Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

- Advertisement -

–  పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
–  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రభుత్వ అధికారులతో కలిసి అర్హులైన పేద కుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 15 ఏళ్లుగా అనేక మంది అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యావసర సరుకులపై సబ్సిడీతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు పొందడంలో పేద కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు. అర్హత ఉన్న ఏ కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమానికి దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నూతన రేషన్ కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీపై బియ్యం వంటి నిత్యావసర సరుకులు పొందడంతో పాటు పలు సంక్షేమ పథకాలకు అర్హతను నిర్ధారించే ముఖ్యమైన పత్రంగా రేషన్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను అర్హులకు చేరవేయడంలో రేషన్ కార్డులు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోవైపు రాష్ట్రంలో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు. మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కళ్యాణమస్తు–షాదీ ముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాలతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చివరి అర్హుడి వరకు చేరాలని, పేద కుటుంబాల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.ఈ 

కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, మాచారెడ్డి మాజీ ఎంపీపీ ( సురేష్ ) నర్సింగరావు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాచారెడ్డి సర్పంచ్ సంతోష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, భిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ సొసైటీ చైర్మన్లు పూల్ చంద్, స్వామిగౌడ్, రాజమౌళి, సత్యనారాయణ, బాలరాజుగౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -