Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవార్తాపత్రికలకు ప్రాణం ఫొటో జర్నలిస్టులే

వార్తాపత్రికలకు ప్రాణం ఫొటో జర్నలిస్టులే

- Advertisement -

మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌‌రెడ్డి
జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాలు, హెల్త్‌ కార్డులు
సమాచార శాఖ కమిషనర్‌ జి.ముకుందరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వార్తా పత్రికలకు ఫొటోజర్నలిస్టులు ప్రాణం వంటివారని మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒక ఫొటో వెయ్యి మాటలతో సమానమ‌నీ, సమాజంలో జరిగే ప్రతి ముఖ్య ఘటనను భవిష్యత్ తరాలకు అందించే శక్తి ఫొటోజర్నలిస్టులకు మాత్రమే ఉందని కొనియాడారు. హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో తెలంగాణ స్టేట్ ఫొటోజర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో బుధవారం 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బెస్ట్ న్యూస్ ఫొటో కాంపిటీషన్-2026’తో పాటు ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దాదా పు రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ స్టేట్ ఫొటోజర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫొటోగ్రాఫర్ కేవలం కెమెరాను క్లిక్ చేసే వ్యక్తి కాదనీ, చరిత్రను భద్రపరిచే చరిత్రకారుడని కొనియాడారు. ఒక ఘటనను ఎంత గొప్పగా వర్ణించి రాసినా, దానికి సంబంధించిన మంచి ఫొటో ఆ ఘటనను సజీవంగా నిలబెడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రకృతి వైఫరీత్యాలు, ప్రమాదాలు, రాజకీయ పరిణామాలు, సామాజి క ఉద్యమాలు, పేదల కష్టాలు, విజయగాథలు తదితరాలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధిస్తున్నారని చెప్పారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సంఘటన స్థలాలకు చేరుకుని వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపించే ధైర్యం ఫొటోజర్నలిస్టుల సొంతమన్నారు. ప్రముఖుల పేర్లతో గతంలో ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ అవార్డులను పునరుద్ధరిం చడం ద్వారా ఈ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ రంగానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు,
 హెల్త్ కార్డులపై త్వరలో నిర్ణయం..
ఒక మంచి ఫొటో సమాజాన్ని ఆలోచింపజేయడంతో పాటు అధికారులను స్పందించేలా చేయగలదని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ జి.ముకుందరెడ్డి అన్నారు. బాధితుల సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో ఫొటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. “కాలం గడిచిపోతుంది.. మనుషులు మారిపోతారు.. కానీ ఒక గొప్ప ఫొటో మాత్రం ఆ క్షణాన్ని శాశ్వతంగా నిలబెడుతుంది” అని కొనియాడారు. ఫొటోగ్రాఫర్ సమాజానికి నిశ్శబ్ద సాక్షి, చరిత్రకు శాశ్వత సాక్ష్యమని అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల పట్టాలు, హెల్త్ కార్డులు, అవార్డుల అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఇండ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, హౌసింగ్ సొసైటీల అంశాలను మీడియా అకాడమీ ద్వారా పరిశీలించి ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇది ప్రభుత్వ పాలసీకి సంబంధించిన అంశమనీ, ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన అనంతరం దశలవారీగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. జర్నలిస్టులందరికీ ఈ నెలలోనే హెల్త్ కార్డులు వచ్చే అవకాశం ఉందని ముకుందరెడ్డి తెలిపారు. హెల్త్ కార్డుల కోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారనీ, ప్రభుత్వ ఉద్యోగులకు కార్డులు అందించిన అనంతరం జర్నలిస్టులకు కూడా ఒకేసారి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌‌పీజేఏ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, ఉపాధ్యక్షులు పి.రామ్మూర్తి, టి.కిషోర్ సింగ్, కోశాధికారి కె.అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎం.ఎ.సర్వర్, జి.వసంత్ కుమార్, ఎన్.శివకుమార్, మహ్మద్ అలీమోద్దీన్, ఎ.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -