తర్జనభర్జనల మధ్య కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక !
నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రనాయక్
నవతెలంగాణ- మరిపెడ
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికపై కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది, ఈ ప్రక్రియ బుధవారం అనేక తర్జనభర్జనల మధ్య పూర్తయింది. మున్సిపల్ చట్టం ప్రకారం మైనార్టీ, వెనుకబడిన వర్గాలు, ఎస్సీ తదితర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అధికారికంగా ఎంపికైన సభ్యులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఎస్కె.ఖాదర్ బాబా, బసిక విమల అశోక్, బీసీ సామాజిక వర్గం నుంచి శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏపూరి కృష్ణ కో-ఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిపాలనలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రధాన ఉద్దేశమన్నారు.
ప్రజా సమస్యలను గుర్తించి పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడం, పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయడం కో-ఆప్షన్ సభ్యుల బాధ్యత అన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, పచ్చదనం పెంపు, మురుగునీటి నిర్వహణ, పట్టణ సుందరీకరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నిబద్ధతతో పనిచేయాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తన పూర్తి సహకారం ఉంటుందని సభ్యులకు భరోసా ఇచ్చారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికతో మున్సిపల్ పాలనలో వివిధ వర్గాల భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంతో పాటు పట్టణాభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్ చైర్పర్సన్ మాద లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, వార్డ్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
డోర్నకల్ మున్సిపాలిటీలో ఉత్కంఠకు తెర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



