నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారంలోని సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, డిప్లొమా (ఈఈఈ) విద్యార్థులకు “అధునాతన పారిశ్రామిక ఆటోమేషన్” పై నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్ మంగళవారం ముగిసింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) హెచ్‌వోడీ కోట రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వర్క్‌షాప్‌నకు ఇండ్వెల్ ఆటోమేషన్ డైరెక్టర్ హిమాన్షు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆటోమేషన్ సాంకేతికతపై సమగ్ర అవగాహన కల్పించారు. పరిశ్రమల్లో యంత్రాలు, సెన్సార్లు, కంట్రోలర్లు, కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి తక్కువ మానవ జోక్యంతో ఉత్పత్తిని వేగంగా, కచ్చితత్వంతో ఎలా నిర్వహించవచ్చో కూలంకషంగా వివరించారు.

యంత్రాల నియంత్రణ, డేటా సేకరణ (ఎల్ఓటీ), మోటార్ల వేగ నియంత్రణ, ఉష్ణోగ్రత-ఒత్తిడి కొలతలు, ఆటోమేటిక్ వెల్డింగ్, ప్యాకింగ్ వంటి ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు. ఆటోమేషన్ వల్ల ఉత్పత్తి వేగం, నాణ్యత, కార్మికుల భద్రత పెరుగుతాయని, మానవ తప్పిదాలు, ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రాక్టికల్ వర్క్‌షాప్‌ల వల్ల విద్యార్థులకు సాంకేతికతపై ప్రత్యక్ష అనుభూతి, సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతాయని కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… కళాశాలలో పారిశ్రామిక స్థాయి బోధన అందుబాటులోకి రావడం శుభపరిణామమని, ఈఈఈ విద్యార్థులు విద్యుత్ రంగానికి వెన్నెముక లాంటివారని తెలిపారు. ఈఈఈ విభాగాధిపతి కోట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ఈ శిక్షణ వల్ల విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ సభ్యులు కూడా అధునాతన మెలకువలు తెలుసుకున్నారని తెలిపారు. సాయిస్ఫూర్తి కళాశాల, ఇండ్వెల్ ఆటోమేషన్ కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.



