Saturday, August 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవచ్చే 16న దానం అనర్హతపై తీర్పు

వచ్చే 16న దానం అనర్హతపై తీర్పు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
ఖైరతాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.. తీర్పును సెప్టెంబరు 16న వెలువరిస్తామని ప్రకటించింది. దానం కాంగ్రెస్‌లో చేరారని, కాంగ్రెస్‌ నుంచి సికింద్రాబాద్‌ లోక్‌సభ సీటుకు పోటీ చేశారని, ఆయనపై అనర్హత ప్రకటించాలన్న పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా వేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ పూర్తి చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకులు, సీఎం సమక్షంలో బహిరంగంగా ఆ పార్టీలో చేరినట్టు పత్రికలు, మీడియాలో వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. దీనిపై దానం తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ, పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని అనర్హత వేటు వేయాలని కోరడం సమంజసం కాదన్నారు. దానం బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఆ పార్టీ కూడా ఆయనను బహిష్కరించలేదని తెలిపారు. ఇతర పార్టీల నేతలను కలవడాన్ని వ్యక్తిగత అంశంగా చూడాలని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజ్యాంగంలో ఎలాంటి నిషేధం లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సెప్టెంబరు 16కు వాయిదా వేసింది.

​కల్తీ మసాలాల కేసులో కౌంటరు దాఖలు చేయాలి
కల్తీ మసాలాల తయారీకి సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితులకు తక్షణ ఉపశమనం కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. కల్తీ మసాలాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ వికాస్‌ అగర్వాల్‌ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆహార కల్తీకి సంబంధించి కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు లేదని పేర్కొన్నారు. పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో పిటిషనర్‌ అక్కడ లేరని, పోలీసు కస్టడీలో ఉన్న మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసినందున దానిని కొట్టివేయాలని కోరారు.
పీపీ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. నగరంలో విస్తరిస్తున్న ఆహార కల్తీని అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ముఠాలుగా ఏర్పడి తయారు చేస్తున్న కల్తీ ఆహార పదార్థాలను ప్రజలు వినియోగిస్తున్నారని, వాటిని వినియోగిస్తున్న వారిలో న్యాయమూర్తులు కూడా ఉన్నారని కోర్టు దష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

​బార్‌ కౌన్సిల్‌ ఎన్ రోల్‌మెంట్‌కు లైన్‌ క్లియర్‌
సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల కారణంగా నిలిచిపోయిన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్ రోల్‌మెంట్‌ ప్రక్రియను తిరిగి కొనసాగించేందుకు హైకోర్టు అనుమతించింది. ఎన్ రోల్‌మెంట్‌పై సింగిల్‌ జడ్జి విధించిన మధ్యంతర నిలుపుదల ఉత్తర్వుల అమలును ధర్మాసనం నిలిపివేసింది. ఎన్నికలు పూర్తయినప్పటికీ తాత్కాలిక కమిటీ ఎన్ రోల్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టడాన్ని సవాలు చేస్తూ బి.జగదీశ్వర్‌ దాఖలు చేసిన పిటిషన్ పై సింగిల్‌ జడ్జి విచారణ జరిపి ఎన్ రోల్‌మెంట్‌ను నిలిపివేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయశాస్త్ర విద్య పూర్తి చేసిన కె.బి.శ్రీజారెడ్డి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అప్పీలుదారు తరఫు న్యాయవాది బాగ్లేకర్‌ ఆకాశ్‌కుమార్‌ వాదిస్తూ.. తన క్లయింట్‌ జులై 27న ఎన్ రోల్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆగస్టు 13న ఎన్ రోల్‌మెంట్‌ జరగాల్సి ఉండగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల కారణంగా ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. దీనివల్ల పిటిషనర్‌కు ఉన్న హక్కులకు నష్టం జరుగుతోందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన విద్యార్థులకు బార్‌ కౌన్సిల్‌లో ఎన్ రోల్‌మెంట్‌ అయ్యే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్ రోల్‌మెంట్‌ ప్రక్రియకు బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలతో సంబంధం లేదని పేర్కొంది. తాత్కాలిక కమిటీ ఆధ్వర్యంలో ఎన్ రోల్‌మెంట్‌ ప్రక్రియను యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్ రోల్‌మెంట్‌ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్టు బార్‌ కౌన్సిల్‌ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -