అజేయ సెంచరీతో మెరిసిన దేవదత్
రాణించిన కెఎల్ రాహుల్, రిషబ్ పంత్
భారత్ తొలి
ఇన్నింగ్స్ 288/2
అనుకోకుండా నం.3 స్థానం దక్కించుకున్న దేవదత్ పడిక్కల్ (131 నాటౌట్) గాలెలో గర్జించాడు. శ్రీలంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న పడిక్కల్ అజేయ సెంచరీతో చెలరేగాడు. కెఎల్ రాహుల్ (77) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు ఆటలో 73 ఓవర్లలో 2 వికెట్లకు భారత్ 288 పరుగులు చేసింది.
నవతెలంగాణ-గాలె
దేవదత్ పడిక్కల్ (131 నాటౌట్, 178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. వార్మప్ మ్యాచ్ ఫామ్ కొనసాగించిన పడిక్కల్ గాలెలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పడిక్కల్ ఫటాఫట్ మెరుపులతో 20 టెస్టుల తర్వాత నం.3 బ్యాటర్ నుంచి భారత్ ఓ సెంచరీ రాబట్టింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (77 రిటైర్డ్ హర్ట్, 162 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో మెరిశాడు. మోచేతి గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించినా నేడు మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరుణుడు అంతరాయం కలిగించటంతో తొలి రోజు ఆటలో 73 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. భారత్ 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దేవదత్ పడిక్కల్‌తో పాటు రిషబ్ పంత్ (27 నాటౌట్, 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా క్రీజులో నిలిచాడు.
పడిక్కల్ ప్రతాపం
గాలెలో టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32, 37 బంతుల్లో 5 ఫోర్లు), కెఎల్ రాహుల్ (77) శుభారంభం అందించారు. ఆరంభంలో జైస్వాల్ ధనాధన్ మోత మోగించాడు. ఐదు ఫోర్లతో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. దీంతో 11 ఓవర్లలోనే భారత్ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించింది. బౌలర్లపై నియంత్రణ సాధించిన జైస్వాల్ వికెట్ల మధ్య సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్ర్కమించాడు. తొలి వికెట్ పడగొట్టేందుకు ప్రణాళికలు లేని శ్రీలంకకు రనౌట్ రూపంలో మంచి బ్రేక్ లభించింది. కెఎల్ రాహుల్‌తో జతకట్టిన కొత్త నం.3 బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (131 నాటౌట్) వార్మప్ మ్యాచ్ ఫామ్ కొనసాగించాడు. దీంతో లంచ్ విరామం వరకు భారత్ మరో వికెట్ కోల్పోలేదు. 27 ఓవర్లలో 101 పరుగులు చేసింది. రెండో సెషన్లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెఎల్ రాహుల్ 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 127 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. దేవదత్ పడిక్కల్ 81 బంతుల్లోనే 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఫిఫ్టీ బాదాడు.
రాహుల్, పడిక్కల్ రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదు చేయటంతో టీ విరామ సమయానికి భారత్ 197/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో సెషన్లో శ్రీలంక బౌలర్లకు ఒక్క వికెట్ దక్కలేదు. టీ తర్వాత కెఎల్ రాహుల్ గ్రౌండ్‌లోకి వచ్చినా… మోచేతి గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (16, 28 బంతుల్లో 2 ఫోర్లు) తోడుగా పడిక్కల్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 134 బంతుల్లో కెరీర్ తొలి టెస్టు సెంచరీ సాధించిన పడిక్కల్… నం.3 స్థానంలో భారత్‌కు 20 టెస్టుల తర్వాత తొలి హండ్రెడ్ అందించాడు. చివరగా ఈ స్థానంలో గిల్ సెంచరీ చేశాడు. రెండు ఫోర్లతో జోరందుకున్న శుభ్‌మన్ గిల్ జయసూర్య బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. దీంతో 236 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. చివరి సెషన్ ఆఖర్లో రిషబ్ పంత్ (27 నాటౌట్) జతగా పడిక్కల్ మరో వికెట పడకుండా జాగ్రత్త వహించాడు. పంత్, పడిక్కల్ మూడో వికెట్‌కు 11.1 ఓవర్లలోనే 52 పరుగులు జోడించారు.
వర్షం అంతరాయం
భారత్, శ్రీలంక తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. లంచ్ విరామం తర్వాత స్టేడియంలోకి ప్రవేశించిన వరుణుడు.. వదల్లేదు. మూడో సెషన్ ఆరంభమైన తర్వాత వర్షంతో మరోసారి ఆట నిలిచింది. ఆఖర్లో వెలుతురు లేమితో ఆటను త్వరగా నిలిపివేశారు. తొలి సెషన్లో 27 ఓవర్లు, రెండో సెషన్లో 26 ఓవర్లు, మూడో సెషన్లో 20 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి రోజు వర్షంతో 17 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది.



