గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ
కిలాషాపురం కోటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
నవతెలంగాణ – జనగామ
కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర’లో భాగంగా జనగామ జిల్లాలోని కిలాషాపురం కోటలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాత్రకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంవీ రమణ మాట్లాడారు. గీత కార్మికులకు పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, వృత్తిలో ప్రమాదాలకు గురై మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్సిగ్రేషియా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. వృత్తిలో ప్రమాదాలు జరిగిన గీత కార్మికులకు చెల్లించాల్సిన సుమారు రూ.20 కోట్ల ఎక్సిగ్రేషియా బకాయిలు కూడా విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలి
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గీత కార్మికులు వృత్తిలో ప్రమాదాలకు గురికాకుండా ప్రభుత్వం ‘కాటమయ్య రక్షణ కవచం’ అందిస్తామని ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో సుమారు 2.30 లక్షల మంది సభ్యత్వం కలిగిన గీత కార్మికులు ఉండగా, కేవలం 30 వేల మందికి మాత్రమే రక్షణ కవచం అందించారని తెలిపారు. వృత్తి చేస్తున్న ప్రతి గీత కార్మికుడికి వెంటనే రక్షణ కవచం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి గీత కార్మికుల సొసైటీకి ఐదెకరాల చొప్పున భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రజా ఆస్పత్రి ఎండీ సిగ విజయ్‌కుమార్ గౌడ్, సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని వెంకన్న, రాష్ట్ర గౌరవ సలహాదారు భీమగోని చంద్రయ్య, పామనుగుళ్ల అచ్చాలు, బోలగాని జయరాములు, చౌగాని సీతారాములు, కొండం కరుణాకర్, కుర్ర ఉప్పలయ్య, మొక్క నాగేశ్వరరావు, బుర్ర సుధాకర్, పాలకూరి జగన్, సురుగు రాజేష్ గౌడ్, హనుమాండ్ల కాడి నవీన్, రాష్ట్ర కమిటీ సభ్యులు కనకట రాజయ్య, పరిధిల భాస్కర్, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు పాల్గొన్నారు.
సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



