ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించాలి
టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు తలపెట్టిన ఆందోళనకు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు జి దేవీప్రసాద్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఎన్ఈహెచ్ఎస్) అమలుపై ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన ఉందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఈహెచ్ఎస్ పథకం ఈనెల 17 నుంచి అమల్లోకి వచ్చిందని ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. నూతన పథకం కింద 4,440 మంది లబ్ధి పొందారని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమని తెలిపారు. వారి పేర్లు, చికిత్స పొందిన ఆస్పత్రుల వివరాలు, అందించిన వైద్య సేవలు, చెల్లించిన నిధుల వివరాలను ప్రభుత్వం పారదర్శకంగా వెబ్ సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. డిజిటల్ కార్డులు లేకుండా, వ్యవస్థలను బలోపేతం చేయకుండా ఉద్యోగులు, పెన్షనర్లు నగదు రహిత వైద్య సేవలు ఎలా పొందగలరో చెప్పాలని కోరారు. మే నుంచే ప్రీమియం వసూలు చేసి ఈనెల 17 నుంచి అమలు చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో నగదు రహిత ఇన్‌పేషెంట్ (ఐపీ) సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలు కూడా అందుబాటులోకి తేవాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని తెలిపారు. మే ఒకటి నుంచి జరిగిన అర్హత కలిగిన వైద్య చికిత్సలకు వెంటనే మెడికల్ రీయింబర్స్మెంట్ చేయాలని సూచించారు. పెన్షనర్లకు ఆర్నెల్లకోసారి నగదు రహిత సమగ్ర హెల్త్ చెకప్ సౌకర్యం కల్పించాలని కోరారు. వెల్నెస్ సెంటర్లలో అవసరమైన వైద్యులు, సిబ్బంది, ల్యాబ్ సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచిం చారు .ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



