గ్రామాల్లో పాఠశాలలు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా – అంటూ ప్రచారాల హోరు తప్ప, వాస్తవంగా అక్కడ జరుగుతున్నది ఏమీలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీము, ఎంటర్‌ప్యూనర్‌షిప్‌ స్కీములన్నీ మూతపడ్డాయి. అధిక ధరలతో సామాన్యుడు తిండి కూడా సరిగా తినలేకపోతున్నాడు. బడ్జెట్‌‌లో 65 శాతానికి పైగా ప్రధానీ, అతని సహచరులూ విదేశాలలో తిరగడానికి ఖర్చు పెడుతున్నారు. వృద్ధుల, మహిళల సంక్షేమానికి, సంరక్షణకు ఖర్చుపెట్టాల్సిన నిధులూ-వారికి ఇవ్వాల్సిన పెన్షన్లూ నానాటికీ తగ్గిపోతున్నాయి. అంతేకాదు 2014 నుంచి ఈ దేశంలో మరొక ప్రమాదకరమైన దృశ్యం కనిపిస్తోంది. స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న ఆనాటి దేశ నాయకులపై బీజేపీ సోషల్ మీడియా వికృతమైన ప్రచారాలు చేస్తోంది.

యధార్థాలు తెలుసుకోని నేటి యువతరాన్ని విపరీతంగా ప్రభావం చేస్తోంది. తమ తండ్రులు, తాతలు నెహ్రూ పాలసీల వల్ల గౌరవంగా బతకగలిగారన్నది తెలుసుకోలేకపోతున్నారు. నెహ్రూను నాటి స్వాతంత్ర్య పోరాట నాయకుల్నీ అవహేళన చేయడం, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఒక ఫ్యాషన్‌గా మార్చేశారు. అయితే వారికి కాలం తప్పక గుణపాఠం నేర్పుతుంది. నైతికత, వైఙ్ఞానిక స్పృహ, కనీసం ఇంగిత జ్ఞానం లేని నేటి పాలకుల నిజస్వరూపం బయట పడుతూనే ఉంది. దేశ ప్రజలు నిజాలు గ్రహిస్తూనే ఉన్నారు. ఉద్యమాలకు ఉద్యుక్తులవుతూనే ఉన్నారు. ఒక చీకటి యుగాన్ని స్వర్ణయుగమని చేసుకుంటున్న ప్రచారం ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోంది!
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -