– నీటి వినియోగంలో అప్రమత్తత అవసరం
– ప్రత్యామ్నాయ పంటలు, సూక్ష్మ సాగునీటి పద్ధతులు అవలంబించాలి
– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లో వానాకాలం ప్రారంభం నుంచి వర్షపాతం లోటు కొనసాగుతోంది.ఆగస్టు 23 నాటికి డివిజన్లో సాధారణ వర్షపాతం కంటే 33 శాతం తక్కువగా వర్షం నమోదైంది. దీంతో సాగునీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోంది.మరోవైపు భూగర్భజల మట్టాలు కూడా గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో పడిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించడంతోపాటు తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) పెంటేల రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆగస్టు 23 నాటికి అన్నపురెడ్డిపల్లి మండలంలో సాధారణ వర్షపాతం 649.7 మి.మీ. కాగా 454.3 మి.మీ. మాత్రమే నమోదై 30 శాతం లోటు ఏర్పడింది. అశ్వారావుపేటలో సాధారణం 626.5 మి.మీ.కు గాను 324 మి.మీ. నమోదై 48 శాతం లోటు నమోదైంది.
చంద్రుగొండలో సాధారణం 620.5 మి.మీ.కు గాను 721 మి.మీ. వర్షపాతం నమోదై 16 శాతం అధికంగా ఉంది. దమ్మపేటలో సాధారణం 696.3 మి.మీ.కు గాను 287.2 మి.మీ. నమోదై 59 శాతం లోటు ఉండగా.. ములకలపల్లిలో సాధారణం 751.8 మి.మీ.కు గాను 456.2 మి.మీ. నమోదై 39 శాతం లోటు ఉంది. మొత్తంగా అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లో ఆగస్టు 23 నాటికి సాధారణంగా 668.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 448.5 మి.మీ. మాత్రమే నమోదైంది.దీంతో డివిజన్లో 33 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది.
భూగర్భజలాలపై ఆందోళన:
వర్షపాతం లోటు ప్రభావం భూగర్భజలాలపైనా కనిపిస్తోంది. 2026 జూలైలోని భూగర్భజల లభ్యతను గతేడాది జూలైతో పోలిస్తే పలు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దమ్మపేటలో గత జూలైలో 42.58 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ జూలైలో 42.71 మీటర్లకు పడిపోయాయి.
చంద్రుగొండలో 23.31 నుంచి 23.43 మీటర్లకు, అశ్వారావుపేటలో 20.93 నుంచి 33.63 మీటర్లకు, అన్నపురెడ్డిపల్లిలో 15.81 నుంచి 16.36 మీటర్లకు, ములకలపల్లిలో 7.55 నుంచి 9.93 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది.
బోరు నీటిపై ఆధారపడే రైతులు అప్రమత్తం:
బోర్ల ద్వారా సాగునీటిని అందించే రైతులు భూగర్భజలాల పరిస్థితిని గమనిస్తూ నీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ సూచించారు.వర్షపాతం, భూగర్భజలాల లభ్యతను బట్టి పంటలకు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగులో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను పాటించడం ద్వారా పరిమితంగా ఉన్న భూగర్భజలాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చన్నారు.
ప్రతి వాన చుక్కను ఒడిసిపట్టాలి:
అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పడే ప్రతి వాన చుక్కను ఒడిసిపట్టి భూగర్భజలాల రీచార్జికి చర్యలు చేపట్టాలన్నారు. వి.బి.జి. రామ్జీ పథకం కింద ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని సాధించేందుకు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.నేల ఆరోగ్యం మెరుగుదల, నేలలో తేమ సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏడీఏ పెంటేల రవికుమార్ రైతులను కోరారు.



