సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్ అన్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలపై దృష్టి సారించాలని, భావోద్వేగాలతో ప్రజల మధ్య వైశ్యామ్యాలను విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా జిల్లా అభివృద్ధికి దోహదపడే బోధన్ నుండి బీదర్ వెళ్లే రైల్వే మార్గాన్ని సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచటం సరైనది కాదని, దీని నిర్మాణానికి బిజెపి కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పటికీ దానిపై దృష్టి సారించకపోవడం శోచనీయమని అన్నారు.
అదేవిధంగా ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, దీని మూలంగా ప్రజలకు ప్రయాణ భారం తగ్గటంతో పాటు వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించటానికి గతంలో ఇప్పటి ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుండి బోధన్ వరకు పాదయాత్ర నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెరవకపోతే కేంద్రం నుండి నిధులు తెప్పించి నిజం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారనీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని విస్మరిస్తున్నారని గుర్తు చేశారు. దీని మూలంగా స్థానికంగా ప్రత్యామ్నాయ పంటలు వేయటానికి రైతాంగానికి ఉన్న అవకాశం కోల్పోవడంతో పాటు కార్మికులకు ఉపాధి కరువైందని అన్నారు.
అదేవిధంగా రైతులు, ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహించే నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా నిరాధారణకు గురై నిరుపయోగంగా మారిందని ఆయన అన్నారు. నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వృధాగా పోతున్న ఎల్లంపల్లి నుండి నీటిని తరలించాలని ఆయన సూచించారు. ఉపాధి అవకాశాలను పెంచకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి చెందటం అసాధ్యమని, అందువలన ప్రభుత్వం ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



