– దమ్మపేట ఎంపీడీవో భీమిరెడ్డి రవీంద్రారెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి
మనకు ప్రాప్తించిన దాని నుంచి ఇతరులకు ఏదో ఒక రూపంలో సహాయం అందించాలని, తద్వారా జీవితానికి సార్ధకత లభిస్తుందని దమ్మపేట మండల అభివృద్ధి అధికారి భీమిరెడ్డి రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సత్తుపల్లి మండల పరిధిలోని గౌరిగూడెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య పరీక్షల శిబిరం, పేదలకు రూ.40 వేల విలువైన క్యారేజీల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం యూనిట్ అధ్యక్షుడు ఎస్. కేశవరెడ్డి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రవీంద్రారెడ్డి మాట్లాడుతూ… కేశవరెడ్డి- సత్యవతి దంపతులు తమ మనుమడు గాదె ఇషాన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్రామికులకు క్యారేజీలు వితరణ చేయడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. శరత్ మాక్స్ విజన్ నేత్ర వైద్యశాల సిబ్బంది విక్రమ్ సింగ్, భీష్మ ప్రియ ఈ నేత్ర వైద్యం శిబిరంలో సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో గౌరిగూడెం సర్పంచ్ తోటకూరి అనూష శ్రీనివాసరావు, ఉపసర్పంచి పుచ్చకాయల స్వప్న నర్సారెడ్డి, గ్రామ పెద్దలు ముత్తారెడ్డి, బండి పిచ్చిరెడ్డి, ఏరువ సత్యనారాయణ రెడ్డి, దేవగిరి కేశవరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఎ.ఎస్. ప్రకాశరావు, జి. కృష్ణయ్య, బోడేపూడి బాబు, బూరుగు దాసు, సాంబశివరెడ్డి, బొల్లేపల్లి మధుసూదనరాజు పాల్గొన్నారు.



