Wednesday, August 19, 2026
E-PAPER

సూపు సూపర్‌…

- Advertisement -

వాన పడినప్పుడో, జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడో.. వేడి వేడి సూపు గొంతులోకి దిగుతుంటే వచ్చే ఆ హాయి మాటల్లో చెప్పలేనిది. సూప్‌‌లు నోటికి ఘాటుగా ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే చాలా మంది సూప్‌ ‌తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇటు రుచిని అందిస్తూనే ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల సూప్‌‌ల గురించి ఈరోజు తెలుసుకుందాం…

వెజిటబుల్స్‌‌తో
కావల్సిన పదార్థాలు: ఉల్లి, టొమాటో, క్యారెట్‌ – ఒక్కొకటి, బీన్స్‌ – ఆరు, గుమ్మడి, బ్రోకలీ – అర కప్పు చొప్పున, బఠాణీలు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, వెల్లుల్లి – మూడు రెబ్బలు, మిరియాల పొడి – అర స్పూన్, నూనె – స్పూన్, కొత్తిమీర – చారెడు

తయారు చేసే విధానం: కూరగాయలన్నింటినీ సన్నగా తరగాలి. అడుగుభాగం మందంగా ఉన్న పాత్రలో నూనె వేడి చేసి ఉల్లి, వెల్లుల్లి వేయాలి. అవి కాస్త వేగాక.. అన్ని కూరగాయ ముక్కలూ, ఉప్పు జతచేసి కలియతిప్పుతూ రెండు నిమిషాలు వేయించాలి. అందులో మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించి, దించేయాలి. చల్లారాక పప్పుగుత్తితో మెదపాలి. ఈ మిశ్రమానికి మిరియాల పొడి చేర్చి మళ్లీ వేడిచేయాలి. చివర్లో కొత్తిమీర జోడించి సెగ తీసేయాలి. అంతే కమ్మని వెజిటబుల్‌ ‌సూప్‌ ‌మీ ముందు ఉంటుంది.

క్యారెట్‌‌, జింజర్‌తో…
కావల్సిన పదార్థాలు: క్యారెట్లు – అర కిలో, అల్లం – రెండు అంగుళాల ముక్క, ఉల్లిగడ్డ – ఒకటి, వెల్లుల్లి – నాలుగు రెబ్బలు, నీళ్లు – ముప్పావు లీటర్, మిరియాలు, జీలకర్ర పొడులు – అర స్పూన్‌ చొప్పున, ఉప్పు – రుచికి సరిపడా, నిమ్మరసం – టేబుల్‌ స్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు

తయారు చేసే విధానం: క్యారెట్లను పీల్‌ చేసి చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిగడ్డను సన్నగా తరగాలి. అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచాలి. మందపాటి పాత్రలో క్యారెట్, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, ముప్పావు లీటర్‌ నీళ్లు జతచేసి ఉడికించాలి. సుమారు ఇరవై నిమిషాలకు ముక్కలు మెత్తబడిన తర్వాత సెగ తీసేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని మళ్లీ గిన్నెలోకి తీసి ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడులు, ఇంకొన్ని నీళ్లు చేర్చి.. ఐదు నిమిషాలు మరిగించి. నిమ్మరసం, కొత్తిమీర జోడించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అంతే క్యారెట్‌ జింజర్‌ సూప్‌ రెడీ. క్యారెట్‌తో పాటు టొమాటో కూడా చేరిస్తే.. మరింత రుచి, ఫ్లేవర్‌ వస్తాయి. వడ్డించే ముందు చిటికెడు మిరియాల పొడి చల్లితే చాలా రుచిగా ఉంటుంది. అభిరుచిని బట్టి అల్లం పరిమాణాన్ని ఇంకాస్త పెంచవచ్చు. జలుబు చేసినప్పుడు ఈ సూప్‌ తాగితే ఉపశమనంగా ఉంటుంది.

ఉల్లికాడలతో..
కావాల్సిన పదార్థాలు: చిన్నగా, సన్నగా తరిగిన ఉల్లికాడలు- కప్పు, అల్లంవెల్లుల్లి- చెంచా(తరిగిన), బిర్యానీ ఆకు- ఒకటి, ఉప్పు, నూనె, నీళ్లు- సరిపడా, వెన్న, మిరియాలపొడి- చెంచా, కార్న్‌ఫ్లోర్‌- రెండు చెంచాలు, చక్కెర- చిటికెడు.

తయారు చేసే విధానం: ఒక చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి (చిక్కటి పేస్ట్‌లా అవుతుంది). తర్వాత ఒక పాన్‌ పెట్టి వెన్న కరిగించి బిర్యానీ ఆకు, ఉల్లికాడలు వేసి పది నిమిషాలపాటు వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. కాసేపయ్యాక కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి కలిపి ఇంకాసేపు మరిగితే ఉల్లికాడల సూప్‌ రెడీ.

క్యాలీఫ్లవర్‌తో…
కావల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్‌ – కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, మిరియాల పొడి – ముప్పావు స్పూన్, తురిమిన అల్లం – అర స్పూన్, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి – స్పూన్, ఉప్పు – తగినంత, వెన్న – ఒకటిన్నర స్పూన్లు, ఆలివ్‌ నూనె – టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకోవాలి.

తయారు చేయాల్సిన విధానం: క్యాలీఫ్లవర్‌ను చిన్న పువ్వులుగా విడగొట్టి.. ఉప్పు నీళ్లలో తెర్లించి.. ఆ నీళ్లు వార్చేయాలి. ప్యాన్‌లో నూనె వేసి.. ఉల్లి తరుగును లేత బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి, క్యాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు చేర్చి కలియతిప్పి.. సన్న సెగ మీదుంచాలి. ఉడికిందనుకున్నాక దించేయాలి. చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేయాలి. కడాయిలో వెన్న వేడిచేసి మిరియాల పొడి వేసి.. వెంటనే గ్రైండ్‌ చేసిన క్యాలీఫ్లవర్‌ మిశ్రమం, రెండు కప్పుల నీళ్లు జోడించాలి. మూడు నిమిషాలు మరిగించి సెగ తీసేస్తే.. ఘుమఘుమలాడే ‘క్యాలీఫ్లవర్‌ సూప్‌’ సిద్ధమైపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -