జీవితం అంటే నిర్మలంగా సాగే జీవనది కాదు…
నిత్యం అలలతో అలజడి రేపే అంతులేని సముద్రం…
కాలం కదిలించిన క్షణాలే అలలై,
కర్మ కదిలించిన కష్టాలే కెరటాలై,
ఒక్కోసారి నావను ఆకాశానికెత్తి,
మరొక్కసారి అగాధంలోకి తోసేస్తాయి…
అలల తాకిడికి నావ ఊగిపోతే ఆశ్చర్యమేముంది?
తుఫాను తాకిడికి తెరచాప కకావికలైతే వింతేముంది?
తీరం చేరాలనే తపనతో తెరచాపను సరిచేసే నావికుడే కదా ముఖ్యం!
మనిషి జీవితంలో ఒడిదొడుకులు ఎదురైతే వింతేముంది?
కష్టసుఖాలు లేని జీవితంలో ఆనందమేముంది?
జీవితంలో విజయం సాధించాలనే ఆలోచనే కదా ముఖ్యం!
ఒడిదొడుకులు లేని జీవితం ఒడ్డు లేని నావలాంటిది,
కష్టసుఖాలు లేని జీవితం నాదం లేని పాటలాంటిది,
పోరాటం లేని ప్రయాణం ఎప్పుడు పరాక్రమపు పరిమళం వెదజల్లదు!
సమస్యలు సముద్రపు అలలైతే, సహనం నావకు చుక్కాని…
ఆత్మవిశ్వాసం తెరచాప…ప్రయత్నమే తెడ్డు… ఆశయమే దిక్సూచి…
ఎన్ని అలలు ఎదురొచ్చినా నావికుడు దిక్కువైపు దృష్టి సారిస్తే తీరం దూరం కాదు…
అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనా
మనిషి తన మీద తాను నమ్మకం కోల్పోకపోతే విజయానికి అవరోధాలు అడ్డు కాదు..
అలలను చూసి నావ ఆగదు,
అడ్డంకులను చూసి అడుగు ఆగకూడదు;
సముద్రం లోతు చూసి తెడ్డు జారదు,
సమస్యల లోతు చూసి ప్రయత్నం చావకూడదు..
జీవితం అనే సముద్రంలో అలలు ఆగాలని కోరుకోకు…
అలల మధ్యే నావ నడపడం నేర్చుకో.
ఎందుకంటే
తుఫాను లేని సముద్రంలో నావికుడి నైపుణ్యం తెలియదు;
అవరోధాలు లేని జీవితంలో మనిషి అసలు బలం తెలియదు.
కోట దామోదర్, 9391480475
జీవితం తీరం చేరే నావ
- Advertisement -
- Advertisement -



