Friday, August 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరకాటంలో డోనాల్డ్ ట్రంప్!

ఇరకాటంలో డోనాల్డ్ ట్రంప్!

- Advertisement -

మరోసారి దాడికి దిగకుండా ‘జరిగింది చాలురా బాబూ’ అని అమెరికా అనుకునేట్లుగా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి తమ అదుపులోనే ఉందని డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనపై టెహరాన్ స్పందన ఇది. జలసంధి మీద పూర్తి అదుపును కలిగి ఉన్నామని చెబుతూ అవసరమైతే ట్రంప్ పదవీ కాలం పూర్తయ్యే వరకు సమస్యను ఇలాగే కొనసాగిస్తామని అది హెచ్చరించింది. ఐదునెలల సంక్షోభం తరువాత అమెరికాకే హెచ్చరికలు చేసే స్థితిలో ఇరాన్ ఉండటం గమనించాల్సిన అంశం. ట్రంప్‌నకు బుద్ధి చెప్పేందుకు అసలు తామే సంక్షోభాన్ని పొడిగించేందుకు కూడా వెనుకాడబోమని ఇరాన్ ప్రభుత్వ సలహాదారు హెచ్చరించటాన్ని బట్టి అగ్రరాజ్యం ఎలా ఇరుక్కుపోయిందో అర్థమవుతున్నది. తమ షరతు లకు అంగీకరించేంత వరకు వెనక్కుతగ్గేది లేదని ఇరాన్ పదే పదే చెబుతోంది. వాషింగ్టన్ ముందుకు తెచ్చిన పదిహేను అంశాల గాజా ఒప్పందాన్ని తాము అంగీకరించేది లేదని, గాజాతో పాటు సిరియా, లెబనాన్ దేశాల నుంచి కూడా తమ సేనలు వెనక్కు రావని ఇజ్రాయిల్‌ కరాఖండితంగా చెప్పింది.

ఇరాన్‌తో ట్రంప్ వ్యవహరించిన తీరును సమర్ధిస్తామని చెబుతున్న అమెరికన్ ఓటర్లు కేవలం 24శాతం మందే అని తాజా సర్వే వెల్లడించిన పూర్వరంగంలో పరువు కాపాడు కొనేందుకు ట్రంప్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడు తున్నాడు. ట్రంప్ ఏమిచెప్పినా జలసంధిలో నౌకల రాకపోకలు ఫిబ్రవరి 28కి ముందున్న సంఖ్యతో పోలిస్తే 90తక్కువగా ఉన్నట్లు కెప్లర్ సంస్థ వెల్లడించింది. అమెరికాలో గ్యాస్ ధరలు మండుతున్నాయి, పరువు దక్కించు కొనేందుకు ట్రంప్ నష్టదాయకమైన ఒప్పం దానికి కూడా సిద్ధపడుతున్నట్లు ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. మానవహక్కుల గురించి తమకు సుభాషితాలు చెప్పవద్దని ఫ్రాన్సు నేతలకు ఇరాన్ చురకలంటింది. తమ అనుమతి లేకుండా జలసంధిలో ఏవైనా ఓడలు రాకపోకలు సాగిస్తే శత్రువులకు సరఫరా చేస్తున్నట్లుగా భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పౌర నౌకలపై దాడి అంతర్జాతీయ న్యాయసూత్రాల ఉల్లంఘన కాదా? అన్న ప్రశ్నకు యుద్ధ సమయంలో తమకు ముప్పు అని భావిస్తే వదిలేది లేదని పేర్కొన్నది.

పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితి ఇలా ఉండగా రష్యా క్షిపణులను కూల్చివేసేందుకు అవసర మైన పేట్రియాట్ వ్యవస్థలను సరఫరా చేయా లంటూ ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ గగ్గోలు పెడుతున్నాడు. తమకు వ్యతిరేకంగా నాటో పన్నిన కుట్రలో భాగస్వామిగా మారిన ఉక్రెయిన్‌కు గుణపాఠం చెప్పేందుకు 2022 ఫిబ్రవరి నుంచి రష్యా సైనిక చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై దాడికి కేంద్రీకరించిన అమెరికా జనవరి నుంచి రష్యాతో శాంతి చర్చల గురించి అసలు మాట్లాడమే మానుకుంది. నాటో దేశాలు గత నాలుగున్నరేండ్లుగా ఎన్ని ఆధునిక ఆయుధాలు అందించినప్పటికీ మాస్కో మిలిటరీ శక్తి ముందు దిగదుడుపుగా ఉన్నాయి. వాటితో రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసి నష్టం కలిగించి నప్పటికీ పుతిన్ సేనల చేతిలో ఉక్రెయిన్‌కు జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. రష్యా జరుపుతున్న క్షిపణి దాడుల వివరాలను వెల్లడించకూడదని జెలెన్‌స్కీ యంత్రాంగం నిర్ణయించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్యా దాడులను ఎదుర్కోవాలంటే తమకు అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ వ్యవస్థల్లో తక్షణమే ఐదు నుంచి పదిశాతం అంద చేయాలని కోరినట్లు అతగాడు వెల్లడించాడు. ఎన్ని విన్నపాలు చేసినా లక్షల సార్లు ఫోన్లు చేసినా అమెరికా నుంచి స్పందనలేదని, కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేనని కూడా జెలె‌న్‌స్కీ వాపోయాడు.

ఇరాన్‌పై దాడులకు ముందు అమెరికా అమ్ముల పొదిలో 2,330 పేట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థలుండగా ఇప్పుడు అవి 850కి పడిపోయాయన్న వార్తలను చూస్తే ఐదునెలల సంక్షోభంలో అమెరికాకు తగిలిన దెబ్బేమిటో అర్థం చేసుకోవచ్చు. ఏడాదికి కనీసం రెండువేల చొప్పున వాటిని తయారు చేయాలంటే 2029వరకు సాధ్యం కాదన్న సమాచారం గుప్పుమంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియాలో ఉన్న వాటిని కూడా గల్ఫ్ దేశాలకు తరలించింది. అలాంటిది ఉక్రెయిన్‌కు సరఫరా చేయటం కలలో మాట. ఉచితంగా వద్దు డబ్బు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వాషింగ్టన్ నుంచి ఉలుకూపలుకూ లేదు. ఒక్కొక్క వ్యవస్థ ఖర్చు 250 కోట్ల డాలర్లు, దానిద్వారా ప్రయోగించే క్షిపణి వెల కోటి డాలర్లు ఉంటుంది. మార్కెట్ లేకుండా వాటిని అమెరికాలోని ప్రయివేటు ఆయుధ సంస్థలు ఊరికే తయారు చేసి నిల్వలు పెట్టుకోవన్న సంగతి తెలిసిందే. పేట్రియాట్ నిల్వలు తరిగిపోతున్న కారణంగా తమకు అమెరికా రక్షణ కల్పించలేదని అర్ధం చేసుకున్న గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడులు నిలిపివేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించే ట్రంప్ సలహాదారులు ఇరాన్‌పై దాడులతో చేతి చమురు వదలటం తప్ప వచ్చేదేమీ లేదని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -