పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
బీమా పథకం అమలు చేయాలి
వృత్తి లాభదాయకమే.. ప్రోత్సాహం లేకనే పెంపకందారుల ఇక్కట్లు
గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గొర్రెల పామ్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించి యువతకు ఉపాధి కల్పించాలనీ, రాష్ట్రంలో గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దార్ల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్లలోని కాసాని ఐలయ్యనగర్(జి.జి.గార్డెన్)లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రవీందర్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం వృత్తిపై ఆధారపడి 10 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అతధ్యిక గొర్రెలు, మేకల సంపద, అధిక మాంసం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. 20వ పశుగణన ప్రకారం తెలంగాణలో 191 లక్షల గొర్రెలు, 49.48 లక్షల మేకలున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నకమతాలు పెరగడం, నీటిలభ్యత పెరిగి భూమి సాగులోకి రావడం, రియల్టర్లు భూములను కొనుగోలు చేసి ఫెన్సింగ్ వేయడం వంటి కారణాల వల్ల మేతకు ఇబ్బందులు పెరుగుతున్నాయని వాపోయారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి గ్రామంలోనూ 8 నుంచి 10 శాతం భూమిని పశుగ్రాసం కోసం వదిలేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొర్రెలు, మేకల అమ్మకాల మార్కెట్లపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో గొర్ల కాపర్లు దళారీల చేతిలో నష్టపోతున్న తీరును వివరించారు. గొర్రె బరువు లెక్క శాస్ర్తీయ పద్ధతిలో అమ్మకాలు చేపట్టే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల ని డిమాండ్ చేశారు. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్.ఎల్.ఎం) పథకాన్ని కేంద్రం నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. ఆ పథకాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడేలా కాకుండా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన గొర్రెల పంపిణీ పథకం అవినీతి పేరుతో అటకెక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొర్ల కాపర్ల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని విమర్శించారు. మ్యానిఫెస్టోలో హామీనిచ్చిన గొల్లకురుమలకు రూ.2 లక్షల నగదు బదిలీ పథకం ఏమైందని ప్రశ్నించారు. పశుసంవర్థక శాఖను రేవంత్‌రెడ్డి సర్కారు గాలికొదిలేసిందని విమర్శిం చారు. కనీసం నట్టల మందును కూడా సరైన సమయంలో అందించలేని స్థితిలో రాష్ట్ర సర్కారు ఉందని ఎత్తిచూపారు. గొర్రెల కాపర్లపై గ్రామాల్లో దాడులు జరుగుతుండటం, మందల నుంచి దొంగలు గొర్రెలను ఎత్తుకుపోతుండటం వంటి చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకల పెంపకం వృత్తి లాభదాయకమే అయినప్పటికీ పాలకుల ప్రోత్సాహం సరిగా లేక కాపర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరును వివరించారు. గొర్ల కాపర్ల సంక్షేమం, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదాల్లో చనిపోతున్న గొర్ల కాపరుల కోసం ఎక్స్‌గ్రేషియా పథకాన్ని రూ.10 లక్షలకు పెంచాలనీ, కాపరి చనిపోయిన నెలరోజుల్లో బాధిత కుటుంబానికి ఆ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగాలతో, కుక్కలు, తోడేళ్ల దాడిలో గొర్రెలు, మేకలు చనిపోతున్న నేపథ్యంలో ఒక బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. 50 ఏండ్లు దాటిన కాపర్లకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చిహ్నమైన నల్లగొంగడి, నల్లగొర్రె (డక్కన్) జాతి అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఏపీ, మహారాష్ట్ర, తదితర రాష్ర్టాల పశుపోషణ చేసే రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
గొర్రెల ఫామ్స్ ద్వారా యువతకు ఉపాధి కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



