Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్సీ, ఎస్టీ నిధులు దారిమళ్లితే కఠిన చర్యలు

ఎస్సీ, ఎస్టీ నిధులు దారిమళ్లితే కఠిన చర్యలు

- Advertisement -

సంక్షేమ పథకాల అమలుపై 
నిరంతర పర్యవేక్షణ
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ 
బక్కి వెంకటయ్య
నవతెలంగాణ-భూపాలపల్లి

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పక్కదారి మల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్‌ఓఆర్, ఉద్యోగుల పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధుల వినియోగం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ… మంజూరైన నిధులను ఎస్సీ, ఎస్టీ ఆవాసాలకు ఖర్చు చేయకపోతే ఆయా శాఖల అధికారులే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఛైర్మన్ సూచించారు. కేసుల దర్యాప్తు, బాధితులకు న్యాయం, పరిహారం అందించడం వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేసుల పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే సమయంలో రోస్టర్ రిజర్వేషన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులకు భంగం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీవ్రమైన నేరాలకు, ముఖ్యంగా హత్య, అత్యాచారం వంటి ఘటనలకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కేవలం పరిహారంతోనే వదిలేయకుండా వారి పునరావాసంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఉపాధి అవకాశాలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, గృహ వసతి, పునరావాస సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా గ్రామ స్థాయిలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు తహశీల్దార్లు, ఎస్‌ఐలు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. గ్రామీణ ప్రజలకు ఎస్సీ, ఎస్టీల హక్కులు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుబాటులో ఉన్న ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలపై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, ఇతర నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఎస్సీ, ఎస్టీ ప్రజల పట్ల అధికారులు మానవీయ కోణంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత శాఖలు సమయపాలనతో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిష్కరించి, వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. విదేశీ విద్యా, బాధితులకు పరిహారం, కులాంతర వివాహం ప్రోత్సహకాల చెల్లింపులు పెండింగ్ ఉన్నవాటి నివేదిక అందచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ బాధితులకు కమిషన్ సూచించిన విధంగా ఇండ్ల కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి నెలా క్రమం తప్పక పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ లైంగికదాడులు తదితర సంఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం ఛైర్మెన్, కమిషన్‌ సభ్యులకు జ్ఞాపిక అందచేశారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఆర్‌ఓ వసంత కుమారి, ఎ‌స్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, కాటారం, భూపాలపల్లి డీఎస్పీలు సూర్య నారాయణ, సంపత్ రావు, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -