పలు జిల్లాల్లో పాలిటెక్నిక్
విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-విలేకరులు
స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి ప్రభుత్వం తెచ్చిన శక్తి స్కీమ్ జీవో 97తో పేద, ఆర్థికంగా వెనుకబడిన పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నత విద్యకు అడ్డంకులు సృష్టించొద్దని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్ రామంతాపూర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అయితే విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో వారు తిరిగి కళాశాలకు చేరుకుని ప్రాంగణంలోనే ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్ధులు కళాశాల ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పరకాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శివాజీ చౌరస్తా వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతొ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, విద్యార్థులు గంటపాటు రాస్తారోకో నిర్వహించి రహదారిని పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నినాదాలతో ప్రాంతం మార్మోగింది. దాంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్ధులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల మూడేండ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయలేక పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త స్కీమ్‌ల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
జీవో 97 రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



