Friday, August 14, 2026
E-PAPER
Homeఖమ్మంవర్షాభావంలో ప్రత్యామ్నాయ పంటలే దిక్కు

వర్షాభావంలో ప్రత్యామ్నాయ పంటలే దిక్కు

- Advertisement -

– స్వల్పకాలికమే కాదు.. దీర్ఘకాలిక, అంతర పంటల సాగూ వ్యవసాయమే
– వరి సాగుకు దూరంగా ఉండాలని వ్యవసాయశాఖ సూచన
– 9 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
– డివిజన్‌లో 35 శాతం లోటు వర్షపాతం
నవతెలంగాణ – అశ్వారావుపేట

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. వానాకాలం – 2026 సీజన్‌లో ఇప్పటికే రెండున్నర నెలల కాలం పూర్తవుతుండగా,మరో నెలన్నర మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా వరి నాట్లు వేయడం ఏమాత్రం ప్రయోజనకరం కాదని వ్యవసాయశాఖ సూచిస్తోంది. వర్షాభావంతోపాటు భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితుల్లో బోరు సౌకర్యం ఉన్న రైతులు సైతం వరి సాగుకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌లోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని కోరుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల ఎంపికలో జాగ్రత్త అవసరమని వ్యవసాయశాఖ గతంలోనూ రైతులకు సూచించింది.

తొమ్మిది వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు:
అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో గత వానాకాలంతో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతేడాది 40,206 ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 31,446 ఎకరాలకు పరిమితమైంది. అంటే 8,760 ఎకరాల మేర వరి సాగు తగ్గింది. ఈ భూముల్లో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది.

డివిజన్‌ ఏడీఏ పెంటేల రవికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తూ మినుము, పెసర, అలచంద, మొక్కజొన్న, జొన్న తదితర పంటల సాగును సూచిస్తున్నారు. నీటి లభ్యత, నేల స్వభావం, రైతుల ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కో మండలంలో ఒక్కో పంటకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మండలాల వారీగా పంటల ఎంపిక:
అశ్వారావుపేట మండలంలో మినుము, చంద్రుగొండలో మిరప, దమ్మపేటలో వేరుశనగ, మొక్కజొన్న, ఆయిల్‌పామ్‌, ములకలపల్లిలో వేరుశనగ, మొక్కజొన్న, యూకలిప్టస్‌ పంటలకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరుశనగ సాగు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. మినుము సాగుకు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు వేసే పనులు చేపడుతున్నారు.

ఆత్మనిర్భరత మిషన్‌ పథకం కింద మినుము విత్తనాలను 50 శాతం రాయితీపై వ్యవసాయశాఖ అందిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న రైతులను ఆయిల్‌పామ్‌ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. డివిజన్‌లో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటడం, డ్రిప్‌ ఏర్పాట్లు, మిరప నాట్లు, వేరుశనగ విత్తే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

35 శాతం లోటు:
ఆగస్టు 13 నాటికి అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో సాధారణంగా 594.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 385.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

అన్నపురెడ్డిపల్లిలో 582.5 మి.మీ. సాధారణ వర్షపాతానికి 386.7 మి.మీ. నమోదై 33 శాతం లోటు, అశ్వారావుపేటలో 555.9 మి.మీ.కు 281.2 మి.మీ. నమోదై 49.4 శాతం లోటు, దమ్మపేటలో 616.8 మి.మీ.కు 243.6 మి.మీ. నమోదై 60.5 శాతం లోటు, ములకలపల్లిలో 662.4 మి.మీ.కు 384.2 మి.మీ. నమోదై 42 శాతం లోటు ఉంది. చంద్రుగొండలో మాత్రం 553.8 మి.మీ. సాధారణ వర్షపాతానికి 631.6 మి.మీ. నమోదై 14 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

సమగ్ర వ్యవసాయ విధానంతోనే స్థిరత్వం:
కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ వ్యవసాయరంగంలో స్థిరత్వం సాధించేందుకు నేల ఆరోగ్యం మెరుగుదల, నేలతేమ సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయాన్ని కేవలం స్వల్పకాలిక పంటల సాగుకే పరిమితం చేయకుండా దీర్ఘకాలిక, అంతర పంటలు, ఉద్యానవనాలు, పశుసంవర్ధక, మత్స్య, అటవీ ఆధారిత జీవనోపాధులను సమన్వయం చేసుకోవడం ద్వారా రైతు కుటుంబాల ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణే రైతులకు రక్షణ కవచంగా నిలుస్తుందని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -