– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
– గంగారంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుక
నవతెలంగాణ-సత్తుపల్లి
నిజాం నవాబుపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండలంలోని గంగారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచారని సండ్ర కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించిన పాపన్న గౌడ్, తన స్వశక్తితో బలమైన సైనిక శక్తిని నిర్మించుకున్నారని తెలిపారు. అప్పటి శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని సవాలు చేసిన గొప్ప ప్రజా వీరుడు పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలిచి, స్థానిక దోపిడీ, సామంత వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని గుర్తుచేశారు. ప్రజల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
ఖిలాషాపూర్, భువనగిరి, వరంగల్, తాటికొండ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని విస్తరించి, తాటికొండ కోటను కేంద్రంగా సైన్యాన్ని బలోపేతం చేసుకున్నారని వివరించారు. కేవలం యోధుడిగా మాత్రమే కాకుండా, స్వతంత్ర పాలనకు ప్రయత్నించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చూపిన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో గంగారం మాజీ సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాదిరాజు వాసుదేవరావు, కోటమర్తి సుజాతరావు, కూసంపూడి మహేష్, దొడ్డా శంకరరావు, కార్యకర్తలు, గ్రామస్తులు, పాపన్న గౌడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


