Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెరోల్‌ ఖైదీ.. సర్కార్‌ పదవి

పెరోల్‌ ఖైదీ.. సర్కార్‌ పదవి

- Advertisement -


అధికారుల కండ్లు కప్పి 
30 ఏండ్లు ప్రభుత్వ సర్వీస్‌
విస్తుపోయిన తెలంగాణ హైకోర్టు
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పెరోల్‌పై విడుదలై నాలుగు దశాబ్దాలకు పైగా జైలుకు తిరిగి వెళ్లని జీవిత ఖైదీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసే వరకు అధికారులకు చిక్కకుండా ఉన్న ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. పెరోల్‌ గడువు ముగిసిన తర్వాత ఖైదీ తిరిగి జైలుకు చేరాడా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆక్షేపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీలపై నిరంతర నిఘా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జైళ్ల శాఖకు సూచించింది. పెరోల్‌ నిబంధనలను ఉల్లంఘించి 40 ఏండ్లకు పైగా బయట ఉన్న సండుల వీరన్నను తిరిగి జైలుకు పంపుతూ అధికారులు తీసుకున్న చర్యలను కోర్టు సమర్థించింది. వైద్య కారణాలతో ఆయనను విడుదల చేయాలంటూ భార్య సండెల చారమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. జీవిత ఖైదీగా ఉన్న వ్యక్తి ఇంతకాలం వ్యవస్థకు దొరకకుండా ప్రభుత్వ ఉద్యోగం చేయడం, ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందడం, పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ పొందడం తీవ్ర వ్యవస్థాగత లోపాలను సూచిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళితే వీరన్నపై 1982లో నమోదైన హత్య కేసులో వరంగల్‌ అదనపు జిల్లా న్యాయస్థానం 1983 జూన్‌ 9న జీవిత ఖైదు విధించింది. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడు అదే ఏడాది డిసెంబర్‌ 17న 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. అనంతరం 1984 మార్చి 17 వరకు గడువు పొడిగించుకున్నాడు. మార్చి 18న తిరిగి జైలుకు రావాల్సి ఉన్నప్పటికీ రాకుండా అదృశ్యమయ్యాడు. తన అసలు వివరాలను దాచుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించిన వీరన్న సుమారు 30 ఏండ్ల పాటు సర్వీసులో కొనసాగి 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నాడు. 2013లో పదవీ విరమణ చేసి, ఆ తర్వాత పెన్షన్‌ కూడా పొందాడు. అతడి ఆచూకీ కోసం అధికారులు 2012 నుంచి 2020 మధ్య ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోగా, చివరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ 2024 మే 16న గుర్తించి అరెస్టు చేసి తిరిగి జైలుకు తరలించింది. పెరోల్‌ ఉల్లంఘనకు సంబంధించి అతడికి లభించిన సుమారు 27 రోజుల రిమిషన్‌ను రద్దు చేయడంతోపాటు మూడేండ్ల పాటు పెరోల్, ఫర్లఫ్‌ ఇవ్వకుండా జైలు అధికారులు నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -