– నాంపల్లిలో శానిటేషన్ పనులను పరిశీలించిన కమిషనర్ రోనాల్డ్ రోస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలో శానిటేషన్, స్టార్మ్ వాటర్ నాలా పనులను నాంపల్లి శాసన సభ్యులు మాజీద్ హుస్సేన్‌తో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిషనర్‌కు స్టార్మ్ వాటర్ నాలా, శానిటేషన్, బాల్కపూర్ నాలా పనుల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ అఘాపూర్ నాలా కల్వర్టు, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా, తాజ్ నగర్, జీబ్రా డ్రైన్ నాలా పనులను కమిషనర్ పరిశీలించారు. అఘాపూర్ నాలా కల్వర్టు పనులు స్లాబ్ పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా నిర్మాణం పనులు చేపట్టేందుకు క్రింది భాగంలో ఉన్న స్లమ్ కాలనీ ఇబ్బంది పడుతారని అధికారులు చెప్పడంతో అలైన్మెంట్ మార్చి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీబ్రా స్టార్మ్ వాటర్ నాలా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. బాల్కపూర్ నాలా పనులకు భూసేకరణ పూర్తి చేసి సత్వరమే పూర్తి చేయాలనీ ఆస్తులు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి రిటర్నింగ్ వాల్ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోన్ కమిషనర్ వెంకటేష్ దోత్రె, ఎస్.ఇ రత్నాకర్, ఎస్.ఎన్.డి.పి కిషన్, ఈ.ఈ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.