చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం రూ.1000కోట్లు కేటాయించాలి
దళితుల అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
1974లో ఏర్పడిన ఎస్సీ కార్పొరేషన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశాయని, చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కు రూ.వెయ్యి కోట్లు కేటాయించి జీవం పోయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆ సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుశరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం రుణాల కోసం 16 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. కానీ ఏ ఒక్కరికీ రుణం ఇచ్చిన దాఖలాల్లేవని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ బడ్జెట్ లేకపోవడంతో విడుదల కావడం లేదన్నారు. గతంలో కేవలం రెండు రకాల పథకాలు మాత్రమే కేటాయించి దానిని నీరుగార్చారని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు అమలు చేసి దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించేది అని తెలిపారు. గతంలో సుమారు 100 రకాల స్కీములు అమలయ్యాయని, ప్రస్తుతం బడ్జెట్ లేమితో ఎస్సీ కార్పొరేషన్ వెలవెలబోతోందని చెప్పారు. దళితులకు భూ సంస్కరణల చట్టం అనంతరం అసైన్డ్ భూములు కేటాయించారని, ఆ భూములకు పట్టాలు లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్లకు అవకాశం లేకుండా పోయిందన్నారు. సేద్యం చేసుకోవడానికి అవకాశం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమాలకు దళితులను అనర్హులుగా చేశారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలు, చెత్త డంపింగ్ యార్డుల పేరిట దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుందని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి సేద్యానికి అన్ని రకాల సబ్సిడీలతో కూడిన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల పట్టాల కోసం అన్ని సామాజిక తరగతులను కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడ్తామని హెచ్చరించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల ఎక్స్ గ్రేషియాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహితులకు రావాల్సిన పెండింగ్ ప్రోత్సాహకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఏర్పడుతున్నందున దళితులు, పేదలకు ఉపాధి కోసం తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు దైద దేవయ్య, బొంగరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తలలేని మొండెంలా ఎస్సీ కార్పొరేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



