Sunday, August 23, 2026
E-PAPER
Homeజాతీయంజెన్ జీ కోసం బీజేపీ తంటాలు

జెన్ జీ కోసం బీజేపీ తంటాలు

- Advertisement -

మోడీ ‘రీల్స్‌’ రాజకీయం.. అయినా సీరియస్‌‌గా తీసుకోని యువత
ఒకప్పుడు వాట్సాప్‌, ఎక్స్‌లో ‘విపరీత’ ప్రచారాలు.. నేడు ఇన్‌‌స్టాగ్రాంలో కొత్త రకం సవాలు
యువత నిరసనలు, మీమ్స్‌, రీల్స్‌ ప్రభావంతో మారుతున్న రాజకీయ వాతావరణం​

దశాబ్దకాలంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి వేదికల ద్వారా తమ రాజకీయ సందేశాలను బలంగా ప్రచారం చేసిన బీజేపీకి ఇప్పుడు కొత్త తరం సోషల్‌మీడియా వాస్తవం సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా జెన్‌ ‌జీని చేరుకునేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త శైలిని ఎంచుకుంటోంది. ఇందుకోసం నానా తంటాలు పడుతోంది. ఢిల్లీలో విద్యార్థులు, యువత నిరసన అనంతరం ఈ మార్పు కనబడింది. ‘హలో ఫ్రెండ్స్‌’ అంటూ ప్రధాని మోడీ ఇన్‌‌స్టా రీల్స్‌‌లో స్పందించినప్పటికీ.. యువత దానిని సీరియస్‌‌గా తీసుకోవడం లేదు. పైగా దానిని ఒక ‘క్రింజ్‌’ కంటెంట్‌గా చూస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూఢిల్లీ : భారత రాజకీయాల్లో సోషల్‌మీడియాను విరివిగా వినియోగించు కొని ప్రజల మెదళ్లను కలుషితం చేయడంతో బీజేపీ ముందుంటుంది. ఇది ఎంతలా మారిందంటే ‘వాట్సాప్‌’లో వచ్చే గాలి వార్తలు కూడా నిజమని నమ్మించేలా. అందుకే ఆ పార్టీకి ‘వాట్సాప్‌ ‌యూనివర్సిటీ’ అనే వ్యంగ్యమైన ట్యాగ్‌ ‌వచ్చింది. ఒక్క వాట్సాప్‌ ‌మాత్రమే కాదు.. ఫేస్‌బుక్‌ పేజీలు, ఎక్స్‌ ఖాతాల ద్వారా ఆ పార్టీ తాను తన రాజకీయ సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లింది. అయితే సోషల్‌మీడియా ప్రపంచం మారుతోంది. యువత ముఖ్యంగా ఇన్‌‌స్టాగ్రామ్‌ ‌రీల్స్‌, మీమ్స్‌, షార్ట్‌ ‌వీడియోలు, లైవ్‌‌స్ట్రీమ్స్‌ ‌ద్వారా రాజకీయాలను చూస్తున్న తరుణంలో.. పాత డిజిటల్‌ ‌వ్యూహాలు సరిపోతాయా అన్న ప్రశ్న బీజేపీ ముందుకొచ్చింది.

​‘సీరియస్‌ ‌మోడీ’ నుంచి ‘
క్యాజువల్‌ ‌మోడీ’ వరకు…
ప్రధాని మోడీ వ్యవహార శైలిలో కూడా మార్పు కనిపించింది. ఇన్నేండ్లు తనకు రాజకీయంగానూ, సామాజిక మాధ్యమాల్లో తిరుగు లేదని భావించిన మోడీకి తాజా పరిణామాలు రుచించడం లేదు. ఇన్నేండ్లు బీజేపీ ఐటీ సెల్‌‌తో విస్తృతంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రత్యర్థులపై బురద జల్లుతూ లాభం ‌పొందారు. ఓ విధంగా సీరియస్‌ ‌ప్రధానిగా కనిపించారు. అయితే ఇన్‌‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ ‌షార్స్ట్‌ ‌వంటి వాటి ఎఫెక్ట్‌‌తో ఆయన ఇప్పుడు ఒక క్యాజువల్‌ మోడీలా కనబడుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. గెట్‌ ‌రెడీ విత్‌ ‌మీ తరహా రీల్స్‌, యువతను ఫ్రెండ్స్‌ అంటూ సంబోధించే సెల్ఫీ స్టైల్‌ ‌వీడియోలు, జెన్‌ ‌జీలో ప్రాచుర్యం పొందిన భాషను ఉపయోగించడం వంటివి ఆయన సోషల్‌‌మీడియా కమ్యూనికేషన్‌‌లో కొత్త ప్రయోగాలుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానికి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 106 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నప్పటికీ.. ఫాలోవర్ల సంఖ్య ఒక్కటే యువత రాజకీయ మద్దతును నిర్ధారించదని నిపుణులు చెప్తున్నారు.

​బీజేపీని ఇరుకున 
పెడుతున్న యువత నిరసనలు
ఇటీవల దేశంలో జరిగిన యువత నిరసనలు బీజేపీ సోషల్‌మీడియా వ్యూహంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వ్యంగ్య ధోరణితో ప్రారంభమైన కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం మీమ్స్‌, లైవ్‌‌స్ట్రీమ్స్‌, ఇన్‌‌స్టాగ్రామ్‌ ‌రీల్స్‌ ‌ద్వారా విస్తరించింది. ఆన్‌‌లైన్‌ ‌ట్రెండ్‌ అనేది నిరసనగా ఎలా మారుతుందో ఈ ఉద్యమం చూపిందని విశ్లేషకులు చెప్తున్నారు. యువత సోషల్‌‌మీడియా వినియోగాన్ని
బీజేపీ ఇంతకాలం అనుసరించిన పద్ధతుల్లో పూర్తిగా అర్థం చేసుకోలేదా అన్న చర్చ కూడా మొదలైంది.

​మోడీ ‘ఫ్రెండ్స్‌’ వీడియోకు సెటైర్ల వెల్లువ
‘నీట్‌’ విషయంలో యువత నిరసనల సమయంలో మోడీ చేసిన తొలి సెల్ఫీ-స్టైల్‌ వీడియోపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆయన ‌‘ఫ్రెండ్స్‌’ అని చెప్పిన తర్వాత వచ్చిన విరామాన్ని నెటిజన్లు వివిధ రకాల ఎడిట్స్‌, జోక్‌‌లతో వైరల్‌ ‌చేశారు. మోడీ సందేశాన్ని ఆయన ఉద్దేశించిన విధంగా కాకుండా వ్యంగ్యంగా ప్రచారం జరగడం అనేది బీజేపీ పొలిటికల్‌ ‌కమ్యూనికేషన్‌‌లో కీలక సమస్యను బయటపెట్టిందని విశ్లేషకులు చెప్తున్నారు.

​‘ట్రెండ్స్‌ ‌కాదు.. మా సమస్యలు వినండి’
యువతను ఆకట్టుకోవాలంటే వారి భాషను, యాసను, రీల్స్‌ ‌ఫార్మాట్‌‌ను అనుకరించడం మాత్రమే సరిపోదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేండ్లు వ్యవహరించిన తీరుకు భిన్నంగా మోడీ, బీజేపీలు చేస్తున్న రీల్స్‌ను ఒక రాజకీయ కోణంలోనే యువత చూస్తోందని అంటున్నారు. ఇలాంటి వీడియోల్లో మాత్రం యువత, విద్యార్థుల నిరసనలకు కారణమైన అసలు సమస్యలపై మాత్రం సమాధానాలు కనిపించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

​‘వాట్సాప్‌ ‌మోడల్‌‌’కు ‘ఇన్‌‌స్టా’ భిన్నం
మిచిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సోషల్‌మీడియా రాజకీయ వినియోగ నిపుణులు జోయోయీట్‌ ‌పాల్‌ అభిప్రాయం ప్రకారం… వాట్సాప్‌, ఎక్స్‌‌లో ఉన్న మద్దతుదారుల నెట్‌‌వర్క్‌ ‌ద్వారా ఒక సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం బీజేపీ బలంగా అలవర్చుకున్న వ్యూహం. కానీ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఖాతా నుంచి వచ్చిన రీల్‌‌కు కూడా కోట్లాది వ్యూస్‌ ‌రావచ్చు. అదే సమయంలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న ఖాతా నుంచి వచ్చిన కంటెంట్‌ ‌కొన్ని వేల వ్యూస్‌‌కే పరిమితం కావచ్చు. కాబట్టి ఇందులో ఫాలోవర్ల సంఖ్యతో సంబంధం ఉండదనీ, ప్రజలను ఎంతగా ఎంగేజ్‌ ‌చేస్తుంన్నదే కీలకం.

​వైరల్‌ అయినంత మాత్రానా చాలదు…
మోడీ తొలి ఇన్‌‌స్టాగ్రామ్‌ ‌రీల్‌ ‌వైరల్‌‌గా మారి 400 మిలియన్లకు పైగా వ్యూస్‌ ‌సాధించింది. యువతలో కొందరు దానిని తమదైన వ్యంగ్య శైలిలో ఎడిట్‌ ‌చేసి పంచుకున్నారు. ఇది మోడీకి, బీజేపీకి ఇబ్బందిగా మారింది. కాబట్టి ఒక నాయకుడు పెట్టిన వీడియో ఎంతమందికి చేరిందన్నదే ముఖ్యం కాదనీ, అది చూసిన ప్రజలు దాన్ని ఏ అర్థంలో తీసుకున్నారు? అన్నదీ కీలకమని నిపుణులు చెప్తున్నారు.

​మంత్రులకు ‘సోషల్‌మీడియా రిపోర్ట్‌కార్డు’
యువతతో డిజిటల్‌ అనుసంధానం పెంచడంపై కేంద్ర మంత్రులకు కూడా ‘అధిష్టానం’ నుంచి సూచనలు వచ్చినట్టు తెలిసింది. నిరసనల సమయంలో మంత్రులు సోషల్‌‌మీడియా ఎంగేజ్‌‌మెంట్‌ ‌పెంచుకోవాలని మోడీ సూచించినట్టు సమాచారం. అనంతరం మంత్రుల సోషల్‌ ‌మీడియా పనితీరుపై రిపోర్ట్‌ ‌కార్డు ఇచ్చి, వివిధ ప్లాట్‌‌ఫారమ్‌‌లలో మరింత చురుకుగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. అదే సమయంలో 2015 నుంచి బీజేపీ సోషల్‌మీడియా విభాగానికి నాయకత్వం వహించిన అమిత్‌ ‌మాలవీయ స్థానంలో మార్పు చోటుచేసుకోవడం కూడా చర్చకు దారితీసింది. నిరసనల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఆన్‌లైన్‌ నెరేటీవ్‌‌ను పార్టీ సమర్థంగా ఎదుర్కోలేకపోయిందన్న విమర్శలు ఈ పరిణామంతో ముడిపడ్డాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

​కొత్త తరం.. కొత్త రాజకీయ భాష
భారత జనాభాలో 60 శాతానికి పైగా 35 ఏండ్లలోపు వారేననీ, 2029 లోక్‌‌సభ ఎన్నికల నాటికి జెన్‌ ‌జీ కీలక ఓటర్లుగా ఎదుగుతారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఈ కారణంతోనే రాజకీయ పార్టీలు వారిని చేరుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. అయితే వారిని చేరుకోవడం కోసం రీల్స్‌ ‌చేస్తే మాత్రమే సరిపోదనీ, వారి సమస్యలను అర్థం చేసుకొని, పరిష్కరించాలనీ, లేకపోతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి యువత నుంచి ఎదురైన చేదు అనుభవాలే కనిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -