Saturday, April 4, 2026
E-PAPER
Homeజాతీయంకాశీపట్నం చూడరా బాబూ!

కాశీపట్నం చూడరా బాబూ!

- Advertisement -

అభివృద్ధి పేరిట భౌగోళికతకు ముప్పు
స్థానికులు, చరిత్రకారులు, విశ్లేషకుల ఆందోళన
ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఇదీ పరిస్థితి
వారణాసి
: పురాతన నగరం కాశీలో అభివృద్ధి పేరిట జరుగుతున్న మార్పులు స్థానిక సంస్కృతి, చారిత్రక నిర్మాణం, పవిత్ర భౌగోళికతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆధునిక సౌకర్యాల కల్పన పేరుతో నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌ నగరానికి కొత్త రూపాన్ని ఇచ్చినా.. అది పాత వారణాసి ప్రభావాన్ని చెరిపేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆధునికీకరణ వర్సెస్‌ సంప్రదాయం
కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణం ద్వారా పెద్ద, శుభ్రమైన ప్రాంగణం, సౌకర్యాలు, టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇది ‘భక్తి స్థలం’ కంటే ‘టూరిస్ట్‌ అట్రాక్షన్‌’గా మారిందని స్థానికులు అంటున్నారు. టికెట్లు, క్యూలు, భద్రతా నియంత్రణలు పెరిగాయి. భక్తుడు, దేవుడి మధ్య సంబంధం ఒక వ్యవస్థ ఆధారంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భౌగోళికత నాశనం
వారణాసి ఒక ప్రత్యేక నగరం. ఇది సాధారణ నగరాల్లా రోడ్లు, గ్రిడ్‌ ప్లాన్‌ మీద నిర్మాణం జరగలేదు. గల్లీలు, ఆలయాలు, ఘాట్లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. యాత్ర మార్గాలు (పర్యటనలు) ఒక వలయం (సర్క్యులర్‌ సిస్టమ్‌)లో ఉన్నాయి. అయితే ఇక్కడ కారిడార్‌ నిర్మాణం కోసం ఈ సహజ నిర్మాణాన్ని తొలగించారు. దీంతో వందలాది ఇండ్లు, గల్లీలు, చిన్న దేవాలయాలు కూల్చివేశారు. పాత యాత్ర మార్గాలకు భంగం వాటిల్లింది.

మణికర్ణిక ఘాట్‌ మార్పులు
మణికర్ణిక ఘాట్‌ వద్ద కూడా పెద్ద మార్పులు చేయాలని ప్రణాళిక ఉంది. ఇందులో భాగంగా ఆధునిక శ్మశాన నిర్మాణం, పెద్ద రహదారులు, సౌకర్యాల కల్పన, పాత గల్లీలు, దుకాణాల తొలగింపుల చేయనున్నారు. అయితే ఈ మార్పుల విషయంలో స్థానికులతో పాటు చరిత్రకారుల నుంచి కూడా వ్యతిరేకత కనబడుతున్నది. ఇది స్థానిక సంప్రదాయాలను మరింత దెబ్బతీస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే అభివృద్ధి ఎక్కడైనా అవసరమే. కానీ సరైన మార్గం లేకుండా చేయడం అనేక సమస్యలను తీసుకొస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అభివృద్ధి అనేది.. గల్లీలు, పాత నిర్మాణాలను కాపాడుతూ ఉండాలనీ, మురుగు, చెత్త, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలనీ, స్థానిక సంస్కృతిని కాపాడాలని అంటున్నారు. లేకపోతే అలాంటి అభివృద్ధికి అర్థమే ఉండదని చెప్తున్నారు. అభివృద్ధి పేరు మీద చరిత్రను చెరిపేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజల అవసరాల కంటే టూరిజం ముఖ్యంగా కనిపిస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగర చరిత్రను అర్థం చేసుకోకుండా ప్రణాళికలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. వారణాసి వంటి పురాతన నగరానికి అభివృద్ధి అవసరం ఉన్నా.. అది సంస్కృతి, చరిత్ర, స్థానిక జీవన విధానాన్ని కాపాడేలా ఉండాలనీ, లేకపోతే నగరం బయటికి అందంగా కనిపించినా.. దాని అసలు స్వరూపాన్ని కోల్పోతుందని చరిత్రకారులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

స్థానికులపై ప్రభావం
ఇక్కడ చిన్న వ్యాపారులు తమ దుకాణాలు కోల్పోయారు. స్థానికంగా నివాసం ఉండేవారే తమ ప్రాంతంలో ‘బయటివాళ్ళు’గా మారిపోయారు. స్థానికులకు ఐడీ కార్డులు ఇచ్చి ప్రవేశాన్ని కల్పించడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

క్లీన్‌ స్లేట్‌ అభివృద్ధి విధానం
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా క్లీన్‌ స్లేట్‌, అంటే ముందుగా అన్నీ కూల్చి, తర్వాత కొత్తది నిర్మించాలి అనే విధానాన్ని పాటించారు. పాత నిర్మాణాలకు విలువ ఇవ్వలేదు. స్థానికుల జీవన విధానాన్ని పట్టించుకోలేదు. నగరాన్ని టూరిజం సెంటర్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో నగరం దాని సహజ స్వభావాన్ని కోల్పోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -