– కమీషనర్ దిలీప్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 156 వ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి జారీ చేసిన ఎస్‌ఐఆర్ నోటీసులపై ఈ నెల 28న నోటీస్ హియరింగ్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తుది దిలీప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏఈఆర్‌ఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న సంబంధిత ఓటర్లు తమ అభ్యంతరాలు, వివరణలు సమర్పించేందుకు అవసరమైన ఆధారాలు, సంబంధిత పత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత తేదీన మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన పత్రాలను సమర్పించాలని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు నోటీస్ హియరింగ్‌ను సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా హాజరై తమ అభ్యంతరాలు, వివరణలను సంబంధిత పత్రాలతో సమర్పించాలని అధికారులు కోరారు.



