కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అత్యున్నత విద్యా ప్రమాణాలను విద్యార్థులకు అందించేందుకు తెలంగాణ రాష్ర్టంతో కలిసి పనిచేయాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందాన్ని కోరారు. దీనికోసం విద్యారంగంలో ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా సీఎం కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట, ‘ఫ్రూగల్ ఏఐ’ కో-చైర్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో విద్యా కార్యక్ర మాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకరించడం వంటి అంశాల్లో భాగస్వామ్యానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొనేందుకు వారు అంగీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలనే ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూరుస్తున్నదని చెప్పారు.
సీఎంతో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆసక్తి చూపారు. ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శిస్తామని తెలిపింది.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి
లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సందర్శించారు. ఆ కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రలేషియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర విశిష్టత, విద్యారంగంలో ఉన్న అవకాశాలను వారికి వివరించి, కలిసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు రావాలని ఆ కాలేజీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమాండా మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. పరిశోధనారంగంలో భాగస్వామ్యం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై కూడా తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ (స్టెమ్-ఎస్టీఈఎం), బిజినెస్ విద్యా రంగాల్లో ఇంపీరియల్ కాలేజీ ప్రపంచంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థతో తెలంగాణ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరగడం రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు మరింత ఊతమిస్తుందని ఈ సందర్భంగా రామకృష్ణారావు తెలిపారు.



