1960లో వచ్చిన కె.ఆసిఫ్ మాగం ఓపస్ అనదగిన ‘మొఘల్-ఎ-ఆజమ్’ చిత్రంలో ఒక ఐకానిక్ పాటగా నిలిచిన ‘మోహే పంఘట్ పే నందలాల్ ఛేడ్ గయో రే’ అనే పాట లతా మంగేష్కర్ మధురమైన గాత్రం మధుబాల అపురూప సౌందర్యంతో విడదీయరాని బంధంగా అనిపిస్తుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ పాట అసలు రూపం కొద్దిగా మార్పు చెందిన సాహిత్యం.. ‘మోహే పన్ ఘట్ పే నందలాల్ ఘేర్ లియో రే’ అనే టూమ్రి నుండి తీసుకొన్నది. 1930లో గౌహర్ జాన్ శిష్యురాలు, నృత్యకారిణీ ఐన ఇందుబాల చేత ఒక టుమ్రీగా రికార్డ్ చేశారు. ఆమె గాత్రమే దేశంలో మొట్టమొదటి 78 RPM రికార్డు. ఈ పాట మధుబాలకు వెండి తెరపై అమరత్వం కల్పించింది కానీ క్రియేటివ్ వెర్షన్ పాడిన ఇందుబాల ప్రతిభ మరుగున పడిపోయింది.
ఈ తవైఫీలు సాధికారత, వ్యాపార దక్షత కలిగిన మహిళలే. కానీ భారతీయ సినిమాకు వారు చేసిన సేవకు గుర్తింపు లభించలేదు. నటన, సంగీతం, నృత్యం, చిత్ర నిర్మాణం వంటి అన్ని రంగాలలో వారు బొంబాయి నుండి కలకత్తా వరకు సినిమా రంగంలో మార్గదర్శకులుగా నిలిచారు. వారు ఎలాంటి రీటేక్‌లు, సాంకేతిక జోక్యం లేకుండా ప్రదర్శనలు ఇచ్చి కేవలం తమ ప్రతిభతోనే ప్రతి సవాలునూ అధిగమించారు. వారి పాటల గురించి మనకు తెలిసి ఉండవచ్చు, కానీ అవి వారి పేరిట వచ్చినవని మనకు తెలియదు.
గ్రామ్‌ఫోనుల శకంలో…
ఉదాహరణకు 2014లో వచ్చిన ‘దేఢ్ ఇష్కియా’ చిత్రంలో రేఖా భరద్వాజ్ నేపథ్య గానం పాడగా, మాధురీ దీక్షిత్ నటించిన ‘హమారీ అటారియా పే ఆజా రే సవారియా’ అనే పాట ఒకప్పుడు ‘మల్లికా-ఎ-గజల్’గా పేరుగాంచిన బేగం అక్తర్ పాడిన గానానికి అనుసరణ అనుకరణ కూడా. ఆమె పాడిన ఈ ప్రత్యేకమైన పాట భైరవి రాగంలో స్వరపరిచిన ఒక దాద్రా గీతం. బేగం అక్తర్ దాద్రా తుమ్రీ ప్రక్రియలలో కూడా ప్రావీణ్యమున్న గాయని. తన పాటలన్నింటికీ సొంతంగా సంగీతం సమకూర్చుకునేది.
ఆ రోజులలో గ్రామోఫోన్‌లో పాట రికార్డ్ అవ్వాలంటే పెద్ద స్పీకర్ ముందు తల ఉంచి గట్టిగా పాడాలి. అదీ కేవలం మూడు నిమిషాల పాటు మాత్రమే. అలా గట్టిగా పాడితే తమ ఊపిరితిత్తులు బయటకు వచ్చి యంత్రంలో పడిపోతాయని భయపడిన ఉస్తాద్‌లు పాడటానికి నిరాకరించారు. కానీ బాయిజీలు, తవాయిఫులు మాత్రం నిర్భయంగా ఆ యంత్రం ముందు పాడి పాటలను రికార్డ్ చేశారు. జాగ్రత్తగా గమనిస్తే, పురుషుల కంటే మహిళల రికార్డింగ్‌లే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రామోఫోన్ రాక పట్ల, మహిళలు గానం చేయడం పట్ల అప్పటి ఉస్తాద్‌లు (పురుష సంగీత విధ్వంసులు) అసహనం వ్యక్తం చేశారు. అంటే కళా రంగంలో తమ ప్రతిభతో ముందుకు పోవడానికి లింగ వివక్ష అడ్డుపడుతుందన్న విషయం మనకు అవగతం అవుతుంది.
కళారూపాలపై ఆంక్షలు
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రఖ్యాత రంగస్థల కళాకారిణి, గాయని జద్దన్ బాయి (నటి నర్గీస్ తల్లి) హిందీ చిత్రాలలో తొలి మహిళా సంగీత దర్శకురాలలో ఒకరు. ఒక నిర్మాణ సంస్థను కూడా నడిపింది. నటి-గాయని జహనారా కజ్జన్ తొలి బెంగాలీ సినిమాకు గాయక రాణిగా ప్రసిద్ధి చెందింది. ఇంద్రసభ (1932)లో ఆమె ఏకంగా 71 పాటలు పాడింది.
భారతదేశ సినీ, సంస్కృతిక చరిత్రలో ఈ మహిళలు ఎదుర్కొన్న ఉదాసీనతకు, తవైఫ్ సంప్రదాయం పట్ల ఉన్న ఏహ్య భావమే ప్రధాన కారణం. ‘మన సమాజంలో ఈనాటికీ ‘తవైఫ్’ అనే పదాన్ని చులకనగా చూస్తారు. ఒక శతాబ్దం కిందట వారు ఎంతో కీర్తి గడించారు. కానీ బ్రిటిష్ వారు ఈ కళారూపాలపై ఆంక్షలు విధించడం, వాటిని ఆధిపత్య భావజాలం, కఠినమైన దృష్టితో చూడటంతో ఆ సాంస్కృతిక ప్రభావం క్షీణించింది. దీనికి కొంతమంది సనాతనవాద నాయకులు కూడా మద్దతు ఇచ్చారు’ అని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డానిష్ ఇక్బాల్ అంటాడు.
ఎందుకు ఈ చిన్నచూపు?
‘తవైఫ్‌ను ఎందుకు అవమానకరంగా చూస్తున్నారు? తన లైంగికతపై పూర్తి నియంత్రణ కలిగిన స్వతంత్ర మహిళపై ఎందుకు చిన్నచూపు? వారు రాజభోగాలతో జీవించారు. బాగా చదువుకున్నారు. దేశదేశాలు తిరిగారు. వారి కాలంలో గొప్ప ప్రదర్శన కళాకారులుగా గౌరవించబడ్డారు. ‘వారు నాటక, సినిమా,నృత్య సంగీత అధ్యయనాలు పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉండాలి’ అని ప్రఖ్యాత నర్తకి, ఈ తవైఫ్‌ల జీవితాలను నత్యరూపకాలుగా మలచిన మంజరి చతుర్వేది నొక్కి చెబుతున్నది. ఎందరో మహిళా కళాకారిణులు గుర్తింపు లేకుండా మిగిలిపోవడానికి కారణమైన పితస్వామ్యంపై కొత్త వెలుగులు ప్రసరింపజేయాలని ‘ది కోర్టిజియన్స్ ప్రాజెక్ట్’ ద్వారా చతుర్వేది ప్రయత్నిస్తున్నది.
మహిళా పురోగతికి అడ్డంకులు
‘భారతీయ సినిమా పితామహుడిగా కీర్తించబడే దాదాసాహెబ్ ఫాల్కే పేర ఇచ్చే అవార్డు మనకు ఉంది. కానీ సాంప్రదాయ నృత్య సంగీతాల ద్వారా టాకీల తొలి దశకంలో సినీరంగంలో తమదైన కీలక భూమికను పోషించిన ఈ మార్గదర్శక మహిళల పేర్ల మీద ఒక్క అవార్డు కూడా లేదు. నాడు సమాజం ఒక మహిళ పురోగతికి పెట్టే అడ్డంకుల వల్ల వారి ప్రయాణం మరింత కష్టంగా ఉండేది. అది మరణాంతరం కూడా వారి ప్రతిభను గుర్తించడానికి అడ్డు వస్తున్నది. అయితే కొంత నయం అనుకునేటట్టుగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం మలయాళీలు తీసిన తొలి సైలెంట్ సినిమా విగతకుమారన్‌లో హీరోయిన్‌గా నటించిన పి.కే. రోజీ పేరున ఉత్తమ నటికి ఇచ్చే అవార్డును ఇవ్వడం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పీకే రోజీ ఒక దళిత కులానికి చెందిన నటి కావడం.
చరిత్రలో చిన్నచూపు
నిజానికి టాకీలు వచ్చిన మొదటి దశాబ్దంలోనూ, అంతకుముందు సైలెంట్ చిత్రాల కాలంలోనూ అట్టడుగు వర్గాల స్త్రీలు, కళావంతులు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బాయిజీలు, తవైఫ్‌లు. జమీందారుల సంస్థానాల సాంస్కతిక సభలలో నర్తించే వారి కంట్రిబ్యూషన్‌లోనే అసలైన సినీ చరిత్ర దాగి ఉంది. ‘ఉదాహరణకు, ‘మేడమ్ ఫ్యాషన్’ చిత్రంలో సురయ్యాను పరిచయం చేసిన జద్దన్ బాయి, నర్గీస్‌కు కాకుండా సురయ్యాకు లభించిన గుర్తింపును చూసి అసూయపడింది’ అని ఢిల్లీకి చెందిన విద్యావేత్త ఇక్బాల్ అంటాడు. హిందీ సినిమాకు పునాది వేసిన ఒకప్పటి తవైఫ్‌లు, వేశ్యల గురించి సినీ చరిత్రలో అప్రధానంగా రాయబడింది. వీరంతా కలకత్తా, లక్నో, ఢిల్లీ, బనారస్, లాహోర్‌లలోని ఆస్థానాలలో పాడి, నృత్యం చేసిన తవైఫ్, బాయిజీ సంప్రదాయం నుండి వచ్చారు. సినిమా కళ రాకతో వారంతా ఈ పరిశ్రమ వైపు పోటెత్తారు. ఇది ఆ కాలంలో కోఠే నత్యాల నుండి, రంగస్థలం నుండి సినిమా రంగం వైపు జరిగే ఒక సహజమైన పరిణామం. బాలీవుడ్‌లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్న బేగం అక్తర్, జహనారా కజ్జన్, రసూలన్ బాయి వంటి కొద్దిమంది కళాకారిణుల పాటలను, మొట్టమొదట పాడిన వారిని కూడా చరిత్రలో సరైన రీతిలో ప్రస్తావించలేదు. ఈ లెక్కన సినీ పరిశ్రమ తొలిదశలో అధికంగా నృత్యకారులు, గాయకులు, నటులుగా ఎక్కువగా తవైఫ్‌లు, వారి కుమార్తెలే ఉండేవారనేది వాస్తవం.
బేగం అఖ్తర్
”ఏ మొహబ్బత్! తేరే అంజామ్ పే రోనా ఆయా”!! ఈ గజల్‌ను రాసిన కవి పేరుతో కాకుండా దానిని పాడిన గాయని పేరుతో గుర్తుండి పోయింది. ఆ గాయని బేగం అఖ్తర్. అఖ్తరీ బాయి ఫైజాబాదీ 1914 అక్టోబర్ 7న జన్మించింది. తల్లి ముష్తరీ, తండ్రి అస్ఘర్ హుస్సేన్ న్యాయవాది. ఈమె జోహ్రా అనే కవల సోదరితో పాటు పుట్టింది. వీరు పుట్టాక ఆమె తండ్రి ఆమెను, తల్లిని విడిచిపెట్టడంతో వారి జీవితం కష్టాలలో మునిగిపోయింది. అయితే, ఆమెతన మామ ద్వారా పాట్నాలో సారంగీ విద్వాంసుడైన ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ వద్ద, ఆ తర్వాత పాటియాలాకు చెందిన అతా మహమ్మద్ ఖాన్ వద్ద శిక్షణ పొందింది. తర్వాత వారు కలకత్తాకు మారారు. అక్కడ, మహమ్మద్ ఖాన్, లాహోర్‌కు చెందిన అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్ లవద్ద ఆమె శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది.15వ ఏటనే తొలి సంగీత కచేరి చేసిన బేగం అత్తర్ ఆ తర్వాత టుమ్రీ, దాద్రా, గజల్ గానంలో గొప్ప పేరు సంపాదించింది. తర్వాత ఆమె సినిమాల్లోనూ నటించింది. బేగం అఖ్తర్ కలకత్తాలో ‘కింగ్ ఫర్ ఎ డే (ఏక్ దిన్ కా బాద్షా), నల దమయంతి’ (1933) చిత్రాలలో నటించి తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 1930ల మధ్యకాలంలో ‘ముంతాజ్ బేగం, అమీనా’ (1934), ‘రూప్ కుమారి’ (1934), ‘జవానీ కా నషా’ (1935), ‘నసీబ్ కా చక్కర్’ (1936) చిత్రాలలో నటించింది. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘రోటీ’ (1942) చిత్రంలో ఆమె నటించగా భారీగా విజయం సాధించింది. సామాజిక విమర్శనాత్మకమైన ఈ చిత్రంలో డార్లింగ్ అనే ప్రధాన పాత్రను పోషించింది. ఈ చిత్రం కోసం ఆరు గజల్స్ రికార్డ్ చేసినప్పటికీ, నిర్మాణ వివాదాల కారణంగా అవి తొలగించబడ్డాయి. సత్యజిత్ రే ‘జల్సాగర్’ (1958) ఆమె ఆఖరు చిత్రం.1974 అక్టోబర్ 30న ఆమె కన్ను మూసింది. ఆమె హైదరాబాద్ సంస్థానంలో పలుమార్లు కచేరీలు చేసింది.
జహాన్ ఆరా కజ్జన్
జహాన్ ఆరా కజ్జన్ టాకీ సినిమాల కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న కథానాయక. ఆమె కజ్జన్‌తో కలిసి నటించిన చాలా సినిమాలు ఆ రోజుల్లో బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించినవి. తొలి టాకీ వచ్చిన 1931లోనే కజ్జన్ నిస్సార్‌తో కలిసి నటించిన శకుంతల, లైలా మజ్ను ఆ కాలంలో భారీ విజయం సాధించాయి. 1932లో వీరి కాంబినేషన్లో వచ్చిన గుల్రు జరీనా, బిల్వమంగల్, ఇంద్రసభ చిత్రాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. బిల్వ మంగళ విదేశాలలో ప్రాసెసింగ్ జరుపుకున్న తొలి రంగుల చిత్రంగా రికార్డులకెక్కింది. అలా వీరిద్దరూ కలిసి ఎనిమిది సినిమాల్లో నటించారు. ఇక జహాన్ ఆరా విడిగా నటించిన స్వామి భక్తి, ఆలీబాబా 40 చోర్, జహాన్ ఆరా, జహ్రి సాంప్ తదితర చిత్రాల వల్ల 1930లలో సింగింగ్ స్టార్ కేఎల్ సైగల్‌కు మించిన ఫాలోయింగ్ ఆమెకు ఉండేది. నిసార్‌తో ఆమె వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు. జహాన్ ఆరా ఉర్దూ కవిత్వం రాసేది. నాట్యం చేసేది. ఆమె రుకయ్యా ఖాతూన్ వద్ద పాశ్చాత్య నత్యం కూడా నేర్చుకుంది. కలకత్తా క్లబ్‌లో నటి మేహజబీన్‌తో కలిసి పాశ్చాత్య నాట్యం చేసేది. ఐతే ఆమె కేవలం 30 ఏండ్ల వయసులోనే 1945 డిసెంబర్ 15న కన్ను మూసింది. ఒక విశేషమేమిటంటే 1965లో మన హైదరాబాదులో జరిగిన ఒక వేలంపాటలో ఆమె ఫొటో ఒకటి 125 రూపాయల ధర పలికింది. ఈ సంఘటనతో జహా ఆరాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉండేదో మనకు తెలుస్తుంది.
హెచ్.రమేష్ బాబు,
7780736386



