Saturday, August 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమరో స్వాతంత్ర్య ఉద్యమం అవసరం

మరో స్వాతంత్ర్య ఉద్యమం అవసరం

- Advertisement -

విదేశీ పాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్ర్య పోరాటానికి 79 ఏండ్లు పూర్తయ్యాయి. కానీ, రాజకీయ స్వాతంత్ర్యం సాధించిన దేశంలోనే నేడు పౌరసత్వం, ఓటుహక్కు, ఉపాధి, రైతు బతుకు, కార్మికుల హక్కులు, విద్య, ధరలు, ఆర్థిక అసమా నతలు వంటి ప్రశ్నలు తీవ్రంగా ముందు కొస్తున్నాయి. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, ప్రజల మధ్య కుల, మత విభజనలు పెంచే ప్రయత్నాలు విపరీతమయ్యాయి. స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి కాదు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవితం, ఆర్థిక భద్రత, ప్రజా స్వామ్య స్వేచ్ఛ లభించడం. ఆ లక్ష్యాలే ప్రశ్నార్థకమవుతున్న వేళ నేడు 80వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా మరో కర్తవ్యానికి పునరంకింతం కావాలి.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కుల, మత, భాష, ప్రాంత భేదాలకు అతీతంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వేలాది మంది త్యాగాల ఫలితంగా దేశం స్వాతంత్ర్యం సాధించింది. అయితే స్వాతంత్ర్య పోరాటం ఆశించిన సామాజిక, ఆర్థిక న్యాయం ఇంకా పూర్తిగా సాకారం కాలేదు. ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి, వ్యవసాయం, కార్మిక హక్కులు, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత వంటి అంశాలపై నేడు కొత్తసవాళ్లు ఎదురవుతున్నాయి.

పౌరసత్వం, ఓటుహక్కుపై పెరుగుతున్న ఆందోళన
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత ప్రాథమిక హక్కు. కానీ జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌‌సి), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌‌పీఆర్‌), స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వంటి ప్రక్రియల చుట్టూ ఏర్పడుతున్న పరిణామాలు సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వలస కార్మికులు, పేదలు, పాత పత్రాలు లేని కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎస్ఐఆర్‌లో పాత ఓటరు రికార్డులు, తల్లిదండ్రులు లేదా తాతల ఓటుహక్కుకు సంబంధించిన వివరాలు సమర్పించాల్సిన నిబంధనలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలకు సమస్యగా మారవచ్చు. పేర్లు, ఇంటిపేర్లు, చిరునామాల్లో తేడాలున్నా ఓటుహక్కు కోల్పోయే పరిస్థితి రాకూడదు. పశ్చిమ బెంగాల్‌లో సర్‌ ప్రక్రియ సందర్భంగా లక్షలాది దరఖాస్తులు, ఓటర్ల తొలగింపు అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన సమస్యగా చూడటం సరికాదు. ఓటరు జాబితాలో పేరు ఉన్నవారినే పౌరులుగా పరిగణించే ధోరణి ఏర్పడితే పేదలు, గ్రామీణ ప్రజలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో ఓటు వేయడం మాత్రమే కాదు, ప్రతి పౌరుడి ఓటుహక్కును భయరహితంగా రక్షించడం కూడా.

దేశ సంపద కొద్దిమందికి.. భారం ప్రజలందరికి
స్వాతంత్ర్యం తర్వాత దేశం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసింది. కానీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలు, మౌలిక వసతులు, సహజ వనరులను ప్రయివేటు పెట్టుబడి దారులకు అప్పగించే విధానాలు పెరుగుతున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో భూములు, జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, విద్యుత్ వ్యవస్థల వంటి ప్రజా ఆస్తులను దీర్ఘకాలిక లీజులకు ఇస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, బాక్సైట్‌తో పాటు లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల రంగాల్లో కూడా ప్రయివేటు పెట్టుబడులకు ప్రభుత్వమే ఎర్రతివాచీ పరుస్తోంది. 2014లో దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య సుమారు వంద ఉండగా, 2024 నాటికి అది రెండువందలకు చేరింది. మరోవైపు ప్రభుత్వ అప్పులు 2021-22లో రూ.138.66 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి రూ.201.17 లక్షల కోట్లకు పెరిగాయి. కొత్త అప్పుల్లో వడ్డీ చెల్లింపుల వాటా కూడా భారీగా పెరిగింది. ఒకవైపు కొద్దిమంది సంపద వేగంగా పెరుగుతుంటే, మరోవైపు మెజారిటీ ప్రజలు ధరలు, అప్పులు, నిరుద్యోగం, ఆదాయ అస్థిరతతో ఇబ్బం దులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి అభివృద్ధిని సంపద పెరుగుదలతో మాత్రమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో కొలవాలి.

రైతు, కార్మికుడి బతుకుపై భారమైన విధానాలు
వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంట ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇంధనం వంటి వ్యయాలు పెరగడంతో అప్పులపై ఆధార పడాల్సి వస్తోంది. 2014-2022 మధ్య లక్షకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపులు తగ్గడం, ఎరువులు, ఆహార సబ్సిడీల్లో కోతలు, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు లేకపోవడం గ్రామీణ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి.వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకుని గిట్టుబాటు ధర, చౌక రుణాలు, మార్కెట్‌లో ధరల స్థిరత్వం కల్పించాలి. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి, కనీస వేతనం, సామాజిక భద్రత అందించాలి. కార్మిక రంగంలోనూ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. నాలుగు లేబర్ కోడ్లపై కార్మిక హక్కులకు సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి. 2018లో 36.30 శాతంగా ఉన్న కాంట్రాక్టు కార్మికుల వాటా 2023 నాటికి 40.72 శాతానికి పెరిగింది. ధరల పెరుగుదలతో పోలిస్తే వాస్తవ వేతనాలు తగ్గుతున్నాయి. గిగ్ ఎకానమీలో లక్షలాది మంది పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత, పెన్షన్, ఆరోగ్య రక్షణ వంటి హక్కులు పరిమితంగానే ఉన్నాయి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వంటి పథకాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కూడా తగిన వేతనాలు, సామాజిక భద్రత అందడం లేదు.

ధరల పెరుగుదల, విద్యా సంక్షోభం
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడేండ్లలో వినియోగ ధరల సూచీ ఆధారంగా ధరలు సుమారు ఇరవై శాతం, ఆహార ధరలు 26 శాతం పెరిగాయి. ఇంధన ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడం ఇతర వస్తువుల ధరలను కూడా ప్రభావితం చేస్తోంది. ఉపాధి అవకాశాలు తగినంతగా పెరగక పోవడం, ఆదాయాలు ధరలకు అనుగుణంగా లేకపోవడం కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ప్రభుత్వ విద్యారంగానికి తగిన నిధులు లేకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రయివేటు విద్య కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉన్నత విద్యలో ప్రయివేటు ఆధిపత్యం పెరగడం విద్యను సామాజిక హక్కు నుంచి వ్యాపార వస్తువుగా మార్చే ప్రమాదం ఉంది.నీట్ సహా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల్లో భవిష్యత్తుపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. సంవత్సరాల కష్టంతో పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పరీక్షా వ్యవస్థపై విశ్వాసం లేకపోవడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, రాష్ట్రాల హక్కులు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ వంటి అంశాలపైనా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో సమన్యాయం అవసరం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని దేశద్రో హులుగా ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు. అధికారాన్ని ప్రశ్నించడం దేశ వ్యతిరేకత కాదు,అది ప్రజాస్వామ్య హక్కు.

సార్వభౌమత్వానికి సవాళ్లు
బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి ఒక తరం తన జీవితాలను త్యాగం చేసింది. ఆ పోరాటం లక్ష్యం కేవలం విదేశీ పాలనను వెళ్లగొట్టడం కాదు. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, ఆర్థిక న్యాయం కల్పించే దేశాన్ని నిర్మించడమూ అందులో భాగమే. అందుకే 79 ఏండ్ల స్వాతంత్ర్య ప్రయాణాన్ని నేటి పరిస్థితుల వెలుగులో సమీక్షించు కోవాలి. రైతు అప్పుల్లో కూరుకుపోతే, కార్మికుడికి తగిన వేతనం దక్కకపోతే, యువతకు ఉద్యోగం లేకపోతే, విద్యార్థికి పరీక్షా వ్యవస్థపై నమ్మకం లేకపోతే, సామాన్యుడు ధరల భారంతో సతమతమైతే స్వాతంత్ర్య ఫలాలు అందరికీ చేరాయని చెప్పలేం. దేశ సంపద కొద్దిమందికి కేంద్రీకృ తమవుతూ, మతం, కులం పేరుతో ప్రజల్లో చీలికలు పెంచడం దేశ ఐక్యతకు కూడా ప్రమా దమే. స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, సహజ వనరులు, ప్రజా ఆస్తులు, కీలక రంగాలపై ప్రజల ప్రయోజనాలకు అనుగుణమైన నియంత్రణ కూడా సార్వభౌ మత్వంలో భాగమే. నేడు ప్రజా ఆస్తుల ప్రయివేటీకరణ, కొద్దిమంది కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం, ఆర్థిక అసమానతలు పెరగడం దేశ ఆర్థిక సార్వభౌమ త్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అదే సమయంలో కుల, మత విభజనలు సామాజిక ఐక్యతకు సవాలుగా మారు తున్నాయి. దీనితోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు మన ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు కూడా దేశ సార్వ భౌమత్వంపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతు న్నాయి. టారిఫ్‌ల ఒత్తిడి, అమెరికాతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాలు భారత ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి. రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసిన పోరాటం నాడు ఒక చారిత్రక అవసరం. అసమానత, దోపిడీ, మత విద్వేషం, కార్పొరేట్ ఆధిపత్యం, ప్రజాస్వామ్య హక్కుల హరణకు వ్యతిరేకంగా పోరాడటం నేడు మరో చారిత్రక కర్తవ్యం. రైతు, కార్మికుడు, యువత, విద్యార్థి, సామాన్యుడి హక్కులు భద్రంగా ఉన్నప్పుడే స్వాతంత్ర్యం సంపూర్ణమవు తుంది. హక్కులు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ఆర్థిక స్వావలంబనను కాపాడుకోవాలి. అందుకోసం ప్రజలు మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సమాయత్తమవ్వాలి.

జూలకంటి రంగారెడ్డి, 9490098349

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -