Saturday, August 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‌‘‘దిమాగీ నక్సల్స్‌’’ ఎవరు? ప్రశ్నించే మెదళ్లు ప్రమాదమా?

‌‘‘దిమాగీ నక్సల్స్‌’’ ఎవరు? ప్రశ్నించే మెదళ్లు ప్రమాదమా?

- Advertisement -

“దిమాగీ నక్సల్స్”… వ్యాఖ్య ఈ పంద్రాగస్టు సందర్భంగా దేశ రాజకీయ వాతావరణంలో మారుమోగుతోంది. అసలు ఈ పదాన్ని ఏ ఉద్దేశంతో ఉపయోగించారో స్పష్టంగా తెలియకపోయినా, ఇందులో కనిపిస్తున్నది మాత్రం ఒక ఆధిపత్య భావజాల మానసిక ధోరణి. తమను ప్రశ్నించే గొంతులను, తమ పాలనను వేలెత్తిచూపే ఆలోచనలను అనుమానంగా చూడటం, విమర్శను శత్రుత్వంగా పరిగణించడం, తెలివిగా ప్రశ్నించే వారిని ఒక ముద్రతో పక్కకు నెట్టేయడం-ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు.“దిమాగీ నక్సల్స్” అని వినగానే సాధారణంగా ప్రజల మనసులో మెదిలే అర్థం ఒక్కటే-తెలివిని ఉపయోగిస్తూ ప్రశ్నించే వారంతా ప్రమాదకరులనే భావన. అంటే ప్రభుత్వాన్ని, దాని విధానాలను, పరిపాలనా తీరును ప్రశ్నించగలి గినవారు అధికారంలో ఉన్నవారికి మింగుడు పడటం లేదన్నమాట. “పండితుడు పక్కన కూర్చుంటే అవధానికి చెమటలు పడతాయట” అన్న సామెత చందంగా, తమకంటే ఎక్కువగా ఆలోచించేవారు ఎదురుగా ఉన్నప్పుడు అధికారానికి అసౌకర్యం కలగడం కొత్త విషయం కాదు. మతం, ఆధిపత్యం, అస్తిత్వ భావజాలం, అధికారమే పరమావధిగా మారినప్పుడు “తానుతప్ప మరెవ్వరూ తెలివి ప్రదర్శించకూడదు” అనే మనస్తత్వం పాలకుల్లో ఏర్పడటం సహజమే.

పురాణాలు, చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. మర్యాద పురుషోత్తముడుగా పిలువబడే శ్రీ రాముడు కూడా తపస్సు చేస్తూ వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నాడని తెలుసుకుని శంభూకుడు అనబడే దళితవ్యక్తి తల నరికించిన సంఘటన రామాయణ ఇతివృత్తంలో మనకు కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణ బాలుడు అకాల మరణం చెందడానికి ఈ శంభూకుని తపస్సు కారణమని భావించి రాముడు ఆ పని చేసినట్టుగా రామాయణంలో ఒక భాగంలో పేర్కొనబడింది. అందుచేతనే ఆ తర్వాతి కాలంలో శూద్రులు ఎవరూ మంత్రోచ్ఛారణలు చేయరాదని చెవులలో సీసం పోసేవారని కూడా అనేక సందర్భాల్లో వినపడుతుంది. మహాభారతంలో కులం తక్కువ వాడని వెలివేసినప్పటికీ కూడా విలువిద్యలో రాటుదేలిన ఏకలవ్యుడిని ద్రోణాచార్యుడు ఏం చేశాడో అందరికీ తెలిసిందే. సమాజంలోని అసమానతల పట్ల, వివక్ష పట్ల, సామాజిక హక్కుల పట్ల గొంతెత్తిన జ్యోతిరావు పూలే, పెరియర్ ఈ.వి రామస్వామి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటివారందరూ ఆధిపత్య భావజాల, అధికార మదాందుల ఆగ్రహావేశానికి బలైనవారే. “బాంచన్ దొర” అని అన్నప్పుడు రాజు మొహంలో ఎంత దివ్యమైన తేజస్సు వెలుగుతుందో, అదేరాజు పక్కన ‘‘నేనెందుకు కూర్చోకూడదు’’ అని ఒక్క ప్రయత్నం చేసినా అంగీకరించలేని స్థితికి అధికార పీఠం పాలకులను చేరుస్తుంది.
క్రీస్తుపూర్వం 399లో అపారమైన మూఢ నమ్మకాలను ప్రశ్నించి, ప్రతి అంశాన్ని కూడా తర్కంతో చూడవలెనని యువతకు బోధిస్తూ నూతన ఆవిష్కరణలకు ప్రశ్నల ద్వారా సమాధానాలు వెతుకుతున్న సోక్రటీస్‌‌ను ఆనాటి ప్రభుత్వం అత్యంత క్రూరంగా హత్య చేసింది. భూమి గుండ్రంగా ఉందని వాదించిన ప్లేటోపై కూడా రాజ్య ధిక్కరణ కేసులు పెట్టింది. అవన్నీ అత్యంత క్రూరమైన, నాగరికత ఏమాత్రం అభివృద్ధి చెందని సమాజాలు. రాజు దైవాంశ సంభూతుడిగా వెలు గొందుతున్న కాలాలు. ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులను నిర్ణయిస్తారు, ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు, ప్రజాభిప్రాయమే పాలకులకు పరమావధి,మెజారిటీ ప్రజల అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తమైనప్పుడు పాలకులు తమ శాస నాలను తిరిగి రాసుకునే పరిస్థితి ప్రజాస్వామ్యంలోనే ఉంటుంది. దాదాపు 2500 సంవత్సరాల తర్వాత కూడా అదే పద్ధతిలో ఒక ఆధిపత్య భావజాలంతో “దిమాగి నక్సల్స్” అంటూ పరోక్షంగా, స్వాతంత్ర దినోత్సవ సాక్షిగా 145 కోట్ల ప్రజానీకాన్ని నిందించడం అంటే అది దేనికి సంకేతం?
ఏ సమాజంలోనైనా “వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురము” అర్థరహితమని భర్తృహరి ఏనాడో విశదీకరిం చాడు. బుధవర్గం అంటే పండితులు, విషయ పరిజ్ఞానం కలిగినవారు, ఆలోచనాపరులు. అలాంటి వారు సమాజంలో ఎక్కువగా ఉండాలని కోరుకోవాలి. “ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః” అనే వేద వాక్యం కూడా ప్రపంచంలోని అన్ని దిక్కుల నుంచి శ్రేయస్కరమైన ఆలోచనలు రావాలని సూచిస్తుంది. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అనే భావన కూడా సత్యాన్ని అన్వేషించే భిన్న దృక్కోణాలకు స్థానం కల్పిస్తుంది. అయితే “ఘనమైన చరిత్ర, గణనీయమైన వారసత్వం” మనదని చెప్పుకోవడంలో అసలు అర్థం ఏమిటి? మన వారసత్వంలో దాగి ఉన్న ఇలాంటి విశాలమైన ఆలోచనలను ఆచరణలో పెట్టడమే కదా! అలాకాకుండా ఎవరో ఎద్దేవా చేసినట్లు, “మానవతావాదివి కావాలంటే చదువుకుని మహా పండితుడివై ఉండాలి, మతతత్వవాదివి కావాలంటే నీకు ఏమీ తెలియని మూర్ఖత్వం పట్ల నీవే గర్వంతో విర్రవీగుతూ ఉండాలి” అనే పరిస్థితి ఏర్పడితే అది సమాజానికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుంది? విశ్వమంతా, సర్వకాలాలలో, సర్వ మతాలలో విజ్ఞులకు, వారి విజ్ఞతకు పెద్దపీట వేస్తుంటే, మనం విజ్ఞత కలిగిన వారినే శత్రువులుగా భావించడం సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యతని స్తున్నట్లా? లేక అధికార పీఠానికి బీటలు పడతా యన్న అభద్రతతో వణికిపోతున్నట్లా?

మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా గళమెత్తినప్పుడు, అక్కడి పరిస్థితులు ఆయన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ అనుభవాలే ఆయన్ను భారతదేశంలోని వివక్షను, బ్రిటిష్ వలస పాలనను ప్రశ్నించే దిశగా నడిపించాయి. భారత స్వాతంత్ర్యోద్యమానికి కొత్త ఊపిరినిచ్చిన పూజ్య బాపూజీని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం “దిమాగీ నక్సల్” అని ముద్రవేయలేదు. బక్కపలుచని శరీరం, తీగలాంటి సాధారణ గొంతు ఉన్నప్పటికీ, ఆయన ఆలోచనల ముందు ప్రపంచం తలవంచింది. భారతదేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని నెహ్రూ తదితరులు పట్టుబట్టినప్పుడు గాంధీజీ తొలినాళ్లలో వారి వ్యూహాలతో విభేదించిన సందర్భాలున్నాయి. కానీ, చివరికి పూర్ణ స్వరాజ్య లక్ష్యాన్ని ఆయన కూడా అంగీకరించారు. అంటే భిన్నమైన ఆలోచనను మొదట వ్యతిరేకించినా, దానిలోని న్యాయాన్ని గుర్తించి తన అభిప్రాయాన్ని మార్చుకునే గొప్పతనం కూడా నాయకత్వంలో ఉండాలి.అదే విధంగా, బాల్యం నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్న, తరగతి గది బయట కూర్చోవాల్సి వచ్చిన, నీటి కోసం కూడా అవమానాలను ఎదుర్కొన్న బాలుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌గా ఎదిగాడు. తన మేధస్సుతో, ప్రశ్నలతో, అధ్యయనంతో దేశాన్నే ఆలోచింపజేశాడు. చివరికి అదే సమాజం భారత రాజ్యాంగాన్ని రూపొందించే అత్యంత కీలకమైన బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఇదే కదా దిమాక్‌ను ఉపయోగించుకునే నిజమైన పద్ధతి! సమాజ గతికి, పాలకుల ఏకపక్ష ధోరణులకు, అన్యాయాలకు ఎదురు నిలిచినవారే అనేకసార్లు నూతన శకానికి నాంది పలికారు. ప్రశ్నించే వ్యక్తి శత్రువు కాదు, సమాజం తప్పు దారిలో వెళ్ల కుండా హెచ్చరించే కాపలాదారు. విమర్శించే మేధస్సు పాల కులకు శాపం కాదు, అది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం.

ఇంతటి సూక్ష్మాన్ని మరిచి నిప్పులాంటి ప్రశ్నించేతత్వంపై దుప్పటి కప్పేస్తే, సదరు దుప్పటి బూడిదై పోతుందని వేరే చెప్పాలా! నిజానికి ఇప్పుడు జరుగుతున్నది నైపుణ్య దోపిడీ, దానిపై స్వారీ. అనగా ఇతరుల నైపుణ్యాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తూ తమకు అనుకూలమైన విధంగా లాభాలను దండుకోవడమే పరమావధిగా నడుస్తోంది. దీనినే ‘‘దిమాగీ చోరీ’’అనవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఉన్నతాధికారుల నుండి మొదలు అనేకమంది నిపుణుల ఆలోచనలలో చొరబడి తమకు అనుకూలమైన విధంగా, తమ విధానాలు మాత్రమే పరిఢవిల్లే విధంగా ప్రభుత్వ పాలసీలను తయారు చేయించి, అట్టి పాలసీలను ప్రజలపై రుద్ది, తాత్కాలిక రాజకీయ లబ్ధి పొందుతూ ఉంటారు. రకరకాల పన్నుల విధింపు నుంచి ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడే విధమైన అనేక రకాల ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇలాంటి అనేకమంది అధికారుల మెదళ్లను పావులుగా ఉపయోగిస్తూ ఉంటారు. పాలకులకు ఉపయోగపడే సలహాలు ఇచ్చేవారు “దిమాగీ నక్సల్స్” కారు, అదే సలహాను ప్రశ్నిస్తే, ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే, ఒక్కసారిగా వారే “దిమాగీ నక్సల్స్” అయిపోతారు. మరి ఇది ఏ రకమైన ప్రమాణం?
​అంతేకదా సార్! ఎన్నికల్లో తమకు ఉపయోగపడే సలహాలు ఇచ్చినవారు మంచి వ్యూహకర్తలు,ప్రతిపక్ష పార్టీకి సలహాలిచ్చిన వారంతా ద్రోహకర్తలు! ఇలాంటి భావ దారిద్ర్యం మెదడులో నిండుకున్నప్పుడు ప్రజలలోని పండితులంతా శత్రువులుగానే కనిపిస్తారు. ఇలాంటి పోకడలకు చరమగీతం పాడకపోతే అది పెరిగి మరింత పెద్ద రాచపుండుగా మారుతుంది. ఆలోచనాపరులను వేలెత్తి చూపడంతో ఆగకుండా, చివరికి ప్రతి ముఖానికి ముసుగు వేసుకుని తిరగమని శాసించే రోజులకు కూడా ఇది దారితీయవచ్చు. అందుకే ప్రశ్నించే మెదడును “దిమాగీ నక్సల్” అని ముద్రవేయడం కాదు, ఆ మెదడు ఎందుకు ప్రశ్నిస్తుందో వినాలి. విమర్శను అణచివేయడం కాదు, విమర్శలోని వాస్తవాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రమాదం ప్రశ్నించే పౌరుడి నుంచి కాదు, ప్రశ్నించడానికి భయపడే సమాజం నుంచి మొదలవుతుంది.
జి.తిరుపతయ్య, 9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -