నేటి కాలంలో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలామంది ఆశ్రయిస్తున్న ప్రసిద్ధ ఆహార నియమాలలో కీటోజెనిక్ డైట్ మొదటి స్థానంలో ఉంది. వేగంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక విప్లవాత్మక మార్గంగా కనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ఆరోగ్య సూత్రాలపై సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరం.
కీటో డైట్ అంటే?
సాధారణంగా మన శరీరం దైనందిన పనులకు అవసరమైన శక్తి కోసం మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్ల నుండి లభించే గ్లూకోజ్‌పై ఆధారపడుతుంది. కానీ కీటో డైట్‌లో కార్బోహైడ్రేట్లను అతి తక్కువగా అంటే రోజుకు 50 గ్రాముల కంటే తక్కువగా అందిస్తారు. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గిపోతాయి. ఫలితంగా శరీరం గ్లూకోజ్‌కు బదులుగా, నిల్వ ఉన్న కొవ్వులను శక్తి కోసం కరిగించడం ప్రారంభిస్తుంది. కాలేయం ఈ కొవ్వులను కరిగించి ‘కీటోన్లు’ అనే అణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేకమైన జీవక్రియ స్థితినే ‘కీటోసిస్’ అంటారు.
ఆహార ప్రణాళిక: ఏమి తినాలి? ఏమి నివారించాలి?
కీటో డైట్‌లో ఆహార నిష్పత్తి ప్రధానంగా 70 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు, 20 నుండి 25 శాతం ప్రోటీన్ కేవలం 5 నుండి 10 శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా ప్లాన్ చేస్తారు.
తినవలసిన ఆహారాలు: చికెన్, మటన్, చేపలు, గుడ్లు, వెన్న, నెయ్యి, జున్ను, బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్, గుమ్మడి, అవిసె గింజల వంటి విత్తనాలు, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తక్కువ కార్బ్స్ ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రోకలీ).
తినకూడనవి: అన్నం, గోధుమలు, మైదా, చక్కెర, తీపి పదార్థాలు, బేకరీ వంటకాలు, దాదాపు అన్ని రకాల పండ్లు, బీన్స్, మినపప్పు/ కందిపప్పు వంటి పప్పు ధాన్యాలు, ఆటూ వంటి పిండి పదార్థాల దుంపలు.
కీటో డైట్‌లో కొన్ని రకాలు
స్టాండర్డ్ కీటో డైట్ (SKD): ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్లు, మితమైన ప్రోటీన్, అధిక కొవ్వులు ఉంటాయి.
సైక్లికల్ కీటో డైట్ (CKD): ఇందులో 5 రోజులు కీటో డైట్ చేసి, మిగిలిన 2 రోజులు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటారు (క్రీడాకారులు దీనిని ఉపయోగిస్తారు).
టార్గెటెడ్ కీటో డైట్ (TKD): వర్కవుట్లు లేదా వ్యాయామం చేసే సమయంలో మాత్రమే కార్బోహైడ్రేట్లను జోడించడానికి ఇది అనుమతిస్తుంది.
కీటో డైట్ ప్రయోజనాలు
వేగంగా బరువు తగ్గుదల: కొవ్వునే నేరుగా ఇంధనంగా మార్చడం వల్ల పొట్ట, శరీరం చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. ప్రారంభంలో శరీరం వేగంగా బరువు తగ్గడానికి నీటి బరువు (Water weight) తగ్గడం కూడా ఒక ప్రధాన కారణం.
ఆకలి నియంత్రణ: అధిక కొవ్వులు, ప్రోటీన్లు తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో పదే పదే తినాలనే కోరికలు తగ్గుతాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ: పిండి పదార్థాలు బాగా తగ్గించడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో HbA1c స్థాయిలను పెంచుతుంది.
మూర్ఛ వ్యాధి నివారణ: ప్రాచీన కాలం నుండి వైద్యపరంగా మందులకు లొంగని చిన్నపిల్లల మూర్ఛ వ్యాధి నియంత్రణకు కీటో డైట్‌ను ఒక ప్రతిపాదిక చికిత్సగా ఉపయోగిస్తున్నారు.
దుష్ప్రభావాలు – ప్రమాదాలు
కీటో డైట్ ప్రారంభంలో వేగంగా ఫలితాలను ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
కీటో ఫ్లూ: డైట్ ప్రారంభించిన మొదటి వారంలో శరీర జీవక్రియ మారడం వల్ల తీవ్రమైన అలసట, తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, మలబద్ధకం వంటి తాత్కాలిక సమస్యలు ఎదురవుతాయి.
పోషకాహార లోపాలు: పండ్లు, తణధాన్యాలు, పప్పుధాన్యాలను పూర్తిగా నిలిపివేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు (థయామిన్, ఫోలేట్, కాల్షియం), పీచు పదార్థం కొరత ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు రాలడం, చర్మం పొడిబారడం జరుగుతుంది.
గుండె, అవయవాలపై ఒత్తిడి: సంతప్త కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై భారం పడి రాళ్లు ఏర్పడటం లేదా మలబద్ధకం తీవ్రమమవడం వంటివి జరగవచ్చు.
డైట్ ప్రారంభించే ముందు
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం: కీటో డైట్‌లో నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది కాబట్టి పుష్కలంగా నీరు, ఎలక్ట్రోలైట్లు తీసుకోవాలి.
తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే చూడాలి: కీటో డైట్‌ను జీవితాంతం పాటించడం కష్టం. బరువు తగ్గిన తర్వాత తిరిగి సాధారణ ఆహారంలోకి మారేటప్పుడు క్యాలరీల నియంత్రణ లేకపోతే బరువు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
చివరగా
కీటో డైట్ అనేది అందరికీ ఒకేలా సరిపోదు.
– సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను చూసి సొంతంగా కీటో డైట్ ప్రారంభించడం ఆరోగ్యానికి ప్రమాదకరం.
– ముఖ్యంగా గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాబెటిస్ మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా అర్హత కలిగిన డాక్టర్ లేదా వైద్యాధికారి పర్యవేక్షణలోనే ఈ డైట్‌ను పాటించాలి.
వాణి అయోధ్య
క్లినికల్ డైట్ కన్సల్టంట్
9959361180



