Thursday, August 20, 2026
E-PAPER
Homeఖమ్మంపారిశుద్ధ్య నిర్వహణ, వనమహోత్సవంపై కీలక నిర్ణయాలు

పారిశుద్ధ్య నిర్వహణ, వనమహోత్సవంపై కీలక నిర్ణయాలు

- Advertisement -

– మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. గురువారం నిర్వహించిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, వనమహోత్సవం తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు.

మున్సిపాలిటీ శానిటేషన్‌ విభాగానికి సంబంధించిన చికెన్‌ వ్యర్థాలను సక్రమంగా సేకరించి, ప్రజారోగ్యానికి, పరిసరాల పరిశుభ్రతకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు. సేకరించిన వ్యర్థాలను వేలం ద్వారా విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. వ్యర్థాల వల్ల ఏర్పడే దుర్వాసన, అపరిశుభ్రత, ప్రజారోగ్య సమస్యలను నివారించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు:
వనమహోత్సవం – 2026లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. ఇందుకోసం మొక్కలు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో నాటడంతోపాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయడం, కలుపు మొక్కలను తొలగించడం, మొక్కల ఎదుగుదలను పర్యవేక్షించడం వంటి పనుల కోసం ఇద్దరు లేబర్లను మూడు నెలలపాటు తాత్కాలికంగా నియమించుకునేందుకు కౌన్సిల్‌ అనుమతించింది.

పట్టణంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, నాటిన మొక్కల మనుగడ శాతాన్ని పెంచడమే వనమహోత్సవం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు, మున్సిపల్‌ నిబంధనల మేరకు కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయాలని అధికారులు, సిబ్బందిని కౌన్సిల్‌ ఆదేశించింది.

సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ, కమిషనర్‌ తూడి దిలీప్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు, అకౌంటెంట్‌ మక్కెళ్ల చిన్నబాబు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -