ప్రొటోకాల్ పాటించాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోల్కొండ కోటలో శనివారం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రవాణా, ఆర్ అండ్ బీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్ షామియానాలు, వాటర్‌ప్రూఫ్ జనరేటర్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, బారికేడింగ్, గ్యాలరీలు, వచ్చే అతిథులు, విద్యార్థులు, ప్రజల సీటింగ్ సామర్థ్యం, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లను ఉన్నతస్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా ప్రొటోకాల్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. స్టేజీ ఏర్పాటుతోపాటు సుందరీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి వాహనంలో వచ్చే పిల్లలకు ఒక లైజనింగ్ అధికారి తప్పనిసరిగా ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పంద్రాగస్టు రోజున ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలనీ, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పక్కాగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రికి సమర్పించే పోలీసుల గౌరవ వందనం, పోలీస్ కవాతును ఆయన ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, సమాచార శాఖ కమిషనర్ జి ముకుంద రెడ్డి, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, సీపీ సజ్జనార్, అడిషనల్ సీపీ తప్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ కమలాసన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డిఎస్ జగన్, చీఫ్ ఇంజినీర్ రాధా కిషన్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ జయ రామమూర్తి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజినీర్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఫైర్ అధికారి వెంకన్న, ఆర్డీవో రామకృష్ణ, డీఈఓ యాదయ్య, ఆర్ అండ్ బి, విద్యుత్, వైద్య, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



