Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేయూత కొందరికేనా.?

చేయూత కొందరికేనా.?

- Advertisement -

వృద్ధుల ఆశలపై నీళ్లు!
ఓఏపీ మినహా మిగతా వాటికి దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – మల్హర్ రావు

‘ఒక ఇంట్లో ఒకే పింఛన్ ఎందుకు..మేము అధికారంలోకి వస్తే రెండు పింఛన్లు ఇస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల వరకు ఊరించి ఉసూరుమనిపించింది.చేయూత పథకంలో ఇచ్చే పింఛన్లలో వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయిచ్చింది.ఇప్పట్లో వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.ఇటీవల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది.ఈనెల 31 వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి గడువు విధించింది.దివ్యాంగులు,వితంతు,ఒంటరి మహిళలు, తలసేమియా,డయాసిస్,ఎయిడ్స్ తదితర వాటి కోసం కొత్త దరఖాస్తు నమూనాను కూడా విడుదల చేసింది.కానీ వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులు మాత్రం స్వీకరించడం లేదు.

58 ఏళ్లు నిండిన వారికే ఇస్తామని ప్రకటనలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పించన్లు ఇస్తామని చెప్పింది. అప్పట్లో కూడా వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా కొత్త పించన్లు మాత్రం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం రూ.4 వేల వరకు పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీనిచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తామని చెప్పింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటి నా ఇప్పటి వరకు కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు.ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.. కానీ, ఓఏపీ (ఓల్డ్ ఏజ్ పింఛన్) సైట్ మాత్రం ఓపెన్ చేయలేదు.దాంతో గత ప్రభుత్వం హయాం నుంచి ఎదురుచూస్తున్న వృద్ధుల ఆశలపై ప్రస్తుత ప్రభుత్వం నీళ్లు చల్లిందనే విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం పెడుతున్న దరఖాస్తులే కాకుండా గత ఐదేళ్లుగా మండలంలో ఆయా గ్రామాల్లో నేరుగా దాదాపు 344 పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించి ఆన్లైన్ చేశారు.అందులో వృద్ధాప్య దరఖాస్తులు 249 ఉన్నాయి.

అనుమతులు ఉన్నవే..ఎంపిడిఓ క్రాంతికుమార్
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పించన్లకే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.ఇప్పటి వరకు 330 దరఖాస్తులు రాగా 67 ఆన్ లైన్ చేశాం.వృద్ధాప్య దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు.అనుమతి వచ్చిన తరువాత వృద్ధుల దరఖాస్తులు స్వీకరిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -